విశాఖ ఉక్కు భూములపై పవన్ సంచలన వ్యాఖ్యలు

ఈ సందర్భంగా పవన్ తో విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులు.. ఉక్కు పరిశ్రమ పరిరక్షణ సంఘాలకు చెందిన వారు ఏం చెప్పారంటే?

Update: 2024-10-07 06:12 GMT

విశాఖ ఉక్కు ఇష్యూపై ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. విశాఖ ఉక్కును అమ్మేసేందుకు పవన్ ఆసక్తి చూపుతున్నారని.. ఆ దిశగా అడుగులు పడుతున్నాయని.. మోడీకి సలాం కొట్టేందుకు వీలుగా పవన్ తీరు ఉందంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్న వేళ.. అందుకు భిన్నంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీశాయి. మంగళగిరిలోని తన క్యాంప్ ఆఫీసులో విశాఖ ఉక్కు పరిశ్రమకు చెందిన కార్మికులు.. పరిరక్షణ సంఘాల నేతలో పవన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా పవన్ తో విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులు.. ఉక్కు పరిశ్రమ పరిరక్షణ సంఘాలకు చెందిన వారు ఏం చెప్పారంటే?

- విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించకుండా కాపాడాలి

- 12500 మంది ఉద్యోగులు.. 14 వేల మంది ఒప్పంద కార్మికులు పని చేస్తున్నారు

- కొద్ది నెలలుగా వారికి జీత భత్యాలు రావట్లేదు

- 32 మంది బలిదానాలు.. 16 వేల మంది నిర్వాసితుల త్యాగాలు.. 24 వేల ఎఉకరాల భూసేకరణతో విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పడింది.

- వారి త్యాగాల్ని ఎవరూ మర్చిపోకూడదు

వీరి వ్యాఖ్యలకు స్పందించిన పవన్ కల్యాణ్.. "విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలనే భావోద్వేగం పరిశ్రమలో పని చేసే ప్రతీ కార్మికుడితో పాటు.. కార్మిక.. ఉద్యోగ సంఘాల నేతల్లో కూడా ఉండాలి. పరిశ్రమను కాపాడుకోవటానికి చేసిన పోరాటాలు.. త్యాగాలను కేంద్రం ద్రష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వ పారిశ్రామిక రంగాలు కొనసాగాలని.. సహకార విధానంలో ఉన్నవి నిలదొక్కుకోవాలనే ఆకాంక్షిస్తా. ప్రైవేటీకరణ ప్రతిపాదన వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడా. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి ఎన్ని త్యాగాలు.. పోరాటాలతో ఏర్పడిందో వివరించా.

విశాఖ ఉక్కు పరిశ్రమ వద్ద సభ నిర్వహించినప్పుడు ఉద్యోగ.. కార్మిక సంఘాలన్నీ కలిసి అఖిలపక్షంతో కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాన్ని ఇద్దామంటే ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడే వచ్చి ఉంటే ఈ రోజు ఇంత ఆందోళన అవసరం ఉండేది కాదు. కేంద్రం ద్రష్టికి తీసుకెళ్తా" అని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉక్కు పరిశ్రమ భూములు అమ్మేద్దామని మీ ముందు ప్రతిపాదించిన మాట నిజమేనా? అంటూ తనను కలిసేందుకు వచ్చిన పలు సంఘాలకు చెందిన వారిని ప్రశ్నించారు. దీనికి వారు సమాధానమిస్తూ.. విశాఖ ఉక్కు భూముల్ని అమ్మేద్దామని తమ ముందుకు నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన తెచ్చిన మాట నిజమేనని పేర్కొన్నారు. మరి.. ఈ పరిణామంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.

Tags:    

Similar News