రూ.1.70 కోట్లు ఫైన్ కట్టిన కాసేపటికి బయటకొచ్చిన పేర్నినాని
మాజీ మంత్రి పేర్ని నాని ప్రదర్శించిన టాలెంట్ కు తెలుగుదేశం వర్గీయులు సైతం ఫిదా అవుతున్నారు.
మాజీ మంత్రి పేర్ని నాని ప్రదర్శించిన టాలెంట్ కు తెలుగుదేశం వర్గీయులు సైతం ఫిదా అవుతున్నారు. నిద్ర లేచింది మొదలు జనసైనికుల్ని.. తెలుగు తమ్ముళ్లను వరుస పెట్టి విమర్శలు చేయటమే కాదు.. ఆయన మాటలు విన్నంతనే కాలిపోయేంత కోపాన్ని కలిగించేస్తుంటాయి. ఆయన తప్పు ఏదైనా దొరకాలే కానీ ఉతికి ఆరేయాలన్నట్లుగా తెలుగు తమ్ముళ్లు.. జనసైనికులు ఫీల్ అవుతుంటారు. ఇటీవల కాలంలో మాజీ మంత్రి పేర్నినాని కుటుంబానికి చెందిన గోదాముల్లో పౌరసరఫరాల శాఖకు చెందిన బియ్యం భారీ ఎత్తున మాయం కావటం.. దీనికి సంబంధించిన పరిణామాలు వేగంగా మారాయి. ఈ ఉదంతంలో పేర్ని నాని ఫ్యామిలీ అరెస్టు ముప్పు ఎదుర్కొంటోందన్న వార్తలు వచ్చాయి.
కట్ చేస్తే.. నిత్యం ప్రజల్లో ఉండే పేర్ని నాని.. ఆయన కుమారుడు మాత్రమే కాదు మొత్తం ఫ్యామిలీ కనిపించకుండా పోవటం హాట్ టాపిక్ గా మారింది. అరెస్టు భయంతో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారన్న చర్చ జోరుగా సాగింది. విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అనూహ్యంగా అదే సమయంలో పేర్ని నాని అండర్ గ్రౌండ్ నుంచి బయటకు రావటం విస్తుపోయేలా చేసింది. కారణం.. ఆయన బయటకు వచ్చే సమయానికి మారిన పరిణామాలే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు.
ఈ సందర్భంగా అసలేం జరిగిందన్న విషయాన్ని చూస్తే.. కూటమి సర్కారు వైఫల్యంతో పాటు.. కీలక నేతల మౌనం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీశాయి. మరోవైపు నిందితులు బెయిల్ కోసం దరఖాస్తు చేయటంతో పాటు.. తమ మీద ఆరోపణలకు సంబంధించి భారీ మొత్తాన్ని జరిమానా రూపంలో చెల్లించిన కొత్త అంశం వెలుగు చూసింది. ఇదంతా చూసినోళ్లు.. ఆరోపణలు వచ్చినంతనే అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయి.. మొత్తం సెట్ చేసి బయటకు వచ్చినట్లుగా వ్యాఖ్యానిస్తున్నాయి.
ప్రతికూల ప్రభుత్వంలోనూ ఇంతలా చేయటం పేర్ని నాని టాలెంట్ కు నిదర్శనంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ మంత్రుల్లో కీలకంగా పేర్కొనే హోం మంత్రి అనిత.. పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ పై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఉమ్మడి క్రిష్ణా జిల్లా ప్రజాప్రతినిధుల మెతక వైఖరిపై కార్యకర్తలు విస్తుపోతున్న పరిస్థితి. మాయమైన బియ్యానికి ఫైన్ తో కలిపి మొదటి విడతగా రూ.కోటి మొత్తాన్ని డీడీల రూపంలో చెల్లించారు. సోమవారం మరో రూ.70లక్షలకు డీడీలు చెల్లించటం ద్వారా కేసును నీరుగార్చేందుకు అధికార పార్టీ నేతలు కొందరు.. కీలక అధికారులు సహకరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన నేతకు సంబంధించిన గోదాములు కావటం.. జిల్లాకు చెందిన ప్రస్తుత అధికార పార్టీ నేతలు కూడా చూసిచూడనట్లుగా వ్యవహరించాలన్న సంకేతాలతో అధికారులు నేర తీవ్రతను తగ్గించేందుకు వీలుగా శక్తివంచన లేకుండా పని చేసినట్లుగా చెబుతున్నారు. నిత్యం కూటమి ప్రభుత్వంలోని కీలక పార్టీలుగా ఉండే టీడీపీ.. జనసేన అగ్రనేతలపై నిత్యం ఘాటు విమర్శలతో విరుచుకుపడే పేర్ని నానికి సంబంధించిన ఒక సీరియస్ అంశం వెలుగు చూసినప్పటికీ.. మంత్రి నాదెండ్ల మనోహర్ సదరు గోదాముల వద్దకు వెళ్లకపోవటం.. తనిఖీ చేయకపోవటం దేనికి నిదర్శనం? అని ప్రశ్నిస్తున్నారు.
ఏదైనా ప్రాంతాలకు వెళ్లినంతనే సూపర్ బజార్లు.. రైస్ మిల్లులు.. పోర్టుల్లో గోదాములను తనిఖీ చేసే టాలెంట్ ఉన్న నాదెండ్ల మనోహర్.. పేర్నినాని కుటుంబానికి చెందిన గోదాముల్లో భారీ ఎత్తున బియ్యం మిస్ అయినట్లుగా కేసు నమోదు అయినప్పటికీ తనిఖీలకు ఎందుకు వెళ్లలేదన్నది ప్రశ్నగా మారింది. అంతేకాదు.. ఈ కేసు వ్యవహారంలో పేర్ని నాని ఫ్యామిలీపై కేసులు నమోదైనా.. ఇప్పటికి అరెస్టు చేయకపోవటం.. దీనిపై హోం మంత్రి మౌనంగా ఉండటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్నగా మారింది. ఈ నెల 10న చౌక బియ్యం మాయమైనట్లుగా పేర్కొంటూ పేర్ని నాని సతీమణి జయసుధ మీద కేసు నమోదైంది. ఎందుకుంటే.. గోదాముకు ఆమెనే యజమాని. దీనిపై జయసుధ ఈ నెల 13న కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీని విచారణను గురువారానికి వాయిదా వేశారు.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున ప్రత్యేక పీపీని నియమించాల్సి ఉందని న్యాయవాదులు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన ఏపీపీనే ఇప్పటికి కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో నిందితురాలు విదేశాలకు వెళ్లిపోకుండా లుక్ ఔట్ నోటీసులు జారీ చేసినట్లుగా ఎస్పీ గంగాధరరావు సోవారం వెల్లడించారు.అదే సమయంలో మిస్ అయిన బియ్యానికి సంబంధించిన మొత్తానికి సంబంధించి రూ.1.70 కోట్ల మొత్తాన్ని డీడీల రూపంలో పేర్ని నాని జమ చేసిన వైనం సోమవారం వెలుగు చూసింది. అప్పటివరకు అండర్ గ్రౌండ్ లో ఉన్న పేర్ని నాని ఫ్యామిలీ సోమవారం మధ్యాహ్నం బయటకు రావటం.. పార్టీ నేతలతో పేర్ని నాని భేటీ కావటం ఆసక్తికరంగా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్ ఫాలో అవుతున్న తెలుగు తమ్ముళ్లు.. జనసైనికులు తమ పార్టీ నేతల తీరుపై మండిపడుతుండటం గమనార్హం.