ఈ నియోజకవర్గం కోసం ఒత్తిడి పెరిగిపోతోందా ?
ఇంతకీ నేతలు టికెట్ కోసం బాగా పోటీపడుతున్న నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ లోక్ సభ కూడా ఒకటి.
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయటానికి తెలంగాణా కాంగ్రెస్ లో పోటీ పెరిగిపోతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పార్టీ కాబట్టి రేపటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా అన్నీస్ధానాల్లో గెలుస్తామనే నమ్మకం నేతల్లో పెరిగిపోతోంది. ఈ నమ్మకం కారణంగానే 17 స్ధానాల్లో పోటీకి సీనియర్ల నుండి కొత్తగా చేరిన వారు కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంతకీ నేతలు టికెట్ కోసం బాగా పోటీపడుతున్న నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ లోక్ సభ కూడా ఒకటి.
ప్రస్తుతం ఇపుడు బీజేపీ తరపున కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రేపటి ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎవరు పోటీచేస్తారనే విషయమై క్లారిటీలేదు. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ తరపున మాత్రం చాలామంది పోటీకి రెడీ అవుతున్నారు. ఈమధ్యనే పార్టీలో చేరిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, తాజాగా చేరిన డిప్యుటి మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అలాగే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తో పాటు లోకల్ కార్పొరేటర్లు, మాజీ ఎంఎల్ఏలు చాలామంది టికెట్ కావాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారని సమాచారం.
వీళ్ళంతా ముందుగా రేవంత్ రెడ్డిని కలిసి టికెట్ అడుగుతున్నారు. తర్వాత ఢిల్లీకి వెళ్ళి తమదైన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జీలతో ఉన్న పరిచయాలను అడ్డంపెట్టుకుని టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ తరపున పోటీకి ఎవరు ప్రయత్నాలు చేసుకుంటున్నారనే విషయం కూడా చర్చల్లోకి రావటంలేదు.
నిజానికి బొంతు రామ్మోహన్, శ్రీలత దంపతులు ముందుగా కేసీయార్, కేటీయార్ ను కలిసి సికింద్రాబాద్ లేదా మల్కాజ్ గిరి టికెట్లు కావాలని అడిగారట. అయితే అందుకు కేసీయార్, కేటీయార్ నిరాకరించటంతో వెంటనే కాంగ్రెస్ లో చేరిపోయారు. చేరేముందే టికెట్ విషయంలో వీళ్ళు హస్తంపార్టీలోని కీలక నేతల దగ్గర హామీ తీసుకున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. మరి టికెట్ ఎవరికి వస్తుందో ? ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిగా మారింది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.