విపక్షాలే టార్గెట్ గా...మోడీ రామబాణం...!
లేకపోతే అయోధ్య రాముడి ఆలయం ప్రారంభోత్సవాన్ని బీజేపీ ఎంత ప్రతిష్టగా తీసుకుంది అన్నది కనుక చూస్తే అది అర్ధం అవుతుంది.
బీజేపీని 2024 ఎన్నికల్లో కూడా రాముడే గెలిపిస్తాడా అంటే జరుగుతున్న పరిణామాలు బీజేపీ పెట్టుకున్న నమ్మకాలు అన్నీ కూడా అదే నిజం అనేలా చేస్తున్నాయి. లేకపోతే అయోధ్య రాముడి ఆలయం ప్రారంభోత్సవాన్ని బీజేపీ ఎంత ప్రతిష్టగా తీసుకుంది అన్నది కనుక చూస్తే అది అర్ధం అవుతుంది.
నిజానికి బీజేపీకి అయోధ్య రాముడికి మధ్య అతి పెద్ద బంధం ఉంది. దీనికి మూడున్నర దశాబ్దాల వయసు కూడా ఉంది. బీజేపీని రెండు సీట్ల నుంచి అధికారంలోకి పలు సార్లు తీసుకుని రావడం వెనక అయోధ్య రాముడు ఉన్నారు.
ఇక మోడీ రెండు సార్లు దేశానికి ప్రధాని అయ్యారు. ఆయన రెండవసారి ప్రధాని అయ్యాక పరిష్కరించిన వాటిలో అయోధ్య రామ మందిరం ఇష్యూ అంతంత ముఖ్యమైనది. దాదాపుగా అయిదు వందల ఏళ్ల క్రితం నాటి ఈ సమస్యని మోడీ పరిష్కరించి హిందువులకు ఇష్టుడిగా మారారు.
బీజేపీ పొలిటికల్ ఫిలాసఫీ కూడా హిందూత్వం కాబట్టి రాముడు బీజేపీ పాలిట వరాలు ఇచ్చే దేవుడిగా మారిపోయారు. అసలు ఉందా లేదా అన్న స్థితి నుంచి పార్టీని ఎన్నో సార్లు అధికారంలోకి తెచ్చిన రాముడిని బీజేపీ దాదాపుగా చివరిగా అనుకోవచ్చు ఒక భారీ కోరికనే కోరుతోంది.
అదేంటి అంటే మోడీకి హ్యాట్రికి సక్సెస్ ని ఇవ్వమని. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాముడికి భవ్యమైన ఆలయాన్ని బీజేపీ నిర్మించి తన భక్తిని చాటుకుంది కాబట్టి రాముడు కూడా కాషాయ పార్టీ పట్ల తన కృతజ్ఞతను చాటుకోవలన్నది వారి ఆశ.
దానికి తగినట్లుగానే ఎన్నికలు ముంగిటిలో ఉన్న వేళ అయోధ్యలో రామాలయాన్ని ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్నారు. జనవరి 22న మోడీ అయోధ్య రామాలయాన్ని ప్రారంభించడమే కాదు దేశంలో ఆ రోజును అతి పెద్ద ఆధ్యాత్మిక దినోత్సవంగా చేస్తున్నారు. ఆ రోజున ప్రతీ ఇంటా దీపాలు వెలిగించి దీపావళి చేసుకోవాలని కూడా బీజేపీ పిలుపు ఇచ్చింది.
అదే సమయంలో అయోధ్యను దేశంలోని అన్ని ప్రాంతాలకూ కలుపుతూ ఆధునీకరించిన రైల్వే స్టేషన్ ఎయిర్ పోర్టులని కూడా బీజేపీ ప్రారంభించింది. ఒక విధంగా ఆధ్యాత్మిక విప్లవానికే బీజేపీ పూనుకుంది. రానున్న కాలమంగా అయోధ్య యాత్రలే భారీ ఎత్తున సగుతాయి. అదే సమయంలో బీజేపీ కూడా దాన్ని ఇంకా బాగా ప్రచారం కూడా చేసుకుంటుంది.
మొత్తానికి చూస్తే మోడీ రామ బాణాన్నే ప్రయోగించారు. ఆయన టార్గెట్ విపక్ష శిబిరం. ఇపుడు విపక్ష శిబిరం లో కొంత అయోయమం ఉంది. దానికి తోడు బీజేపీ సెంటిమెంట్ అస్త్రాన్ని తీసింది. దీన్ని ఎలా ఎదుర్కొంటారు అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా బీజేపీని రాముడిని విడదీయలేమని ఆ పార్టీ నేతలు అంటూంటే విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. మోడీ మూడవసారి కూడా ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తే మాత్రం రాముడు నిండుగా ఆశీర్వదించినట్లే అనుకోవాల్సి ఉంటుంది. .