రాజ్యసభ ఛైర్మన్ తొలగింపుపై నిబంధనలు ఏమి చెబుతున్నాయి?
అవును... రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్ ఖర్ పై ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్ కర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయని కథనాలొస్తున్నాయి. ఈ క్రమలో ఆర్టికల్ 67 (బి) కింద తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ ఎంపీలు ఇప్పటికే నోటీసులపై సంతకాలు చేశారని అంటున్నారు.
అవును... రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్ ఖర్ పై ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెబుతున్నారు. తమ డిమాండ్లను పక్కదారి పట్టించి, ట్రెజరీ బెంచ్ లకు రాజ్యసభ ఛైర్మన్ ప్రాధాన్యత ఇచ్చారని ప్రతిపక్షం ఆరోపించింది. ఈ నేపథ్యంలో... ఉప రాష్ట్రపతిపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చే విషయంలో ఉన్న నిబంధనలు ఇప్పుడు చూద్దాం...!
నిబంధనలు ఏమి చెబుతున్నాయి?:
రాజ్యసభ ఎక్స్-అఫీషియో ఛైర్మన్ భారత ఉపరాష్ట్రపతి. రాజ్యసభ సెషన్స్ లకు అధ్యక్షత వహించడం, ప్రక్రియలలో క్రమాన్ని నిర్ధారించడం ఆయన బాధ్యతలు కాగా.. ఈ వైస్ ప్రెసిడెంట్ పదవీ కాలం ఐదు సంవత్సరాలు కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా ఎన్నుకోబడే అవకాశం ఉంది!
అయితే... భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 (బి) ప్రకారం... రాజ్యసభ ఆమోదించిన తీర్మానం ద్వారా ఉపరాష్ట్రపతిని పదవి నుంచి తొలగించవచ్చు. దీనికోసం రాజ్యసభలో మెజారిటీ సభ్యులు ఆమోదించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో... తీర్మానానికి కనీసం 14 రోజులు ముందు నోటీసు ఇవ్వాలి.
ఇదే సమయంలో... తీర్మానాన్ని ప్రారంభించే ఉద్దేశ్యాన్ని నోటీసు స్పష్టంగా పేర్కొనాలి.. దానికి గల కారణాలను వివరించాలి.
గతంలో కూడా ప్రయత్నాలు జరిగాయా?:
రాజ్యసభ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ముందుకు రానప్పటికీ... ప్రతిపక్షాలు 2020లో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ పై అవిశ్వాస తీర్మానాన్ని సమర్పించాయి. వివాదాస్పద వ్యవసాయ బిల్లులపై మరుసటి రోజు చర్చలు కొనసాగించాలన్న ప్రతిపక్షాల అభ్యర్థనను తోసిపుచ్చుతూ ఆయన తీసుకున్న నిర్ణయంపై సభలో గందరగోళం ఏర్పడింది.
అయితే తాజాగా రాజ్యసభ ఛైర్మన్ ధన్ ఖర్ పై ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు.. ఎంపీలు అభిషేక్ సింఘ్వీ, కేటీఎస్ తులసీ రూపొందించిన తీర్మానానికి మద్దతు ఇచ్చిన పార్టీలలో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆప్, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, బీఆరెస్స్, ఎస్పీ, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (ఎం) ఉన్నాయి.