కొత్త ఊపిరి పోసిన టీడీపీ కూటమి వంద రోజుల పాలన
ఏపీని గాడిన పెట్టేందుకు అన్ని రకాలైన చర్యలు తీసుకుంది.
ఏపీకి భరోసా లేకుండా లేని నాడు, ఏపీ అన్ని విధాలుగా నష్టపోతున్న నేపథ్యంలో అసలు ఆశలు అన్నవి ఆవిరి అయిన వేళ ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టింది. మూడు పార్టీలు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఏపీలో ఇదే తొలిసారి.
ఎంతో అనుభవం కలిగిన చంద్రబాబు అలాగే ప్రజల కోసం తపన పడే పవన్ కళ్యాణ్, కేంద్రంలో రెండు టెర్ములు సక్సెస్ ఫుల్ గా అధికారాన్ని అందుకుని ప్రజలకు మేలైన పాలన సాగించిన బీజేపీ కలసి ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపించాయి. జూన్ 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు.
అలా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి సరిగ్గా సెప్టెంబర్ 20తో వంద రోజులను పూర్తి చేసుకుంది. ఈ వంద రోజులలో ప్రభుత్వం ఏమి చేసింది అన్నది అంతటా చర్చించాల్సిన విషయమే. నిజానికి ఒక ప్రభుత్వానికి వంద రోజులు అన్నది చాలా చిన్నది. అయినా సరే ఈ వంద రోజులలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజలలో కొత్త భరోసా కల్పించింది.
ఏపీని గాడిన పెట్టేందుకు అన్ని రకాలైన చర్యలు తీసుకుంది. మొదటి రోజు నుంచే ఏపీకి రాజధాని ఆవశ్యకతను గుర్తించి అమరావతిని మళ్లీ పూర్వపు దారిలో నడిచేలా చర్యలకు ఉపక్రమించింది. అమరావతిలో ఎన్నో నిర్మాణాలు మొదలెట్టిన గత ప్రభుత్వం దిగిపోగానే వైసీపీ వచ్చి వాటిని అలా వదిలేసింది.
అయితే తిరిగి టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే పాత నిర్మాణాలను పరిశీలించి వాటిని ఎక్కడ నుంచి నిర్మాణం పనులు ప్రారంభించవచ్చు అన్నది నిపుణులతో చర్చించి ఒక గాడిన పెట్టే కార్యక్రమం ఆరంభించింది. అంతే కాదు అమరావతి రాజధాని అంటే దాని చుట్టూ తుప్పలతో అడవిని తలపించేలా ఉన్న వాటిని అన్నీ తొలగించేలా పెద్ద ఎత్తున జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
దాని కోసం 37 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం ద్వారా అమరావతికి కొత్త రూపు ఇవ్వడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న పలుకుబడితో అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరం అయిన నిధులను పోగు చేసే పనిలో కూడా కూటమి ప్రభుత్వం విజయవంతం అయింది.
కేంద్రం పూచీకత్తు మీద ప్రపంచ బ్యాంక్ ఏకంగా పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకుని రావడం అంటే అది గ్రేట్ అనే చెప్పాలి. దాంతో పాటు అమరావతిలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తన పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. గతంలో అమరావతిలో భూములు కేటాయించిన వారిని పిలిచి వారితో సంప్రదింపులు చేయడం ద్వారా వారి పనులు ప్రారంభించడానికి కూడా ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తున్నారు.
అలాగే ఎన్నారైలను కూడా పిలిచి మరీ వారి ద్వారా కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టించాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. అమరావతిలో విద్యా సంస్థలు ఇతర కార్యకలాపాలు మొదలైతే కచ్చితంగా అక్కడా యాక్టివిటీ స్టార్ట్ అవుతుందని దాని ఫలితంగా అమరావతి రూపూ షేపూ మారిపోతాయని బాబు భావిస్తున్నారు.
మరో వైపు అమరావతి రాజధాని విషయంలో ప్రభుత్వం సరికొత్త ఆలోచనలు కూడా చేస్తోంది. గతంలోలా కాకుండా గుంటూరు, విజయవాడలను కలుపుకుని జంట నగరాల మాదిరిగా తీర్చిదిద్దేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక అమరావతి నుంచి భారీ రైల్వే లైన్లు వేసేలా కేంద్రం నుంచి సహకరం కూడా అందుకుంది.
అదే విధంగా ఆరు లైన్ల రోడ్లను కూడా నిర్మించడం ద్వారా అమరావతిని ఏపీలోని అన్ని ప్రాంతాలకు దగ్గర చేసేలా కనెక్టివిటీ ఉండేలా కూడా ప్రయత్నం చేస్తోంది. దీంతో గత పదేళ్ళుగా రాజధాని లేదు అని మానసికంగా ఎంతో అవేదన చెందుతూ ఇతర రాష్ట్రాల వారితో ర్యాగింగ్ కి గురి అయిన ఏపీ ప్రజానీకానికి కేవలం వంద రోజుల వ్యవధిలోనే కూటమి ప్రభుత్వం రాజధాని పేరిట ఒక రాజసం కల్పించింది అని చెప్పాలి.
అలాగే పోలవరం ప్రాజెక్ట్. ఇది ఎనిమిది దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రాజెక్ట్. దీని విషయంలో 2014 నుంచి 2019 దాకా టీడీపీ ప్రభుత్వం చాలానే వర్క్ చేసి పెట్టింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం బాగా స్లో డౌన్ అయింది. దాంతో ఎపుడో పూర్తి కావాల్సిన పోలవరం కూడా పడకేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం తన ప్రాధాన్యతలుగా పోలవరం ని కూడా పెట్టుకుంది.
అందుకే ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే కేంద్రం వద్దకు వెళ్ళి పెండింగులో ఉన్న 12 వేల కోట్ల రూపాయలను విడుదల చేయించుకుంది. దాంతో పోలవరం పనులకు ఇపుడు ఆటంకాలు లేకుండా పోయాయి. నవంబర్ నుంచి పోలవరం పనులు శరవేగంగా ప్రారంభించేందుకు అన్ని రకాలైన ప్రయత్నాలను కేవలం వంద రోజుల వ్యవధిలోనే కూటమి ప్రభుత్వం చేయడం మరో ప్లస్ పాయింట్.
ఇక నిరుద్యోగా యువత కోసం మెగా డీఎస్సీని 16 వేలకు పైగా టీచర్ పోస్టులతో భర్తీ చేయడానికి చంద్రబాబు సీఎం గా చేసిన మొదటి అయిదు సంతకాలలో ఒకటిగా పెట్టడం నిజంగా మరో విజయంగా చూస్తున్నారు. అంతే కాదు చంద్రబాబు సామాజిక పెన్షన్లు కూడా భారీగా పెంచారు.
మూడు వేల రూపాయలను ఒక్క సారిగా నాలుగు వేలకు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దివ్యాంగుల పెన్షన్ కూడా రెట్టింపు చేసారు. ఈ విధంగా అరవై ఆరు లక్షలకు పైగా పెన్షన్ లబ్దిదారుల కళ్ళలో వెలుగు నింపారు.
మరో వైపు చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రైతులు తమ భూములు ఎక్కడ పోతాయో అని నానా బాధలు పడుతూ అవేదన చెందారు. కూటమి ప్రభుత్వం అధికారంలోని వస్తూనే ఆ యాక్ట్ ని తొలగించింది. దాంతో రైతులు అంతా పూర్తి భరోసాను పొందారు. అదే విధంగా అన్నా క్యాంటీన్లను టీడీపీ కూటమి ప్రారంభించడం మరో శుభ పరిణామం. దీని వల్ల పేదల ఆకలి పూర్తిగా తీరుతోంది. ఇది దేశంలోనే అద్భుత పథకంగా మారింది.
ఒక వైపు కేంద్ర ప్రభుత్వంతో సామరస్యంగా ఉంటూ ఏపీకి తేవాల్సిన నిధులను తెచ్చుకుంటూ మరో వైపు ఏపీని అభివృద్ధి చేసే విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తూ తొలి అడుగులే బలంగా వేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ముఖ్యంగా గతంలో ప్రజలలో ఉన్న అభద్రతా భావం ఇపుడు లేదు. అంతే కాదు భవిష్యత్తు మీద ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. ఏపీ సేఫ్ హ్యాండ్స్ లో ఉంది అని ప్రతీ ఒక్కరూ భావిస్తున్నారు.
ఏపీ సమీప భవిష్యత్తులో బాగా పుంజుకుని అభివృద్ధిలో దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడుతుంది అన్న నమ్మకాన్ని చంద్రబాబు ఇవ్వగలిగారు. మొత్తానికి వంద రోజుల పాలనలో ఎన్నో సవాళ్ళు ఎదురైనా కూడా చంద్రబాబు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగారు. దానికి తాజా ఉదాహరణ బెజవాడను ముంచెత్తిన భారీ వరదలు. అటువంటి సమయంలో కూడా మొక్కవోని ధైర్యంతో ముఖ్యమంత్రి పది రోజుల పాటు శ్రమించి ప్రజలకు తగిన సహాయం అందించగలిగారు. దాంతో వంద రోజుల పాలన ఏపీకి మేలు మలుపుగా ఉందని అంతా భావిస్తుననారు.