మంత్రుల అయోధ్య పర్యటనపై .. మోడీ మాస్టర్ ప్లాన్..!
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొలువు దీరిన బాలరామయ్యను దర్శించుకునేందుకు వీఐపీలు.. వీవీఐపీలు పోటెత్తుతున్నారు
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొలువు దీరిన బాలరామయ్యను దర్శించుకునేందుకు వీఐపీలు.. వీవీఐపీలు పోటెత్తుతున్నారు. తొలి దర్శనం చేసుకునేందుకు ఇప్పటికే అనేక మంది రిజిస్టర్ కూడా చేసుకున్నారు. వీరిలో కేంద్ర మంత్రులు కూడా ముందు వరుసలో ఉన్నారు. వీరికి షెడ్యూల్ ప్రకారం దర్శనం కల్పించేం దుకు రామజన్మభూమి తీర్థం ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. అనూహ్యంగా కేంద్ర మంత్రుల .. అయోధ్య పర్యటనపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
''మీరు ఇప్పుడే వెళ్లొద్దు. అక్కడ భారీ రద్దీగా ఉంది. సామాన్య ప్రజలు ఎక్కువగా వస్తున్నారు. వారికి ఆటంకం కలుగుతుంది. వారిని ప్రశాంతంగా దర్శనం చేసుకోనివ్వండి. మీరు వచ్చే మార్చి నెలలో అది కూడా రెండో వారం నుంచి దర్శనం చేసుకోండి. దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోండి. అప్పటి వరకు అటు వైపు వెళ్లొద్దు'' అని ప్రధాన మంత్రి తాజాగా తన మంత్రి వర్గానికి దిశానిర్దేశం చేశారు. అయితే.. ఈ దిశానిర్దేశం పైకి బాగానే ఉంది. కానీ, దీని వెనుక మరో మాస్టర్ ప్లాన్ ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం అయోధ్య వ్యవహారం దేశంలో హాట్ టాపిక్ గా ఉంది. ఇది ప్రజల్లో మోడీ ఇమేజ్‌ను అమాంతం పెంచేసిందనే చర్చ కూడా జరుగుతోంది. సో.. ఇప్పుడు దీనిని కొనసాగించి.. మెజారి టీప్రజలు రామయ్య దర్శనం చేసుకునేలా అవకాశం ఇవ్వాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వం హిందూత్వకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నదో దేశవ్యాప్తంగా చర్చకురావాలనేది ఒక ప్లాన్. అదేసమయంలో ఎన్నికలకు ముందు.. నెల అంటే.. మార్చిలో కనుక కేంద్ర మంత్రులు అయోధ్యకు వెళ్తే.. అదిఎలాగూ.. ప్రముఖంగా ప్రచారంలోకి వస్తుంది.
తద్వారా.. అయోధ్య రామాలయం వ్యవహారం.. ఎన్నికలకు ముందు మరుగున పడకుండా.. ప్రజల దృష్టి నుంచిమళ్లి పోకుండా చేసుకునే ప్లాన్ ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మాల సీతారామన్ వంటివారు.. మార్చిలో అయోధ్యలో పర్యటిస్తే.. కేవలం దర్శనంతోనే వారు వదలి పెట్టరు. మీడియాతో మాట్లాడి.. ప్రధానిపై ప్రశంసలు కురిపిస్తారు. ఇది.. బీజేపీతోనే సాధ్యమైందని చెబుతారు. ఇది మీడియాలో ప్రముఖంగా రావడం ఖాయం. దీంతో ఎన్నికలకు ముందు.. వరకు అయోధ్య ప్రజల ఆలోచనల నుంచి చెరిగిపోకుండా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని ఇలా దిశానిర్దేశం చేసిఉంటారని మేధావులు అభిప్రాయపడుతున్నారు.