అమరావతి 2.0.. 250 ఎకరాల్లో ప్రధాని సభ

రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ.. మరోసారి రాజధానిలో పర్యటించనున్నారు.;

Update: 2025-03-24 07:20 GMT

రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ.. మరోసారి రాజధానిలో పర్యటించనున్నారు. అమరావతి పునఃనిర్మాణ పనుల ప్రారంభానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీని ప్రభుత్వం ఆహ్వానించింది. గత వారం ఢిల్లీలో పర్యటించిన సీఎం చంద్రబాబు అమరావతి పనుల ప్రారంభానికి రావాల్సిందిగా పీఎం మోదీని ఆహ్వానించారు. ప్రధాని ఏ తేదీన వచ్చేది ఇంకా ఖరారు కాకపోయినా, 250 ఎకరాల్లో భారీ బహిరంగ సభకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వెలగపూడిలోని సచివాలయానికి సమీపంలో భూమిని ఎంపిక చేశారు. ఆదివారం నుంచి భూమి చదును పనులు కూడా మొదలయ్యాయి.

సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీ మధ్య ప్రధాని పర్యటన ఉండే అవకాశం ఉంది. సుమారు రూ.42 వేల కోట్లతో రాజధాని అమరావతి పనులకు ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. 2015లో తొలిసారిగా రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పలు పనులు జరిగాయి. ప్రస్తుతం ఉన్న సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు అన్నీ నిర్మాణమయ్యాయి. ఇక 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతి పనులు నిలిచిపోయాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని పనులు తిరిగి మొదలయ్యాయి. రూ.42 వేల కోట్లతో పనులు ప్రారంభానికి ప్రధాని మోదీని సీఎం ఆహ్వానించారు. అయితే ప్రధాని ఏ తేదీన పర్యటించేది నిర్దిష్టంగా ప్రకటించకపోయినప్పటికీ వెలగపూడి సచివాలయం పక్కన ఎస్-9 రోడ్డుకు పశ్చిమంగా 250 ఎకరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహణకు స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం సదరు ప్రాంగణాన్ని ఆదివారం నుంచి చదును పనులు ప్రారంభమయ్యాయి. సుమారు 16 పొక్లయిన్లు, 4 భారీ క్రేన్లు, 6 ట్రక్కులతో పనులు పెద్ద ఎత్తున మొదలుపెట్టారు. ఈ నెల 30న ఈ ప్రాంతంలోనే 30-40 ఎకరాల్లో ఉగాది ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రధాని సభను కూడా ఇక్కడే ఏర్పాటు చేసే ఉద్దేశంతో విస్తీర్ణాన్ని 250 ఎకరాలకు పెంచారు. కాగా, ప్రధాని మోదీ పర్యటించనుండటంతో రాజధానికి మరిన్ని నిధులు, మరింత సహకారంపై ప్రకటన విడుదల కావొచ్చని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News