సుప్రీంకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్... గట్టిగా ఉచ్చు బిగుస్తుంది!
ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వాస్తవానికి వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్.లు అన్నింటినీ క్లబ్ చేయాలని రణవీర్ తన పిటిషన్ లో కోరాడు.
"ఇండియా గాట్ టాలెంట్" వేదికగా ఓ కంటెస్టెంట్ ను ఉద్దేశించి యూట్యూబర్ రణవీర్ అల్హబాదియా చేసిన వ్యాఖ్యలు ఎంత తీవ్ర దుమారం రేపాయనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే అతడిపై వేర్వేరు రాష్ట్రాల్లో ఎఫ్.ఐ.ఆర్.లు నమోదయ్యాయి. దీంతో.. ఆయన తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ చుక్కెదురైంది. ఇతడి అభ్యర్థనను సుప్రీం తోసిపుచ్చింది.
అవును... ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వాస్తవానికి వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్.లు అన్నింటినీ క్లబ్ చేయాలని రణవీర్ తన పిటిషన్ లో కోరాడు. ఇదే సమయంలో ముందస్తు బెయిల్ ను అభ్యర్థించాడు. ఈ క్రమంలో... అతడి విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజివ్ ఖన్నా ధర్మాసనం తిరస్కరించింది.
ఈ సందర్భంగా స్పందించిన న్యాయమూర్తి.. ఇప్పటికే కేటాయించిన తేదీకే విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.
కాగా... ఓ కామెడీ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ ని తల్లితండ్రుల గురించి, శృంగారం గురించి ప్రశ్నించి వివాదాల్లో చిక్కుకున్నాడు రణవీర్ అల్హబాదియా. ప్రస్తుతం ఇతడి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని చెబుతున్నారు. అతడు చేసిన వ్యాఖ్యలపై పలువురు పార్లమెంట్ సభ్యులు సైతం అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి.
ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. తాను ఈ షో చూడలేదు కానీ.. జరిగిన దాని గురించి తనకు సమాచారం అందిందని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు పూర్తిగా అనుచితం అని తెలిపారు. ప్రతీ ఒక్కరికీ వాక్ స్వాతంత్ర్యం ఉంటుంది కానీ.. మనం ఇతరుల స్వేచ్ఛను అతిక్రమిస్తే అది ముగుస్తుంది అని అన్నారు.
ఈ నేపథ్యంలో రణవీర్ క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని.. వాటిలో ఎలాంటి కామెడీ లేదని.. ఈ విధంగా తన ఛానల్ ను ప్రచారం చేసుకోవాలని తాను అనుకుంటున్నట్లు చాలా మంది భావిస్తున్నారు కానీ.. అది తన ఉద్దేశ్యం కాదని.. తన వ్యాఖ్యలను తాను సమర్ధించుకోవడం లేదని.. తనను క్షమించాలని అన్నాడు.
మరోపక్క... కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటీసుల మేరకు అతని వ్యాఖ్యలు ఉన్న వీడియోను యూట్యూబ్ డిలీట్ చేసింది. ఈ వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించిన జాతీయ మహిళా కమిషన్.. ఈ నెల 17న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.