మోడీజీ ప్లీజ్ అంటూ .. పదిలక్షల పోస్టు కార్డులతో !
పోస్టు కార్డు గుర్తుందా అంటే ఈనాటి తరం చెప్పలేదేమో. ఎందుకంటే పోస్టాఫీసు కూడా ఎక్కడ ఉందో తెలియని జనరేషన్ నడుస్తోంది.
పోస్టు కార్డు గుర్తుందా అంటే ఈనాటి తరం చెప్పలేదేమో. ఎందుకంటే పోస్టాఫీసు కూడా ఎక్కడ ఉందో తెలియని జనరేషన్ నడుస్తోంది. ఆఖరుకు ఉద్యోగాలకు ఉన్నత కోర్సులలో చేరేందుకు దరకాస్తులు అన్నీ ఆన్ లైన్ లోనే జరిగిపోతున్న వేళ పోస్ట్ మ్యాన్ తో పోస్ట్ ఆఫీసుతో పని లేకుండా పోతోంది.
అయినా సరే పోస్టు ఆఫీసుకు ఒక చరిత్ర ఉంది. పోస్టు కార్డుకు బరువైన ఎమోషన్ ఉంది. కొన్ని వందల సార్లు ఫోన్ లో మాట్లాడినా లేని రాని ఎమోషన్ ఒక్క పోస్ట్ కార్డుతో వస్తుంది. అందులోని రాత దశాబ్దాల వెనక్కి తీసుకెళ్ళి మధుర జ్ఞాపకంగా కూడా మదిలో ఉంచగలదు.
అంతే కాదు అవతల వారి బాధలు విన్నపాలు కూడా వారి బరువైన హృదయాన్ని అనువదించి చేరాల్సిన చోటుకు ఆ వినతులను చేర్చగలదు. అందుకే విశాఖ ఉక్కు ఉద్యమంలో సరికొత్త మలుపులుగా పోస్టు కార్డు ని వారధిగా చేసుకుని వినూత్న ఉద్యమానికి తెర తీశారు. ఉత్తరాంధ్రా ప్రజా సంస్థ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఉక్కు ఉద్యమకారుడు, మాజీ మంత్రి, స్వాతంత్ర సమరయోధుడు, విశాఖకే తలమానికం లాంటి ప్రజా నాయకుడు అయిన తెన్నేటి విశ్వనాధం వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం విశాఖ బీచ్ లో చేపట్టిన పోస్టు కార్డు ఉద్యమానికి మంచి స్పందన లభించింది. ప్రధాని మోడీజీ అంటూ విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలనై కోరుతూ ఏకంగా పది లక్షల పోస్టు కార్డులతో భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
ఉత్తరాంధ్రాలో ఉన్న ప్రతీ కుటుంబం నుంచి ఒక పోస్టు కార్డు ప్రధానమంత్రి కార్యాలయానికి చేరేలా ఉత్తరాంధ్రా ప్రజా సంస్థ చర్యలు తీసుకుంటోంది. ఇంటింటికీ సంస్థ ప్రతినిధులు వెళ్ళి వారి నుంచి పోస్టు కార్డుల ద్వారా విశాఖ ఉక్కు ఆవశ్యకతను ప్రధానికి తెలియచేస్తారు.
విశాఖ ఉక్కు త్యాగాల పునాదుల మీద ఏర్పడిందని దానిని ప్రైవేట్ పరం చేయవద్దు అని కోరుతూ విన్నపాలతో కూడిన పోస్టు కార్డులను లక్షలల్లో పంపిస్తారు. దానివల్ల ఉత్తరాంధ్రా ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో ప్రధానికి నేరుగా తెలిసే అవకాశం ఉందని ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు.
పది లక్షల పోస్టు కార్డులు ప్రధాని ఆఫీసుకు పంపిస్తామని దీని వల్ల ఉత్తరాంధ్రా సెంటిమెంట్ గా విశాఖ ఉక్కు ఎలా ఉందో వారికి అర్థం అవుతుందని అంటున్నారు. ఇక జనవరి 27న విశాఖ నడిబొడ్డున లక్ష మందితో భారీ సభను నిర్వహించడం ద్వారా విశాఖ ఉక్కుని కాపాడుకునేందుకు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేసే ఆలోచన లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసరాజు ప్రకకటించారు. విశాఖ ఉక్కుని లాభాల బాటలో నడిపేందుకు ప్రభుత్వం చూస్తోందని ఆయన అంటున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రం నిబద్ధతతో ఉందని ఆయన చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేయవద్దంటూ పది లక్షల పోస్టు కార్డులు ఒకేసారి కేంద్రానికి చేరితే కేంద్రం స్పందన ఎలా ఉంటుంది అన్నది కూడా చర్చగా ఉంది. ఒక ఉద్యమం కోసం పది లక్షల పోస్టు కార్డులు పంపించడం అన్నది ప్రపంచ రికార్డు అని ఉక్కు ఉద్యమ కారులు అంటున్నారు.