దీక్షలను కూడా 20‌-20 ల్లా మార్చేసిన రాజకీయ పార్టీలు

రిలే నిరహారదీక్షలు, ఆమరణ నిరహారదీక్షలు అంటే రాజకీయాల్లో ఒకప్పుడు సంచలనం.

Update: 2024-04-13 11:30 GMT

రిలే నిరహారదీక్షలు, ఆమరణ నిరహారదీక్షలు అంటే రాజకీయాల్లో ఒకప్పుడు సంచలనం. సమస్య ఎంతో జఠిలమయినప్పుడే ఈ నిర్ణయాలు వెలువడేవి. స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీ సత్యాగ్రహ దీక్షలు, ఆంధ్రప్రదేశ్ కోసం పొట్టి శ్రీరాములు ఆమరణదీక్ష అనేక తరాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయి. ఆ మహనీయుల త్యాగాలను స్మరిస్తూ యువత, రాజకీయ నాయకులు స్ఫూర్థి పొందేవారు. కానీ ప్రస్తుత రాజకీయాలలో దీక్ష చేయడం అనేది కామెడీగా మారింది.

వైఎస్ మరణం తర్వాత పలు అంశాల మీద దీక్షలు చేసిన జగన్ ఒక రోజు, రెండు రోజుల గడువు పెట్టుకుని విరమించడం దీక్షలకు ఉన్న గౌరవం, విలువలను దిగజార్చాయి. ఇక ఆ తర్వాత షర్మిల కూడా ఇదే తరహా దీక్షలు చేసింది. బీజేపీ నేత బండి సంజయ్ దానిని మరింత దిగజార్చి ఆరు గంటలు, మూడు గంటల దీక్షలు చేసి దానిని మరింత దిగజార్చాడు. ఇటీవల కరీంనగర్ లో సాగునీరు, మద్దతుధర, రుణమాఫీ కోసం రైతు దీక్ష అని మరోసారి కామెడీకి తెరలేపాడు బండి సంజయ్.

ఎన్నికల నేపథ్యంలో ఈ తరహాలోనే వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రైతులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని ఈ నెల 15న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రైతు దీక్ష చేపడతానని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించాడు. అదే సమయంలో పదేళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ వైఫల్యాలు అంటూ ఈ నెల 14న కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో పాటు, అన్ని లోక్ సభ స్థానాలలో ఒక రోజు దీక్ష చేస్తామని కాంగ్రెస్ నేత, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

అసలు ఒక అంశంపై దీక్షకు దిగితే ఆ సమస్య పరిష్కారం కావడం, లేదా ప్రభుత్వం చర్చలకు వచ్చి సమస్య పరిష్కారం కోసం హామీ ఇచ్చే వరకు దీక్షకు కూర్చునేది. టెస్టు మ్యాచులు పోయి వన్డేలు, వన్డేలు పోయి టీ 20ల తరహాలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం పాశుపతాస్త్రాలుగా పరిగణించే దీక్షలు సమకాలీన రాజకీయ నాయకుల చేతజిక్కి కామెడీ షోలుగా మిగిలిపోతున్నాయి. అసలు ప్రజలు వీటి పేరు వింటేనే నవ్వుకునే స్థాయికి దిగజార్చారు.

Tags:    

Similar News