వైరల్: కారు నడిపిన కేసీఆర్.. టైగర్ ఈజ్ బ్యాక్..
తాజాగా తన ఫాంహౌస్‌లో కారు నడుపుతూ కనిపించారు. గ్యారేజీ నుంచి తన కారును బయటకు తీసుకొస్తున్నానని, కాంగ్రెస్‌కు ఇక చుక్కలే అన్నట్లుగా సంకేతాలిచ్చారు.
చాలా కాలం తరువాత కేసీఆర్ ఫొటోలకు చిక్కారు. మీడియాలో వార్తగా వచ్చారు. కొద్ది నెలలుగా ఫాంహౌస్‌లోనే ఉంటూ.. మీడియా కంట పడకుండా రాజకీయాలు సాగిస్తున్న కేసీఆర్.. ఆకస్మాత్తుగా కనిపించారు. దీంతో ఆయన మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారని దీని ద్వారా ఇండికేషన్స్ ఇచ్చారని తెలుస్తోంది.
కొన్ని నెలలుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయంగా దూరంగా ఉన్నారు. గతేడాది డిసెంబరులో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో అపజయం పాలవడంతో.. కేసీఆర్ అప్పటి నుంచి ప్రజలకు దూరంగా ఉండిపోయారు. రాజకీయంగా ఎక్కడా కనిపించలేదు. ఒక్క ప్రెస్‌మీట్ కానీ, ఒక్క ప్రకటన కానీ ఇవ్వలేదు. మీడియాకే కాకుండా.. అటు పార్టీ నేతలకు, పార్టీ శ్రేణులకూ అందుబాటులో లేకుండా ఫాంహౌస్‌కు అంకితం అయ్యారు. దీంతో అప్పటి నుంచి పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. పలువురు ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు రాజీనామా చేసి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు.
ఇక.. పార్టీలో కీలక నేతలైన కేటీఆర్ హరీశ్ రావులే ముందు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. ఎప్పటికప్పుడు రేవంత్‌పై, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిత్యం నిరసనలు, ఆందోళనలు చేపడుతూనే ఉన్నారు. అయితే.. వాటికి అంతగా మైలేజీ రావడం లేదన్న అభిప్రాయం సొంత పార్టీలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ నెలల తరబడి ఎవరికి కనిపించకపోవడంతో అసలు ఆయనకు ఏమైందా అని అందరూ అనుకున్నారు. కానీ.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోతో కేసీఆర్ మరోసారి యాక్టివ్ కాబోతున్నారనన్న సంకేతాలు వెలువడ్డాయి.
రేవంత్ సర్కార్‌కు కాస్త సమయం ఇద్దామనే ఇన్ని నెలలుగా కేసీఆర్ ఫాంహౌస్‌కు పరిమితం అయ్యారన్న వార్తలు వినిపించాయి. అలాగే కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వెన్నాడినట్లు ఇటీవల కేటీఆర్ కూడా ప్రకటించారు. ఇటీవల ఓ జిల్లా నేతలతో సమావేశం అయిన కేసీఆర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. అందులో మాట్లాడుతూ.. త్వరలోనే ప్రజల్లోకి వస్తానని, ప్రభుత్వం తీరు ఏమాత్రం బాగోలేదని దుయ్యబట్టారు. కూల్చడానికే పగ్గాలు అప్పగించారా అని నిలదీశారు. ఇక నుంచి వస్తా అని చెప్పినట్లు తెలిసింది. ప్రజలు ఏం కోల్పోయారో వారికి అర్థమైందని, మళ్లీ ఎన్నికలు జరిగితే తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీదే విజయం ఖాయమని జోస్యం చెప్పారు.
అయితే.. కేసీఆర్ రాకకోసం ఆయన కార్యకర్తలే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు కేసీఆర్ నుంచి పాజిటివ్ స్టేట్‌మెంట్ రావడంతో అందరూ సంతోషంలో మునిగిపోయారు. జనవరి నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఇక నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ముందు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
పార్టీ ఓడిపోయిన తరువాత ఒక్కరోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. ఆ తరువాత నుంచి మళ్లీ కనిపించలేదు. ఇక ఇటీవల పాలకుర్తి జిల్లా నేతలతో సమావేశమై ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేసీఆర్.. తాజాగా తన ఫాంహౌస్‌లో కారు నడుపుతూ కనిపించారు. గ్యారేజీ నుంచి తన కారును బయటకు తీసుకొస్తున్నానని, కాంగ్రెస్‌కు ఇక చుక్కలే అన్నట్లుగా సంకేతాలిచ్చారు. మరోవైపు.. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం టైగర్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక కారు జోరును అడ్డుకోవడం రేవంత్ వల్ల కాదు కదా.. మరెవరి వల్ల కాదని అంటున్నారు.