ఎట్టకేలకు.. ఒక పడవను బయటకు తీసుకొచ్చారు

అయితే.. ఇందులో కుట్ర కోణం ఉందంటూ కూటమి సర్కారు ఆరోపణలు చేస్తోంది. దీనికి ప్రతిగా వైసీపీ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం లేని పరిస్థితి.

Update: 2024-09-18 04:27 GMT

విన్నంతనే.. ఇదో సమస్యా? అన్నట్లు ఉంటూనే.. భారీ సవాలుగా మారి.. బయటకు తెచ్చేందుకు చుక్కలుచూపిస్తున్న నాలుగు బోట్లలో ఒక బోట్ ను ఎట్టకేలకు మంగవారం బయటకు తీసుకొచ్చారు. మరోమూడు బోట్లు ఇంకా బ్యారేజీలోని ఇసుకలో కూరుకుపోయిన పరిస్థితి. భారీగా వరదలు చోటు చేసుకున్న వేళ.. కట్టి ఉంచిన భారీ పడవలు (ఒక్కొక్కటి దగ్గర దగ్గర 40 టన్నులు. టన్ను అంటే 1000 కేజీలు. అంటే.. 40వేల కేజీలు అన్న మాట) కొట్టుకు వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొనటం తెలిసిందే. అయితే.. ఇందులో కుట్ర కోణం ఉందంటూ కూటమి సర్కారు ఆరోపణలు చేస్తోంది. దీనికి ప్రతిగా వైసీపీ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం లేని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. ప్రకాశం బ్యారేజీ అడుగున మట్టిలో కూరుకుపోయిన భారీ పడవల్ని బయటకు తీసుకురావటం పెద్ద సవాలుగా మారింది. ఇప్పటికే మూడు రకాలుగా ప్రయోగాలు చేసినా వర్కువుట్ కాకపోవటంతో.. నాలుగో పద్దతిని అనుసరించటం.. సక్సెస్ ఫుల్ గా బయటకు తీసుకొచ్చారు. వారాల తరబడి ప్రయత్నాలు సాగినా.. పడవల్ని బయటకు తీసుకురాలేని పరిస్థితి. దీంతో.. అత్యాధునిక సాంకేతికతతో ఒక భారీ బోట్ ను బెకెం ఇన్ ఫ్రా సంస్థకు చెందిన ఇంజినీర్లు అతి కష్టమ్మీదా బయటకు తీశారు.

దీంతో.. మరో రెండు భారీ.. మరో మోస్తరు బోట్ ప్రకాశం బ్యారేజీలో ఉంది. వీటిని బుధవారం బయటకు తీసే వీలుందన్న మాట వినిపిస్తోంది. పడవ వెలికితీతలో భాగంగా రెండు భారీ బోట్లకు గడ్డర్లు పెట్టి బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఈ రెండింటికి అదనంగా మరో రెండు పడవులతో లాగుతూ బ్యారేజీ అడుగున మట్టిలో కూరుకున్న బోట్ ను లాగారు. చివరకు వాటిని ఒడ్డుకు తీసుకొచ్చారు. బోటు మునిగిన తర్వాత ఇసుక.. నీళ్లు చేరటంతో ఒక్కో బోటు 100 టన్నులకు పెరిగిపోయింది. దీంతో.. దీన్ని బయటకు తీసుకురావటం పెను సవాలుగా మారింది. మొత్తంగా సవాలుగా మారిన భారీ బోట్ లను బయటకు తీసుకొచ్చే ఎపిసోడ్ లో ఒక విజయం నమోదైందని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. ఈ బోట్లను ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేసే లక్ష్యంలో భాగంగా కావాలని వదిలినట్లుగా చేస్తున్న ఆరోపణల్లో పస లేదన్న వ్యాఖ్య చేశారు సీపీఐ అగ్రనేత నారాయణ. వరదలకు కొట్టుకు వచ్చిన బోట్లను కావాలని వదిలినట్లుగా ప్రచారం చేయటంలో అర్థం లేదన్నారు. విపత్తులు విరుచుకుపడినప్పుడు ఇలాంటి వాటిని భరించక తప్పదన్న ఆయన..బ్యారేజీ కూల్చేయటానికే బోట్లు వదిలారనే వాదన సరికాదన్నారు.

అతిశయోక్తి మాటలు మానుకోవాలని.. వాస్తవాలు మాట్లాడాలన్నారు. అసలైన దొంగల్ని ప్రభుత్వాలు పట్టుకోవాలన్న నారాయణ.. వరదల వేళ ముఖ్యమంత్రి.. మంత్రులు మొత్తం విజయవాడ మీదనే ఫోకస్ చేశారని.. మిగిలిన ప్రాంతాల్ని పట్టించుకోలేదన్నారు. గ్రామాల్లో పర్యటిస్తుంటే.. తమకు ఎలాంటి సాయం అందలేదని బాధితులు చెబుతున్నారన్నారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు ఏ చిన్న సాయం కూడా అందలేదని విమర్శించారు. చంద్రబాబుకు విజయవాడలో పబ్లిసిటీ బాగానే వచ్చిందంటూ.. ‘‘ఎంతసేపూ పడవల్లో తిరిగి బాధ పడి అయ్యో.. అమ్మో అని కన్నీళ్లు పెట్టుకుంటే కుదరదు. చంద్రబాబు ఇప్పటికైనా బుడమేరు యుటిని చూడాలి. యుద్ధ ప్రాతిపదికన రీ మోడల్ చేయాలి’’ అంటూ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News