వైసీపీలో చేరికకు ముందు.. ముద్రగడ మరో సంచలన లేఖ!

మార్చి 14న గుంటూరు జిల్లా తాడేపల్లిలో ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

Update: 2024-03-11 06:24 GMT

జనసేనలో చేరాలా, వైసీపీలో చేరాలా అని అనేక తర్జనభర్జనలు పడిన తర్వాత కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. తాను, తన కుమారుడు ఎలాంటి పదవులు ఆశించకుండా వైసీపీలో చేరుతున్నామని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్‌ ఏదైనా పదవి ఇస్తే తీసుకుంటామని చెప్పారు.

మార్చి 14న గుంటూరు జిల్లా తాడేపల్లిలో ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా మరో లేఖను మీడియాకు విడుదల చేశారు.

ఈ లేఖలో ముద్రగడ పద్మనాభం.. ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు మీడియా ద్వారా మీకందరికి తెలుసని భావిస్తున్నానన్నారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపు మేరకు వైసీపీలోకి వెళ్ళాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నానన్నారు. మరోసారి ముఖ్యమంత్రి పీఠం మీద వైఎస్‌ జగన్‌ను కూర్చోపెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా పని చేస్తానని ముద్రగడ తెలిపారు. పేదలకు మరెన్నో సంక్షేమ పథకాలు అందింపజేయాలని, ఆయనతో అభివృద్ధి పనులు చేయించాలనే ఆశతో ఉన్నానని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇక, మీ బిడ్డను అయిన తాను ఎప్పుడు తప్పు చేయలేదు అని ముద్రగడ పద్మనాభం గుర్తు చేశారు. మార్చి 14న కిర్లంపూడి నుంచి ఉదయం 8 గంటలకు తాడేపల్లికి బయలుదేరుతున్నానని తెలిపారు. మీకున్న అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో పాలుపంచుకోవాలని కోరారు. తాడేపల్లికి రావాలని కోరుతున్నాను అని ఆ లేఖలో తన అభిమానులకు, అనుచరులకు పిలుపునిచ్చారు.

ఈ ప్రయాణంలో మీకు కావాల్సిన ఆహారాన్ని, ఇతర అవసరాలను మీ వాహనంలోనే తెచ్చుకోవాలని ముద్రగడ సూచించారు. వాస్తవానికి చాలా ముందుగానే వైసీపీలోకి వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ పై తీవ్ర విమర్శలు చేశారు. దమ్ముంటే పిఠాపురంలో తనపైన పవన్‌ పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. లేదంటే కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపైన పోటీ చేయాలని చాలెంజ్‌ చేశారు.

వైసీపీ తరఫున తన కుమారుడికి ప్రత్తిపాడు అసెంబ్లీ లేదా పిఠాపురం అసెంబ్లీ సీటు, తనకు కాకినాడ ఎంపీ సీటును ఆశించారు. అలాగే సీఎం వైఎస్‌ జగన్‌ తన ఇంటికి వచ్చి తనను ఆహ్వానించాలని ఆయన కోరుకున్నారని వార్తలు వచ్చాయి.

అయితే సీఎం జగన్‌.. ముద్రగడ ఇంటికి వెళ్లలేదు. అలాగే ఆయన ఆశించిన ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ పార్లమెంటు సీట్లకు ఇప్పటికే ఇంచార్జులను ప్రకటించారు. దీంతో వైసీపీలోకి తాను రానని.. వైసీపీ నేతలెవరూ తనను సంప్రదించవద్దని ముద్రగడ సూచించారు. జనసేన నేతలు ఆయనను కలవడంతో ఆ పార్టీలో చేరే దిశగా అడుగులేశారు.

ఈ విషయంలోనూ పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా తన ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించకపోవడం, పొత్తులో భాగంగా 24 సీట్లనే తీసుకోవడం వంటి చర్యల ద్వారా ముద్రగడ ఘాటుగా స్పందించారు. ఇటీవల పవన్‌ ను ఉద్దేశించి ఘాటు లేఖ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానించడం, ఇందుకు ఆయన అంగీకరించడం జరిగిపోయాయి.

ఇప్పటికే ముద్రగడ కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ ఇలా అన్ని పార్టీల్లో పనిచేశారు. ఏ పార్టీలోనూ కుదురుగా ఉండలేకపోయారు. ఇప్పుడు వైసీపీలో చేరుతున్న ఆయన అందులో ఎన్నాళ్లు ఉంటారో చూడాల్సిందే!

Tags:    

Similar News