చెప్పినట్లుగానే బెంగళూరుకు... ఎంపీని అదుపులోకి తీసుకున్న సిట్!

జర్మనీ నుంచి బయలుదేరి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఆయనను సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2024-05-31 05:33 GMT

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి వేళ కర్ణాటక రాజకీయాల్లో ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం అటు కర్ణాటక రాజకీయాలతో పాటు కేంద్రంలోని బీజేపీకి తలనొప్పిగా మారిన పరిస్థితి అనే కామెంట్లు వినిపించాయి. ఈ సమయంలో ఈ కేసులో అనూహ్యపరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు.

అవును... పలువురు మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను బెంగళూరు పోలీసులు గురువారం అర్ధరాత్రి దాటాక అరెస్ట్ చేశారు. జర్మనీ నుంచి బయలుదేరి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఆయనను సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీభద్రత మధ్య విచారణ నిమిత్తం సీఐడీ కార్యాయానికి తరలించారు.

కాగా... పలువురు మహిళలపై ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి చేసినట్లు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో... ఆయన గత ఏప్రిల్‌ లో దేశం విడిచి పరారయ్యారు. ఈ సందర్భంగా జర్మనీ వెళ్లినట్లు కథనాలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఆయనపై మూడు కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథయంలో ప్రజ్వల్ జాడ కోసం పోలీసులు ముమ్మరంగా గాలించారు.

ఈ క్రమంలోనే ఆయనపై నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్‌ కార్నర్‌ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఇదే సమయలో కర్ణాటక సీఎం ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ దౌత్య పాస్‌ పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది! ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలంటూ ఆయన కుటుంబ సభ్యులు బహిరంగంగానే కోరారు.

ఇందులో భాగంగా... ఆయన తండ్రి హెచ్‌.డీ. రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డీ. కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్‌.డీ. దేవెగౌడ ఈ విషయంలో ప్రజ్వల్ ను బహిరంగానే కోరారు. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ స్పందించారు. ఇందులో భాగంగా తనపై నమోదైన కేసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు. మే 31న సిట్‌ ముందు హాజరవుతానని వీడియో సందేశంలో వెల్లడించారు.

ఈ క్రమంలోనే గురువారం అర్ధరాత్రి దాటాక ఆయన బెంగళూరుకు చేరుకోవడం.. ఆయన విమానాశ్రయానికి చేరుకోగానే సిట్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకోవడం జరిగిపోయింది. మరోవైపు బెంగళూరు కోర్టులో రేవణ్ణకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది.

Tags:    

Similar News