భారత్ శాంతి రేఖ.. మా దేశానికి రండి.. పుతిన్, జెలెన్ స్కీ ఆహ్వానం
ఈ యుద్ధ పరిస్థితుల్లో భారత్ తోనే శాంతిస్థాపన జరుగుతుందని పుతిన్, జెలెన్ స్కీ భావిస్తున్నారని తెలుస్తోంది.
ఇప్పటికి 25 నెలలవుతోంది.. ఆ యుద్ధం మొదలై.. ఇంకా కనుచు మేరలో పరిష్కారం కనిపించడంలేదు.. మొన్నటికి మొన్న రష్యా అధ్యక్షుడిగా పుతిన్ మరో ఆరేళ్లకు ఎన్నికయ్యాడు. ఉక్రెయిన్ కు నాటో సాయంపై మండిపడ్డాడు. దీన్నిబట్టి యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. మరోవైపు యుద్ధం మొదలై రెండేళ్లు అవుతున్న సందర్భంగా ఉక్రెయిన్ ప్రధాని జెలెన్ స్కీ పలువురు దేశాధినేతలను ఆహ్వానిస్తున్నారు. ఇక వీరిద్దరి మధ్య భారత ప్రధాని మోదీ సమతూకం పాటిస్తున్నారు.
యుద్ధాల కాలం కాదు..
‘‘21వ శతాబ్దం యుద్ధాల కాలం కాదు.. వీలైనంత త్వరగా, శాంతియుతంగా పరిష్కార యత్నాలకు భారత్ పూర్తి మద్దతిస్తుంది’’ ఇది ఉక్రెయిన్ యుద్ధం మొదటి నుంచి మోదీ చెబుతున్న మాట. దీనినే తాజాగా పునరుద్ఘాటించారు. పుతిన్, జెలెన్‌స్కీతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇద్దరూ తమ దేశాలకు మోదీని రమ్మన్నట్లు తెలుస్తోంది. అది కూడా ఎన్నికలు పూర్తయిన తర్వాత పర్యటించాలని కోరినట్లు సమాచారం.
భారత్ శాంతి దూత
ఈ యుద్ధ పరిస్థితుల్లో భారత్ తోనే శాంతిస్థాపన జరుగుతుందని పుతిన్, జెలెన్ స్కీ భావిస్తున్నారని తెలుస్తోంది. అందుకే మోదీని పిలిచినట్లు సమాచారం. అయితే, వీరి ఆహ్వానాన్ని మోదీ అంగీకరించారా? లేదా అన్నది తెలియరాలేదు. కాగా, మోదీ 2018లో రష్యాలో పర్యటించారు.
యుద్ధం మొదలైన నాటి నుంచి మోదీ పలుసార్లు పుతిన్, జెలెన్ స్కీ తో మాట్లాడారు. శాంతియుతంగా, దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. పుతిన్ తో భేటీ సందర్భంగా ఇది యుద్ధాల శకం కాదని సూచించారు. చర్చలు, దౌత్యపరమైన చర్యలే శరణ్యమని సూచించారు. ఉక్రెయిన్ కు మానవతా సాయం కొనసాగిస్తామని జెలెన్ స్కీకి తెలిపారు.