సిద్ధం వర్సెస్ ప్రజాగళం...!
ఏపీలో అధికార వైసీపీ సిద్ధం అంటోంది. ఆ పేరు పెట్టుకునే ఎన్నికల సభలను చేస్తోంది. సిద్ధం పేరుతోనే ఈసారి ఎన్నికలు చుట్టేయాలని జగన్ భావిస్తున్నారు
ఏపీలో అధికార వైసీపీ సిద్ధం అంటోంది. ఆ పేరు పెట్టుకునే ఎన్నికల సభలను చేస్తోంది. సిద్ధం పేరుతోనే ఈసారి ఎన్నికలు చుట్టేయాలని జగన్ భావిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ చూస్తే అయిదేళ్లలో ఎన్నో పేర్లతో ప్రజలలోకి వచ్చింది. అందులో బాదుడే బాదుడు అన్నది కొంత విజయవంతం అయింది. ఇదేం ఖర్మ రాష్ట్రానికి మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు.
ఇక చంద్రబాబు రా కదలిరా అంటూ ఏపీ అంతటా సభలు నిర్వహించారు. లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రలు చేశారు. ఇపుడు శంఖారావం పేరుతో జిల్లాల టూర్లు చేస్తున్నారు. మోడీ బాబు పవన్ పాల్గొన్న ఉమ్మడి సభకు ప్రజాగళం అని పేరు పెట్టింది టీడీపీ. ఇక మీదట ప్రజాగళం పేరుతో ఎన్నికలు అయ్యేంతవరకూ జనంలో ఉంటూ సభలు నిర్వహించాలని చూస్తోంది ఆ పార్టీ.
ఇక జగన్ విషయానికి వస్తే సిద్ధం పేరుతో ఏపీలో నాలుగు రీజియన్లలో నాలుగు భారీ సభలు పెట్టారు. దీంతో దాదాపుగా అన్ని ఏరియాలు కవర్ అయ్యాయని అంటున్నారు. నలభై నుంచి యాభై నియోజకవర్గాల ద్వారా జన సమీకరణ చేసి సిద్ధం సభలను సక్సెస్ చేశారు అని అంటున్నారు.
చేతిలో ప్రభుత్వం ఉంది కాబట్టి జనా లను తరలించే విషయంలో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. జనాలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. అలాగే వైసీపీ అధినాయకత్వం వైపు నుంచి చూస్తే కనుక నిధులు అన్ని రకాలుగా ఖర్చు పెట్టారు. ఈ నాలుగు సిద్ధం సభల విషయంలో ఎమ్మెల్యే అభ్యర్ధుల మీద ఎలాంటి ఖర్చుల భారం అయితే పడలేదు అని అంటున్నారు. ఇక సిద్ధం సభల కోసం నేరుగా ఒక బస్సుకు పన్నెండు వేల రూపాయల దాకా ఇచ్చారని కూడా టాక్ నడచింది. అందుకే సక్సెస్ అయింది అని అంటున్నారు.
ఇక చివరి సిద్ధం సభలో ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్ చేస్తారని ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. దాంతో చాలా మంది హాజరు అయ్యారని అంటారు. ముఖ్యంగా రైతు రుణ మాఫీని అమలు చేస్తారని, డ్వాక్రా మహిళల రుణ మాఫీ చేస్తారని ప్రచారం సాగింది. దాంతో సభకు భారీ ఎత్తున వచ్చిన వారు ఎన్నికల మేనిఫెస్టో లేకపోవడంతో పూర్తిగా నిరాశపడ్డారు అని అంటున్నారు. అయినా సరే జనాలు బాగానే హాజరై సక్సెస్ చేశారు.
ఇక ఇపుడు టీడీపీ విషయానికి వస్తే ప్రజాగళం పేరుతో జనంలోకి వెళ్తున్నారు. కానీ ప్రజాగళం పేరు బాగా లేదు పవర్ ఫుల్ గా సౌండ్ చేయడం లేదు అని అంటున్నారు. మేము సిద్ధమని వైసీపీ చెబుతూంటే అది సవాల్ గా ఉంటోంది. జవాబు ధీటుగా ఇవ్వాల్సిన చోట జనరలైజ్ చేసే విధంగా ప్రజాగళం అన్న పేరుతో టీడీపీ వెళ్తోంది అని అంటున్నారు.
ఇక ప్రజా గళం పేరుతో నిర్వహించిన కూటమి మొదటి మీటింగ్ కి జనాలు బాగానే హాజరయ్యారు. కానీ నిర్వహణ బాలేదు మైకులు మొరాయించాయి. అలా వీటి విషయాల్లో చూస్తే కొంత ఫెయిల్ అయ్యారు అన్న మాట ఉంది. కానీ పెద్ద ఎత్తున జనాలను తీసుకుని రావడంలో మాత్రం కూటమి నేతలు సక్సెస్ అయ్యారు.
ఇలా సిద్ధం వర్సెస్ ప్రజాగళం అని తీసుకుంటే సిద్ధం పేరులో బిగ్ సౌండ్ ఉందని ప్రజాగళం అన్నది సాదాగా ఉందని అంటున్నారు. ఇక ప్రజాగళం సభలో ప్రధాన ఆకర్షణ నరేంద్ర మోడీ. ఆయన దేశ ప్రధాని, మరోసారి ప్రధాని అవుతారని అంచనాలు ఉన్నాయి. కూటమి పెద్ద. ఆయన ఏపీకి ఏమైనా వరాలు ఇస్తారని అంతా ఎదురుచూశారు. కానీ మోడీ నిరాశపరిచారు అని అంటున్నారు.
ఇక చూస్తే చంద్రబాబుని ఆయన అనుభవాన్ని గత పాలనను పొగడలేదు. బాబే మీకు సీఎం అవుతారు ఓటు వేసి గెలిపించండి అని కూటమి పెద్దన్నగా జనాలకు మోడీ అప్పీల్ చేయలేదని అంటున్నారు. ఇక ఏపీలో జగన్ ని వ్యక్తిగతంగా మోడీ ఎటాక్ చేయలేదు. ఇది కూడా ప్రజాగళంలో కనిపించిన మరో లోటు అని అంటున్నారు. రాష్ట్రంలో మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు అని అన్నారు తప్ప జగన్ అవినీతి గురించి ఏమీ డైరెక్ట్ గా చెప్పలేదు.
ఇక ఏపీకి పది లక్షల ఇళ్ళు ఇచ్చామని నరేంద్ర మోడీ ప్రజాగళం సభలో చెప్పారు. మరి ఆ ఇళ్ళు ఎక్కడ అని ప్రజలు అడుగుతున్న సందర్భం ఉంది. మొత్తానికి చూస్తే చిలకలూరిపేటలో ప్రజాగళంలో మోడీ చేసిన ప్రసంగంలో పస లేదని, చంద్రబాబు మోడీని పొగడడానికే సభను పెట్టారని కూడా అంతా అంటున్నారు. ఎన్నికల వేడి ఉన్న వేళ ఆ స్థాయిలో ఈ మీటింగ్ జనం మీద ప్రభావం చూపించలేదు అని అంటున్నారు.
మొత్తానికి చూసుకుంటే సిద్ధం వర్సెస్ ప్రజాగళం లో యుద్దానికి మేము సిద్ధం అన్నట్లుగా ప్రజాగళం కొంతమేర సక్సెస్ అయింది అని అంటున్నారు. రానున్న రోజులల్లో ఈ రెండు పేర్లతోనే జనంలోకి అటు వైసీపీ ఇటు కూటమి వెళ్ళబోతున్నాయి. ఈ నేపధ్యంలో సిద్ధం సభలు ఎలా ఉంటాయో ప్రజాగళం పేరుతో కూటమి పెద్దలు ఎలా జనాలకు చేరువ అవుతారో చూడాలి.
ఏది ఏమైనా కూడా ఎవరికి ఓటు వేయాలన్నది ప్రజలు అన్నీ చూసుకునే డిసైడ్ అవుతారు అన్నది ఒక రాజకీయ విశ్లేషణ. ఈ సభకు సమావేశాలు ఇవన్నీ సినిమాకు ముందు చేసే ప్రచారం లాంటివి వీటి ద్వారా ఆయా పార్టీలకు ఎంతో కొంత పాజిటివిటీ పెరగవచ్చు కానీ ప్రజలు అసలైన అంశాలను చూసి మరీ తీర్పు ఇస్తారు అని అంటున్నారు.