నరసాపురం ఎంపీడీవో మృతి... ఏలూరు కాల్వలో మృతదేహం!
అవును... జూలై 16న అదృశ్యమైన నరసాపురం ఎంపీడీవో మృతదేహాన్ని విజయవాడ శివార్లలోని ఏలూరు కాల్వలో పోలీసులు గుర్తించారు.
ఫెరీ నిర్వహణ బకాయిల వ్యవహారంలో నరసాపురం ఎంపీడీవో స్థాయి అధికారి వెంకటరమణ ఆత్మహత్య చేసుకుంటానంటూ అదృశ్యం అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన అదృశ్యం వ్యవహారం విషాదాంతమైంది. ఇందులో భాగంగా... తాజాగా ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
అవును... జూలై 16న అదృశ్యమైన నరసాపురం ఎంపీడీవో మృతదేహాన్ని విజయవాడ శివార్లలోని ఏలూరు కాల్వలో పోలీసులు గుర్తించారు. అదృశ్యమైన వారం రోజుల తర్వాత ఆయన మృతదేహాన్ని ఏలూరు కాల్వలో సహాయక బృందాలు వెలికితీశాయి! ఈయన అదృశ్యం, అందుకు దారి తీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ జూలై 17న ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో రాష్ట్రంలో ఫెరీ బకాయిల వివరాలు, బకాయిలు పెడుతున్నవారి వివరాలను తక్షణమే తనకు అందిచాలని అధికారులను ఆదేశించారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్. ఈ నేపథ్యంలోనే ఒక ఎంపీడీవో అదృశ్యమయ్యే పరిస్థితికి కారకులైనవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
కాగా... ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్ల నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ జూలై 15 నుంచి కనిపించకుండా పోయారంటూ కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆయన విజయవాడలోని కానూరు మహదేవపురం కాలనీలో ఉంటున్నారు. నరసాపురంలో పనిచేస్తున్న ఆయన సెలవురోజుల్లో ఇంటికి వచ్చేవారు. ఈ నేపథ్యంలోనే జూలై 10 - 20 వరకూ సెలవులపై కానూరు వచ్చారు.
ఈ క్రమంలో జూలై 15న మచిలీపట్నం వెళ్తున్నట్లు చెప్పి ఇంటినుంచి బయలుదేరిన ఆయన అదే రోజు రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి, బందరులో ఉన్నట్లు తెలిపారు.. రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పినట్లు ఆయన భార్య వెళ్లడించారు! అయితే అదేరోజు అర్ధరాత్రి దాటాక... "తన పుట్టిన రోజైన జూలై 16.. చనిపోయే రోజు కూడా.. అందరూ జాగ్రత్త" అని భార్యకు మెసేజ్ పంపించి, ఫోన్ స్విచ్చాఫ్ చేసినట్లు చెబుతున్నారు.
దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో.. ఆయన మొబైల్ సిగ్నల్ ను ట్రాక్ చేయడంతో.. అది విజయవాడలోని మధురానగర్ ఏలూరు కాల్వ వద్ద సిగ్నల్ కట్ అయినట్లు గుర్తించారు. దీంతో.. ఆయన అదే కాల్వలోకి దూకి ఉంటారని అనుమానించిన పోలీసులు గత వారం రోజులుగా ఏలూరు కాల్వలోనే గాలింపు కొనసాగిస్తున్నారని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన మృతదేహాన్ని విజయవాడ శివార్లలోని ఏలూరు కాల్వలో పోలీసులు గుర్తించారు! దీంతో... ఎంపీడీవో అదృశ్యం వ్యవహారం విషాదంతమైనట్లయ్యింది!