108 కాల్ సెంటర్ ఉద్యోగిపై చేయి చేసుకున్న మంత్రి రజనీ ఓఎస్డీ!
తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన సంబంధిత ఉద్యోగి చెంప ఛెళ్లుమనిపించారు. ఈ పరిణామంతో ఉద్యోగులు కంగుతినటంతో పాటు.. తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి రజనీ వద్ద ఓఎస్డీగా పని చేస్తున్న మధుసూధన్ రెడ్డి తీరును తప్పు పడుతున్నారు. ఎంత కోపం ఉంటే మాత్రం.. మరెంత ఆగ్రహం అయితే మాత్రం అందరి ఎదుట ఉద్యోగిపై చేయి చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. దీనిపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయటంతో పాటు.. దాదాపు పావు గంట పాటు అత్యవసర సేవలకు హాజరు కాకుండా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.
ఉన్నతాధకారుల జోక్యంతో తిరిగి విధులు నిర్వర్తించినప్పటికీ.. మంత్రిని ఇరుకున పడేసేలామారిన ఓఎస్డీ తీరును తప్పు పడుతున్నారు. దాదాపు వంద మంది ఉద్యోగుల మధ్య ఒక ఉద్యోగి పై ఆగ్రహం వ్యక్తం చేయటం ఒక ఎత్తు. సరిగా పని చేయలేదంటూచెంప ఛెళ్లుమనిపించిన వైనం షాకింగ్ గా మారింది. అసలీ పరిస్థితి ఎలా ఎదురైందన్న విషయంలోకి వెళితే.. అన్నమయ్య జిల్లాలో 108 అంబులెన్సు రాకలో జాప్యం ఏర్పడింది. ఈ కారణంగా రైలు ప్రమాద బాధితుడు మరణించినట్లుగా మీడియాలో వార్త వచ్చింది.
దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం 108 కాల్ సెంటర్ ను వివరణ అడిగింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వివరణ కోరినంతనే.. హడావుడి పడిన మధుసూధన్ రెడ్డి 108 కాల్ సెంటర్ లోని ఉద్యోగి వద్దకు వచ్చి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఓఎస్డీకి తన వివరణ ఉద్యోగి ఇస్తుండగా.. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన సంబంధిత ఉద్యోగి చెంప ఛెళ్లుమనిపించారు. ఈ పరిణామంతో ఉద్యోగులు కంగుతినటంతో పాటు.. తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఓఎస్డీ ఆగ్రహానికి బలైన ఉద్యోగికి మద్దతుగా నిలుస్తూ.. దాదాపు పావు గంట పాటు కాల్ సెంటర్ కు వచ్చిన కాల్స్ ను తీసుకోలేదు. దీంతో.. ఉన్నతాధికారులు హైరానా పడుతూ.. ఉద్యోగుల్ని బుజ్జగించారు. దీంతో.. పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనపై మధుసూధన్ రెడ్డికి మెమో ఇవ్వాలని ఆరోగ్య శ్రీ సీఈవోను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాల్ సెంటర్ కు ఫోన్ చేసే వారు అత్యవసర పరిస్థితుల్లో చేస్తారని.. అలాంటివారికి సాయంగా ఉండాల్సిన ఉద్యోగులు బాధ్యతారహితంగా వ్యవహరించిన కారణంగా తానుకొంత ఎమోషన్ అయ్యానని.. అందుకే అలా జరిగిందన్న వివరణ ఇవ్వటం గమనార్హం.