నాగబాబు కేంద్ర మంత్రిగా... పవన్ ప్లాన్ అదుర్స్....!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఏమీ తెలియని వారు అని అంటారు కానీ ఆయన అంతా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తూ ఉంటారు

Update: 2024-02-22 14:15 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఏమీ తెలియని వారు అని అంటారు కానీ ఆయన అంతా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తూ ఉంటారు. టీడీపీతో పొత్తు వెనక కూడా పవన్ ఆలోచనలు పక్కాగా ఉంటాయి. తాను ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని చూస్తున్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే కీలక పాత్ర పోషించేందుకు పవన్ డిసైడ్ అయ్యారు.

ఇక ప్లాన్ బీ కూడా పవన్ కి ఉంది అని అంటున్నారు. అందుకే తన అన్న నాగబాబుని అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయిస్తున్నారు అని అంటున్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం. దాంతో మిత్రపక్షం కోటాలో నాగబాబుని కేంద్ర మంత్రిగా చేయాలన్నది ఆయన ఎత్తుగడగా ఉంది.

అలా అన్నదమ్ములు ఇద్దరూ మంత్రులుగా రాజ్యం చేసే రోజు తొందరలోనే ఉందని జనసేన వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే పవన్ తన పొలిటికల్ ఫిలాసఫీని ఈసారి మార్చుకుంటున్నారు అని అంటున్నారు. జీరో బడ్జెట్ అంటూ 2019 ఎన్నికల్లో పోటీ చేసి నిజాయతీగా ఓట్లు సంపాదించారు. అయితే అవి పవన్ కి గెలుపుని ఇవ్వలేకపోయాయి.

దాంతో ఈసారి ఆయన మొత్తం స్ట్రాటజీ మార్చేశారు. ధనస్వామ్యంగా ఉండే రాజకీయాల్లో డబ్బుది కీలక పాత్ర అని పవన్ కూడా గుర్తించారు అని అంటున్నారు. అందుకే ఆయన భీమవరంలో పార్టీ క్యాడర్ తో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. తానెప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయమని చెప్పలెదని, డబ్బు లేకపోతే రాజకీయం సాధ్యం కాదని పవన్ మాట్లాడడం జరిగింది.

అందువల్ల వచ్చే ఎన్నికల్లో అనేక వ్యూహాలతో పాటు డబ్బు ఖర్చు కూడా చేయాలని పవన్ ఒక సందేశం ఇచ్చేశారు అని అంటున్నారు. అన్నయ్య నాగబాబు అనకాపల్లిలో గెలిసే కేంద్ర మంత్రి అవుతారు అని కూడా పవన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అందువల్ల ఆయన పోటీ చేసే అనకాపల్లి ఎంపీ సీటులో భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుందని కూడా పవన్ చెప్పారని అంటున్నారు.

ఇక రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే డబ్బుతో కూడా పాలిటిక్స్ చేయాలన్న పవన్ న్యూ స్ట్రాటజీ ఇపుడు ఆసక్తిని రేపుతోంది. ముల్లుని ముల్లుతోనే తీయాలని పవన్ నిర్ణయించుకున్నట్లుగా ఉందని అంటున్నారు. ఇక నాగబాబు గెలుపునకు అవసరం అయిన డబ్బు సమకూర్చేందుకు ఆయన గెలుపు కోసం కృషి చేసే బాధ్యతలను ఇద్దరు పారిశ్రామికవేత్తలకు పవన్ అప్పగించారని కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మొత్తం మీద సామదాన భేద దండోపాయాలే రాజకీయం. ఈ విషయం మూడు వేల ఏళ్ల క్రితమే చాణక్యుడు చెప్పారు. రాజకీయం అనే క్రీడలోకి వచ్చాక ఎవరైనా మడి కట్టుకుని కూర్చోలేరు. అలా కూర్చుంటే వారు ఎప్పటికీ గట్టు మీదనే ఉండిపోతారు అని గత చరిత్ర నిరూపించింది. ఇక పవన్ విషయానికి వస్తే ఆయన 2019లో గెలవకపోవచ్చు కానీ చాలా అనుభవన పాఠాలే నేర్చుకున్నారు అని అంటున్నారు.

తన శక్తి గెలవడానికి సరిపోదని తేలిన చోట ఆయన తగ్గి పొత్తులకు వెళ్లడం అలాగే అటు బీజేపీతో దోస్తీ చేస్తూ ఇటు టీడీపీతో పొత్తులు పెట్టుకుని ఆ రెండింటినీ కలుపుతూ రేపటి రోజున అక్కడా ఇక్కడా ప్రభుత్వాలు వస్తే గరిష్ట లాభాలను పొందడానికి పవన్ సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ కి పాలిటిక్స్ తెలియదు అని ఎవరైనా అనుకోగలరా. ఆయనను రాజకీయ అజ్ఞాని అని అవగాహన లేదు అని ఎవరైనా అనుకుంటే మాత్రం తప్పు అని నిరూపించేలా ఆయన పక్కాగా పొలిటికల్ స్ట్రాటజీ ని రచిస్తున్నారు. అవి సక్సెస్ అయితే పవన్ రాజకీయానికి తిరుగు ఉండదని అంటున్నారు.

Tags:    

Similar News