అత్యాచారం కేసు మహిళలపై పెట్టొచ్చా? సుప్రీం ముందుకు సిత్రమైన పిల్

సాధారణంగా అత్యాచారం జరిగిన ఉదంతాల్లో మహిళలు బాధితులుగా ఉండటం తెలిసిందే

Update: 2023-12-03 04:11 GMT

సాధారణంగా అత్యాచారం జరిగిన ఉదంతాల్లో మహిళలు బాధితులుగా ఉండటం తెలిసిందే. మరి.. అత్యాచార అభియోగాన్ని మహిళ మీద పెట్టొచ్చా? పెడితే అది చెల్లుబాటు అవుతుందా? అసలు అలాంటి అవకాశం ఉంటుందా? లాంటి ధర్మసందేహాలు ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయి. మహిళలపై అత్యాచార అభియోగాన్ని నమోదు చేసే అంశంపై విచారణకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓకే చేసింది. ఏదైనా కేసులో మహిళలపై అత్యాచార అభియోగాలను నమోదు చేయొచ్చా? అంటూ ఒక మహిళ వేసిన పిటిషన్ ను విచారణకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది.

తన కోడలు పెట్టిన అత్యాచార కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న 61 ఏళ్ల మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై తన స్పందన తెలియజేయాలంటూ పంజాబ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో మహిళపై అత్యాచారం కేసు నమోదు చేయొచ్చా? లేదా? అనే అంశాన్ని తాము పరిశీలిస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హ్రషికేశ్ రాయ్.. జస్టిస్ సంజయ్ కరోల్ ల ధర్మాసనం వెల్లడించింది.

ఈ అంశంపై ధర్మాసనం తేల్చే వరకు పిటిషన్ దారుకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తామని.. అయితే.. పోలీసుల దర్యాప్తునకు ఆరోపణలు ఎదుర్కొంటున్న పిటిషన్ దారు సహకరించాలని ఆదేశించింది. ఇంతకీ అసలీ వివాదంలోకి వెళితే.. పంజాబ్ కు చెందిన 61 ఏళ్ల మహిళ గత ఏడాది సెప్టెంబరులో తన పెద్ద కొడుక్కి ఒక అమ్మాయితో పెళ్లి జరిపించారు. కొడుకు అమెరికాలో ఉన్నప్పటికీ.. వర్చువల్ పద్దతిలో వారి పెళ్లి జరిగింది. ఆ తర్వాత నుంచి అత్తాకోడళ్లు ఒకే ఇంట్లో ఉన్నారు.

పెళ్లి తర్వాత ఆమె పెద్ద కొడుకు ఇండియాకురాలేదు. కొన్నాళ్లకు మహిళ చిన్న కొడుకు పోర్చుగల్ నుంచి రావటం.. ఈ ఏడాది జనవరిలో అతను తిరిగి వెళ్లిపోయాడు. అతను వెళ్లిన కొంతకాలానికి ఆత్త.. ఆమె చిన్న కొడుకు మీద కోడలు అత్యాచార కేసు పెట్టింది. తన నగ్న ఫోటోల్ని చూపించి.. తనపై అత్యాచారానికి పాల్పడినట్లుగా ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెపైనా.. ఆమె చిన్న కొడుకు మీద కేసు నమోదు చేశారు. తనపై జరిగిన అత్యాచారాన్ని బయటకు చెప్పొద్దని అత్త తనను బెదిరించిందని.. ఆమెపై అత్యాచార కేసు నమోదు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం అత్త కింది కోర్టుల్ని ఆశ్రయించగా.. ఆమె పిటిషన్ ను కొట్టేశాయి. ఈ నేపథ్యంలో ఆమె సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఈ సందర్భంగా ఒక మహిళపై మరో మహిళ అత్యాచార కేసు పెట్టొచ్చా? అంటూ ప్రశ్నించిన ఆమె ప్రశ్నను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకారాన్ని తెలిపింది.

Tags:    

Similar News