అమెరికా వర్సిటీల్లో నిరసన లు.. భారతీయ విద్యార్థులకు భారత్ కీలక సూచనలు!
అమెరికన్ విద్యా సంస్థలలో కొనసాగుతున్న నిరసనలకు సంబంధించి స్థానిక చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని భారతీయ విద్యార్థులకు వెల్లడించింది.
ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ తీవ్రవాదులు దాడి చేసి వందలాది మందిని కాల్చిచంపడంతోపాటు బందీలుగా పట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో రెచ్చిపోయిన ఇజ్రాయెల్.. హమాస్ పర్యవేక్షణలో ఉన్న పాలస్తీనాపై విరుచుకుపడింది. ఆరు నెలల క్రితం మొదలుపెట్టిన ఈ యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 40 వేల మంది పాలస్తీనా ప్రజలు మరణించారు. వీరిలో అత్యధికులు మహిళలు, చిన్నారులే.
కాగా ఇజ్రాయెల్ కు అమెరికా అన్ని రకాలుగా సాయం అందిస్తోందని ఆరోపిస్తూ అమెరికాలోని విద్యా సంస్థల్లో పాలస్తీనా అనుకూల విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ కు అమెరికా ఆర్థిక, సైనిక సహకారాన్ని ఉపసంహరించుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. వేలాది మంది ప్రజల ప్రాణాలు తీసిన ఇజ్రాయెల్ ను ఉగ్రవాద దేశంగా అంతర్జాతీయ న్యాయస్థానం మెట్లెక్కించాలని కోరుతున్నారు. అంతేకాకుండా ఇజ్రాయెల్ తో అమెరికా సంబంధాలను తెంచుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఐవీ లీగ్ కొలంబియా యూనివర్సిటీలో గత వారం మొదలైన నిరసనలు అమెరికా అంతటా వ్యాపించాయి. దీంతో ఇప్పటివరకు వందలాది మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. నిరసనలు ఎంఐటీ, హార్వర్డ్, యేల్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా వర్సిటీల వరకు పాకాయి.
ఇదే కారణంతో ప్రతిష్టాత్మక ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో చదువుతున్న ఒక భారతీయ సంతతికి చెందిన విద్యార్థిని అచింత్య శివలింగన్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు క్యాంపస్ ఆవరణలో విద్యార్థుల నేతృత్వంలో నిర్వహించిన పాలస్తీనా అనుకూల శిబిరం నిరసనలో పాల్గొన్నందుకుగాను అచింత్యపై యూనివర్శిటీ బహిష్కరణ వేటు వేసింది.
ఈ మేరకు ప్రిన్స్ టన్ యూనివర్సిటీ ప్రాంగణంలో పాలస్తీనాకు అనుకూల నినాదాలు చేయడంతోపాటు ఇజ్రాయెల్ వ్యతిరేకంగా నిరసన నిర్వహించడం వంటి కారణాలతో భారత సంతతి విద్యార్థిని అచింత్య శివలింగన్ తోపాటు మరో విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. నిరసనలను నిలిపి వేయాలని పదేపదే కోరినా పట్టించుకోకపోవడంతోనే వారిని అరెస్టు చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికాలోని భారతీయ విద్యార్థులకు కీలక సూచనలు చేసింది. అమెరికన్ విద్యా సంస్థలలో కొనసాగుతున్న నిరసనలకు సంబంధించి స్థానిక చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని భారతీయ విద్యార్థులకు వెల్లడించింది.
ఈ నిరసనలలో భారతీయ విద్యార్థుల ప్రమేయం గురించి ఇంకా ఎటువంటి నివేదికలు తమకు అందలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే తమకు సహాయం అందించాలని ఏ విద్యార్థి లేదా విద్యార్థుల కుటుంబాల నుంచి తమకు ఎలాంటి విన్నపాలు అందలేదని తెలిపింది.
ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీ మీడియాతో మాట్లడారు. అమెరికాలో భారతీయ విద్యార్థులు అక్కడి స్థానిక చట్టాలను, నిబంధనలను గౌరవించాలని.. వాటికనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.
నిరసనలో పాల్గొన్నందుకు తీసుకున్న క్రమశిక్షణా చర్యలకు సంబంధించి సహాయం కావాలని ఇప్పటివరకు భారతీయ విద్యార్థులు లేదా వారి కుటుంబాలు తమను సంప్రదించలేదని రణధీర్ జైశ్వాల్ తెలిపారు.
అమెరికాలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో వేలాది మంది భారతీయ విద్యార్థులు గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్నారు. చాలా మంది చదువులు పూర్తయ్యాక ఉద్యోగం చేసి ఇక్కడే స్థిరపడాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో వారు నిరసనలలో పాల్గొంటే అది వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఇలా జరగకుండా ఉండాలంటే అమెరికా చట్టాలను, స్థానిక నిబంధనలను భారతీయ విద్యార్థులు అనుసరించాలని సూచించింది.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హింసను ఉద్దేశించి మాట్లాడారు. శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజల హక్కు అని తెలిపారు. అయితే హింసాత్మక పనులకు అనుమతి లేదన్నారు. హింసకు దిగడం చట్ట విరుద్ధమని తెలిపారు.
యూనివర్సిటీల్లో విధ్వంసం, అతిక్రమణ, కిటికీలు పగలగొట్టడం, క్యాంపస్‌లను మూసివేయడం, తరగతులను బలవంతంగా రద్దు చేయడం. ఇవేమీ శాంతియుత నిరసన కాదన్నారు. ప్రజలను బెదిరించడం, ప్రజలను భయపెట్టడం, ప్రజల్లో భయాన్ని కలిగించడం శాంతియుత నిరసన కాదని స్పష్టం చేశారు. ఇది చట్ట వ్యతిరేకమని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్యానికి భిన్నాభిప్రాయాలు తప్పనిసరని అయితే అసమ్మతి ఎప్పుడూ హింసకు దారితీయకూడదన్నారు.