ఒట్టు పెట్టి మరీ అసెంబ్లీకి రానన్న ఒమర్.. కాబోయే సీఎం

ఒమర్ అబ్దుల్లాను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 54 ఏళ్ల ఆయన కుటుంబం మొత్తం కశ్మీర్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించిందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

Update: 2024-10-09 06:07 GMT

ఒమర్ అబ్దుల్లాను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 54 ఏళ్ల ఆయన కుటుంబం మొత్తం కశ్మీర్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. తాత.. తండ్రి బాటలోనే నడిచిన ఆయన మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు. రాజ్యాంగంలోని అధికరణం 370ను అనుసరించి కేంద్రం కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి హోదాను ఎత్తేయటం.. జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిక ప్రాంతాలుగా మార్చటం తెలిసిందే.

అయితే.. జమ్ముకశ్మీర్ కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలన్న ఫరూక్ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ డిమాండ్. ఆ పార్టీ అగ్రనేత ఒమర్ సైతం అదే డిమాండ్ కు పట్టుబట్టారు. అంతేనా.. జమ్ముకశ్మీర్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నంత వరకు తాను జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో అడుగు పెట్టనని తేల్చిన ఆయన.. ఎన్నికల్లో పోటీ చేయనని ఒట్టు పెట్టారు.

చివరకు తాను పెట్టిన ఒట్టు తీసి గట్టున పెట్టారు. ప్రత్యేక ప్రతిపత్తి లేని కేంద్రపాలిత ప్రాంతమైన అసెంబ్లీలోకి అడుగు పెట్టి తనను తాను అవమానించుకోలేమన్న ఆయన.. ఎన్నికల కమిషన్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన తర్వాత మాత్రం తన మాటను.. చేతల్ని మార్చుకున్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించటం ద్వారా తన సత్తాను చాటటమే కాదు.. మరోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నారు.

ఈసారి ఒమర్ అబ్డుల్లా రెండుస్థానాల్లో పోటీ చేశారు. తమ కుటుంబానికి పట్టున్న గండేర్బల్ నియోజకవర్గంతో పాటు బుద్గాం స్థానం నుంచీ పోటీ చేశారు. కాంగ్రెస్ తో ఎన్నికలకు ముందే పొత్తు ఖరారు చేసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే 2002లో గండేర్బల్ అసెంబ్లీ స్థానంలో ఓటమి చెందిన ఆయన.. తిరిగి అదే ప్రాంతం నుంచి 2004లో ఎంపీగా విజయం సాధించారు. 38 ఏళ్ల చిన్న వయసులో జమ్ముకశ్మీర్ కు ముఖ్యమంత్రి అయ్యారు.

2009చివర్లో మొదటిసారి సీఎం అయిన ఆయన.. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలు కావటంతో సీఎం పదవిని కోల్పోయారు. 1970 మార్చి 10న ఇంగ్లాండ్ లో పుట్టిన ఒమర్.. స్కూలింగ్ మొత్తం జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్.. హిమాచల్ ప్రదేశ్ లోని సనావర్ లో సాగింది. ముంబయిలో డిగ్రీ.. స్కాట్ లాండ్ లో ఎంబీఏ చేశారు. 1998లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ఆయన ఎంపీగా ఎన్నికై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికి ముఖ్యమంత్రిగా.. కేంద్ర మంత్రిగా వ్యవహరించిన ఆయన మరోసారి సీఎం కానున్నారు.

Tags:    

Similar News