వెతుక్కుని వెళ్లి ఓటేస్తున్నారు.. ఎంత ఆదర్శం!
ఓటు అనేది హక్కు మాత్రమే కాదు.. బాధ్యత అని ఒకవైపు ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ.. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు కదలడం లేదు
సోమవారం పోలింగ్ డే. అటు తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలు, ఏపీలోని 25 పార్లమెంటు నియోజకవర్గాలతోపాటు.. 175 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతోంది. దీనికి ముందు.. రెండు రోజులు సెలవులు వచ్చాయి. శనివారం సెంకడ్ సాటర్‌డే, ఆదివారం రెండు రోజులు సెలవు. ఇక, సోమవారం పోలింగ్ డే సందర్భంగా సెలవు. సో.. ఇవన్నీ.. కలిసి వచ్చాయని ఎంజాయ్ చేస్తున్న కొందరు కనిపిస్తుంటే.. మరోవైపు.. పోలింగ్ బూత్‌కు వెళ్లేందుకు దారిలేకపోయినా వెతుక్కుని వెళ్తున్న వారు మరికొందరు.
ఓటు అనేది హక్కు మాత్రమే కాదు.. బాధ్యత అని ఒకవైపు ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ.. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు కదలడం లేదు. సెలవును ఎంజాయ్ చేసే పనిలోనే ఉన్నారు. దొరకునా.. ఇటువంటి రోజు అటూ.. కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్తున్నారు. కానీ, వారు చదువు కోకపోయినా.. ఓటు విలువ తెలుసుకున్నారు.. తెలిసి ఉన్నవారు దీంతో.. ఎలాంటి ప్రయాణ సౌకర్యం లేకపోయినా.. కొండలు దాటుకుని.. నదులు దాటుకుని మరీ వచ్చి పోలింగ్ బూతుల ముందు నిలబడుతున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో నది దాటి పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఓటర్లు.. ఓటు హక్కు కోసం బారులు తీరారు. కొమరాడ మండలంలో నాగావళి నది దాటి కూనేరు లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లిన రెబ్బ గ్రామస్తులు.. తమ ఓటు హక్కును వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులు తమకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోయినా.. ఓటు వేసేందుకు పోటెత్తారు. వారితో పాటు నిండు గర్భిణి అయిన ఓ మహిళను ఓటు వేయడానికి డోలీలో తీసుకెళ్లారు. సుమారు 4 కిలోమీటర్లు నడిస్తే.. తప్ప. వీరికి పోలింగ్ బూత్ అందుబాటులో లేకపోవడం గమనార్హం.
మన సంగతేంటి?
ఇంటికి ఆమడ దూరంలోనే పోలింగ్ బూతులు ఉన్నాయి. రెండు మూడు నిమిషాల్లో చేరుకునేలా బూతులను ఏర్పాటు చేశారు. మరి మనం ఏం చేస్తున్నాం.. ఓటు వేస్తున్నామా? బద్ధకిస్తున్నామా? ఆలోచించుకుని వీరిని స్పూర్తిగా తీసుకుంటే.. ప్రజాస్వామ్య పండుగకు నిజమైన అర్ధం చెప్పినట్టు అవుతుంది.