పవనన్నా అంటూ...తమ్ముడి ప్రేమ...!

ఇక బాలయ్య సైతం పవన్ని పొగిడేశారు. పవన్ సినిమాలు మానుకుని మరీ జనం కోసం ఏపీలో పర్యటిస్తున్నారు అని అన్నారు

Update: 2023-12-20 18:16 GMT

పవన్ కళ్యాణ్ మీద నారా లోకేష్ ప్రేమ చూపించేశారు. యువగళం పాదయాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ తన పవనన్నా అంటూ అభిమానం చాటుకున్నారు. పవనన్నను వైసీపీ ప్రభుత్వం ఎంతగానో ఇబ్బంది పెడుతోంది అని తమ్ముడు నారా లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

పవనన్న అంటే జగన్ కి భయం అంటూ కొత్త విషయమూ చెప్పారు. తన తండ్రి చంద్రబాబు అన్నా తాను అన్నా కూడా జగన్ కి భయమే సుమా అని మరో విషయమూ చెప్పారు. రాష్ట్రానికి పవనన్నా చంద్రబాబు ఇద్దరూ కావాలని నారా లోకేష్ సమన్యాయం చేస్తూ ప్రేమను ప్రకటించారు.

పవనన్న ఏపీ బాగు కోరే వ్యక్తి అని తెగ పొగిడారు. మొత్తానికి చూస్తే నారా లోకేష్ స్పీచ్ లో అత్యధిక భాగం పవన్ కి కేటాయిస్తూ ఆయన అంత గొప్ప వారు లేరని కీర్తించారు. ఇక చంద్రబాబు వంతు వచ్చింది. ఆయన సైతం తన ఉపన్యాసంలో అడుగడుగునా జనసేన జపం చేశారు. మాటి మాటికీ జనసేన టీడీపీ ప్రభుత్వం అంటూ మాట్లాడారు.

తనకూ పవన్ కి ఏపీ బాగు తప్ప మరేమీ అవసరం లేదని బాబు చెప్పుకున్నారు. తామిద్దరం కలసి అయిదు కోట్ల ప్రజల కోసం పని చేస్తున్నామని అన్నారు. జగన్ ని దించేందుకే తాను పవన్ కలిశామని తమది జనం మెచ్చిన పొత్తు అన్నారు.

ఇక బాలయ్య సైతం పవన్ని పొగిడేశారు. పవన్ సినిమాలు మానుకుని మరీ జనం కోసం ఏపీలో పర్యటిస్తున్నారు అని అన్నారు. ఆయన సినిమాల్లో కంటే రోడ్ల మీదనే ఎక్కువగా కనిపిస్తున్నారు అంటేనే అర్ధం చేసుకోవచ్చు ఆయన మనసు ఎక్కడ ఉందో ఆయన ఎలాంటి మంచి మనసు ఉన్న వారో అని ఆకాశానికెత్తేశారు.

మరి ఇంతమంది పొగిడిన తరువాత పవన్ కూడా వారికి పొగడకుండా ఉండలేరు కదా. ఆయన సైతం లోకేష్ పాదయాత్ర చేతల యాత్ర అనేశారు. పట్టుదలగా చేశారు అని మెచ్చుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో తనకు ఎంతో బాధ కలిగిందని అన్నారు. బాబు వంటి లీడర్ ఏపీకి కావాలని అన్నారు. మొత్తం మీద చూస్తే యువగళం సభలో పవన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఆయన మాటలు కూడా యూత్ ని ఆకట్టుకున్నాయి.

Tags:    

Similar News