మొన్న అయోధ్య రామాలయం.. ఇప్పుడు కొత్త పార్లమెంటులో సేమ్ సీన్!

నిర్మాణం పూర్తై.. ఘనంగా ప్రారంభమైన ఏడాదికే.. లీకేజీలు దర్శనమివ్వటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Update: 2024-08-01 10:55 GMT

అదేం అల్లాటప్పా నిర్మాణం కాదు. భారతదేశ ప్రతిష్ఠకు.. పరపతికి నిలువెత్తు రూపంగా చెప్పుకునే పార్లమెంట్ భవనంలో లీకేజీలు ఉండటమా? వర్షం పడితే.. నీళ్ల చుక్కలు నేల మీద పడుతున్ననేపథ్యంలో.. కింద ప్లాస్టిక్ బకెట్ పెట్టటమా? ఈ వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. దాదాపు రూ.900 కోట్ల ఖర్చుతో నిర్మించిన సెంట్రల్ విస్టాను గత ఏడాది ప్రారంభించటం తెలిసిందే.

నిర్మాణం పూర్తై.. ఘనంగా ప్రారంభమైన ఏడాదికే.. లీకేజీలు దర్శనమివ్వటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాన నీరు లోపలకు వస్తున్న వైనంపై విస్మయానికి గురి చేస్తోంది. మొన్నటికి మొన్న ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయంలో వర్షం ధాటికి వాన నీరు పడటం.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన వేళ.. పూర్తిస్థాయి నిర్మాణం పూర్తి కాకపోవటం వల్లనే ఇలా జరిగిందన్న కవరింగ్ రావటం తెలిసిందే.

ఆ షాక్ నుంచి బయటకు రాకముందే.. పార్లమెంట్ భవన్ లో వర్షం నీళ్లు చుక్కలుగా పడుతున్న వైనాన్ని చూసినోళ్లు షాక్ కు గురవుతున్నారు. భవనం పైకప్పు నుంచి వాన తీరు లీకు కావటంపై విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. ఆ నీటిని పడేందుకు వీలుగా ప్లాస్టిక్ బకెట్ ను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో ఈ ఉదంతాన్ని పలువురు ఫోటోలు.. వీడియోలు తీస్తున్నారు. కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. మోడీ సర్కారు తీరును దుమ్మెత్తి పోస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ వ్యవహారంపై విపక్షాలు మండిపడుతూ.. బయట పేపర్ లీకేజీ.. లోపల వాటర్ లీకేజీ అంటూ మోడీ సర్కారుపై వ్యంగ్య బాణాల్ని సంధిస్తున్నారు విపక్షాలు. ఈ ఉదంతంపై సమాజ్ వాదీ పార్టీ అధినేత.. ఎంపీ అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. పార్లమెంట్ ను పాత భవనానికి మార్చాలని డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయిలు ఖర్చు చేసి నిర్మించిన సెంట్రల్ విస్టా భవనంలో వర్షపునీరు లీకేజ్ ఆగే వరకు పాత భవనంలో పార్లమెంట్ సమావేశాల్ని నిర్వహించాలన్న సూచనను తెర మీదకు తీసుకురావటం ద్వారా మోడీ సర్కారు తీరును తెగ ఎటకారం చేస్తున్నారని చెప్పాలి.

Tags:    

Similar News