ప్రపంచ కప్ విజేత ఎవరో చెప్పేసిన ప్రముఖ జ్యోతిష్యుడు
ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్ పోరులో టీమిండియా విజేతగా నిలుస్తుందని తేల్చిన ఆయన అందుకు తగ్గ లాజిక్ ను చూపించటం గమనార్హం
కోట్లాది మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేస్తోంది. నవంబరు 19 (ఆదివారం) గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ లో ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఫైనల్ పోరుకు తొలుత టీమిండియా అర్హత సాధించగా.. తర్వాత జరిగిన సెమీస్ లో ఆస్ట్రేలియా ప్రత్యర్థి జట్టుగా ఎంపికైంది. ఈ బిగ్ ఫైనల్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గెలుపోటముల లెక్కలతో క్రీడాభిమానులంతా బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ తుది ఫలితం ఎలా ఉంటుందన్న విషయాన్ని తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ జగన్నాథ్ గురుజీ చెప్పేశారు.
ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్ పోరులో టీమిండియా విజేతగా నిలుస్తుందని తేల్చిన ఆయన అందుకు తగ్గ లాజిక్ ను చూపించటం గమనార్హం. నవంబరు 19న అహ్మదాబాద్ లో ప్రపంచ కప్ 2023 ట్రోఫీని ఎత్తి రోహిత్ శర్మ చరిత్ర సృష్టిస్తాడని చెప్పారు. 2011 ప్రపంచకప్ లో మహేందర్ సింగ్ ధోనికి రోహిత్ శర్మకు చాలా దగ్గర పోలికలు ఉన్నట్లు చెప్పారు. అంతేకాదు.. టీమిండియా ఆటగాళ్ల జాతకం గురించి చెబుతూ.. రోహిత్ శర్మ జాతకం ఈ ప్రపంచకప్ లో అతడి నాయకత్వ నైపుణ్యంలో సాయం చేసిందన్నారు.
హిట్ మ్యాన్ గ్రహాల స్థానాలు.. అమరికలు 2011 నాటి ధోనికి దగ్గరగా ఉన్నట్లు చెప్పారు. ఆస్ట్రేలియా జట్టు జాతకంతో పోలిస్తే.. టీమిండియా జట్టు జాతకం బలంగా ఉందన్నారు. శుభ్ మన్ గిల్.. విరాట్ కోహ్లీ.. శ్రేయాస్ అయ్యర్.. కేఎల్ రాహుల్.. మహ్మద్ షమీ.. బుమ్రా లాంటి ఆటగాళ్లు తమ జాతకాల్లో బలమైన యురేనస్.. వీనస్.. నెఫ్ట్యూన్ లను కలిగి ఉన్నట్లుగా చెప్పారు. వారంతా అన్నింటికి రెఢీగా ఉన్నారని చెబుతూ.. ''ఆధిపత్యం ప్రదర్శించేందుకు.. చరిత్రను సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారు. భారత్ ఎనిమిదో ఇంట్లో అంగారకుడి ఉనికి ఉంది. టీమిండియాకు మేలు కలుగుతుంది'' అని పేర్కొన్నారు. ఇదంతా తెలిసిన అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోతోంది.