టీడీపీతో పొత్తు సీట్లను తేల్చనున్న పవన్!
జనసేన టీడీపీ కలిస్తే రెండు పార్టీలు గరిష్ట రాజకీయ ప్రయోజనం పొందుతారని పవన్ కి కచ్చితమైన అంచనాలు ఉన్నాయి
తెలుగుదేశం పార్టీతో జనసేన వ్యూహాత్మకంగానే పొత్తు పెట్టుకుంది అన్నది తెలిసిందే. బీజేపీతో ఇప్పటికే పొత్తులో ఉన్న జనసేన వచ్చే ఎన్నికల్లో ప్రయోగాలు చేసి వీరమరణం పొందలేమని కూడా ఓపెన్ గా చెప్పేసింది. దాంతో బలమైన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఉభయులకు లాభం దక్కేలా చూడాలని నిర్ణయించింది.
జనసేన టీడీపీ కలిస్తే రెండు పార్టీలు గరిష్ట రాజకీయ ప్రయోజనం పొందుతారని పవన్ కి కచ్చితమైన అంచనాలు ఉన్నాయి. దాంతో పవన్ కళ్యాణ్ రెండవ మాట లేకుండానే చంద్రబాబు అరెస్ట్ తరువాత పొత్తు ప్రకటన చేశారు. ఇక ఇపుడు అసలైన ఘట్టానికి తెర లేవనుంది అంటున్నారు.
పవన్ కళ్యాణ్ డిసెంబర్ 1న మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో జనసేన విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నాదెండ్ల మనోహర్ తో పాటు నాగబాబు కూడా హాజరు అవుతున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా కీలకమైన చర్చలు సాగుతాయని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో జనసేన ఎన్ని సీట్లకు పోటీ చేయాలన్న దాని మీద కూడా చర్చిస్తారు అని అంటున్నారు. జనసేనకు ఏ ఏ జిల్లాలలో ఎంతెంత బలాలు ఉన్నాయన్నది కూడా సమీక్షించి నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. టీడీపీతో పొత్తు నేపధ్యంలో జనసేన ఎన్ని సీట్లు తీసుకోవాలన్నది కూడా ఈ మీటింగులోనే డిసైడ్ చేస్తారు అని అంటున్నారు.
ఉభయ గోదావరి జిల్లాలో 34 అసెంబ్లీ సీటు ఉన్నాయి. అలాగే ఉత్తరాంధ్రాలో మరో 34 సీట్లు ఉన్నాయి. మొత్తంగా ఈ రెండు రీజియన్స్ లో కూడా ఎక్కువ సీట్లను పొత్తులో తమకు దక్కాలని జనసేన ప్రతిపాదిస్తుందని అంటున్నారు. కనీసంగా మూడవ వంతు సీటు ఈ మొత్తం సీట్లలో కోరుకుంటుందని అంటున్నారు.
అంటే పాతికకు తగ్గకుండా సీట్లను ఇక్కడ తీసుకోవాలని చూస్తున్నారు అని తెలుస్తోంది. ఇందులో ఉత్తరాంధ్రా జిల్లాలలో ఎనిమిది నుంచి పది సీట్లు అయితే ఉభయ గోదావరి జిల్లాలలో 15 నుంచి 18 దాకా సీట్లు కోరవచ్చు అంటున్నారు. ఆ మీదట మిగిలిన ఉమ్మడి ఏడు జిల్లాలలో జిల్లాకు రెండు వంతున తీసుకోవాలని కూడా యోచిస్తున్నారు.
అంటే ఓవరాల్ గా నలభై సీట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకుండా ఉండాలని కూడా పట్టు పడతారని అంటున్నారు. అదే విధంగా జనసేన తరఫున పోటీ చేసే ఆశావహులు ఎవరు, వారి బలాబలాలు ఏంటి అన్నది కూడా ఈ సమావేశంలోనే సమీక్షించి ఒక నిర్ణయానికి వస్తారు అని అంటున్నారు.
జనసేన పొత్తులో ఉంది. అది కూడా టీడీపీ వంటి పెద్ద పార్టీతో పొత్తు. అందువల్ల అనుకున్న వారికి అన్ని సీట్లు దక్కే అవకాశం లేదు. అలాంటి వారికి కూడా పరిస్థితిని నచ్చచెప్పడం ద్వారా దారికి తేవాలని ఈ సమావేశంలో చూస్తారు అని అంటున్నారు. ఎవరికైనా కోరికలు ఉండవచ్చు కానీ పార్టీ దీర్ఘ కాలిక ప్రయోజనాలను గమనిస్తూ ఆ దిశగా అడుగులు వేయాలని సూచిస్తారు అని అంటున్నారు.
విన్న వారికి రేపటి ఎన్నికల్లో పోత్తు పార్టీలు గెలిచేలా ఎలా చేయాలో దిశా నిర్దేశం చేస్తారు అని అంటున్నారు. ఓట్ల బదలాయింపు అన్నది కీలకమైన విషయంగా ఉంది. దాని మీద కూడా తగిన సూచనలు కూడా ఉంటాయని అంటున్నారు. ఇక పార్టీలో ఇమడలేక సీటు దక్కకపోతే గొంతులు పెంచే వారు ఉంటే మాత్రం వారి మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్నది కూడా ఆలోచించి నిర్ణయిస్తారు అని అంటున్నారు.
జనసేన ఏకైక అజెండా పొత్తులకు ఎందుకు దిగింది అన్నది మరో మారు గట్టిగా చెప్పడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వరాదని కూడా క్యాడర్ కి చెబుతారు అని అంటున్నారు. ఇక ఇదే సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పరిస్థితుల మీద చర్చిస్తారు అని అంటున్నారు. అదే విధంగా రానున్న ఎన్నికల కోసం ఉమ్మడిగానూ విడిగానూ కూడా ఎన్నికల వ్యూహాలను రూపొందించాలని కూడా జనసేన నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ మీటింగ్ కీలకం అని చెప్పాలని అంటున్నారు. ఈ మీటింగులోనే జనసేన ఎన్ని సీట్లను కోరనుంది అన్నది ప్రతిపాదనల స్థాయిలో నిర్దారణ అవుతుంది అని అంటున్నారు.