ఎన్టీఆర్ కి ఏమి తెలుసు...నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!

ఇప్పటికి నాలుగు దశాబ్దాల క్రితం అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి నాదెండ్ల అధికారంలోకి వచ్చారు అని నేటికీ విమర్శిస్తారు.

Update: 2024-11-17 00:30 GMT

తెలుగుదేశం పార్టీని నేనే రూపకల్పన చేశాను ఆ పార్టీని నేనే ఏర్పాటు చేశాను అని చెప్పుకుంటారు మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు. ఆయన గురించి తెలియాలీ అంటే 1984 ఆగస్టు సంక్షోభం ఎపిసోడ్ కి వెళ్లాల్సిందే. ఇప్పటికి నాలుగు దశాబ్దాల క్రితం అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి నాదెండ్ల అధికారంలోకి వచ్చారు అని నేటికీ విమర్శిస్తారు.

కానీ అది అన్న గారి విధానాల మీద తిరుగుబాటు అని నాదెండ్ల అనేక ఇంటర్వ్యూలలో చెప్పారు. ఇక లేటెస్ట్ గా ఆయన ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీని ఆ పార్టీ విధి విధాలను ఇంకా చెప్పాలంటే ఎన్నికల మేనిఫేస్టోని సైతం తానే తయారు చేశారు అని చెప్పారు.

ఆస్తిలో ఆడబిడ్డలకు సగం వాటా ఇవ్వాలని తాను టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాను అని అప్పటికి మూడు దశాబ్దాలుగా ప్లీడర్ గా పనిచేసిన తన అనుభవం నుంచి పుట్టిన విప్లవాత్మకమైన ఆలోచన అది అని నాదెండ్ల చెప్పారు ఆ తరువాత ఆ నిర్ణయమే మహిళలను చైతన్యవంతులుగా చేసింది అని అన్నారు

అంతే కాదు పేదలకు కిలో రెండు రూపాయలకు బియ్యం పధకం సహా అనేక సంక్షేమ పధకాలకు కూడా తానే రూపకల్పన చేసి ఎన్నికల ప్రణాళికలో పెట్టాను అని అన్నారు. వీటన్నిటి గురించి ఎన్టీఆర్ కి ఏమి తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు.

తానూ చంద్రబాబు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచామని అంటారని కానీ తననే వెన్నుపోటు దారుడిగా చిత్రీకరించడానికి కారణం తాను బయటవాడిని చంద్రబాబు సొంత ఇంటి వాడు కావడమే అని అన్నారు. టీడీపీ తాను ప్రారంభిస్తే ఎన్టీఆర్ బ్రెయిన్ చైల్డ్ అని న్యాయపరంగా పోరాటం చేశారని ఆయన వివరించారు. ఎంతో మంది సీఎంలు ఏపీకి చేసినా తన పేరే గుర్తుంచుకోవడానికి కారణం తాను వెన్నుపోటు పొడిచారు అని ప్రచారం చేయడమే అని నాదెండ్ల అన్నారు.

ఇక దేశంలో కుల గణన డిమాండ్ మీద కూడా ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. కులగణన వల్ల ఇబ్బందులే వస్తాయని దేశం ఇంకా ముక్కచెక్కలు అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. కులాల భావన తీసివేయాలని ఆయన అన్నారు.

కులాల ప్రస్తావన లేకుండా కూడా పేదలకు అన్నీ అందించవచ్చు అని అన్నారు. అంతే కాదు భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల కూడా ఏమీ ఉపయోగం లేదని అన్నారు. ఒక రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా మారినా ప్రజలకు ఏమి ఒనగూడిందని ఆయన ప్రశ్నించారు. ఖర్చులు ఎక్కువగా పెరగడం తప్పించి ఏమీ లాభం లేదని అన్నారు

దేశ తొలి ప్రధాని నెహ్రూ కేవలం ఒక్కరే అంబాసిడర్ కారులో పార్లమెంట్ కి వెళ్ళడం తాను చూశాను అని ఈ రోజున ఒక సర్పంచుకు కి కూడా భారీ భద్రత కల్పిస్తూ అనవసరం ఖర్చులు పెంచుతున్నారని అన్నారు. వీటిని అభివృద్ధి వైపు మళ్ళిస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు.

దేశంలో ఆర్ధిక పరిస్థితులను మెరుగుపరచేందుకు పాలకులు చర్యలు తీసుకోవాలి తప్ప కులాలను చూసి చేయాలనుకోవడం కాదని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఒక్కటి చేసారని, కానీ ఈ రోజున మళ్లీ కుల భావన తో పాటు అనేక ఇతర అంశాల వల్ల దేశం విచ్చిన్నం అవుతుందని నాదెండ్ల ఆందోళన వ్యక్తం చేశారు.

తాను ఏ పార్టీలో ప్రస్తుతం లేనని బీజేపీ సభ్యత్వం ప్రధాని మోడీ ఆహ్వానం మేరకే తీసుకున్నాను తప్పించి మరేమీ లేదని అన్నారు. తాను ఇపుడు రాజకీయ స్వేచ్చా జీవిని అని ఆయన అన్నారు. బీజేపీలో కూడా ఏ పదవులూ తాను అడగలేదని అన్నారు. బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ గా కూడా తనకు బీజేపీ అవకాశం ఇచ్చినా తాను వద్దు అని సున్నితంగా వద్దు అన్నానని కూడా నాదెండ్ల చెప్పారు.

Tags:    

Similar News