వెల్వెట్ షాంపో మీకు గుర్తుందా? అదిప్పుడు ఎవరి సొంతమో తెలుసా?

బడా విదేశీ సంస్థలు ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాటికి ధీటుగా నిలవని తీరుతో తన కళను పూర్తిగా కోల్పోయింది. ఇంతకూ ఆ బ్రాండ్ ఏదంటారా? వెల్వెట్.

Update: 2025-02-15 06:30 GMT

మీ వయసు నలభైకు పైనే అయితే.. ఈ వార్తకు ఇట్టే కనెక్టు అవుతారు. అదే.. యాభైకు పైనే అయితే.. ఒక్కసారి ఆశ్చర్యానికి గురవుతారు. ఎందుకుంటే.. అప్పట్లో మార్కెట్ దుమ్ము రేపటమే కాదు.. దేశీయ షాంపో వినియోగంలో సరికొత్త సంచలనానికి కారణమైన ఒక సంస్థ తర్వాతి రోజుల్లో తనను తాను అప్డేట్ చేసుకోకపోవటం.. మార్కెటింగ్ లో జరిగిన పొరపాట్లు.. బడా విదేశీ సంస్థలు ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాటికి ధీటుగా నిలవని తీరుతో తన కళను పూర్తిగా కోల్పోయింది. ఇంతకూ ఆ బ్రాండ్ ఏదంటారా? వెల్వెట్.

మన దేశంలో శాచెట్ లో షాంపోలను అమ్మే ప్రక్రియను షురూ చేసింది ఈ బ్రాండే. తమిళనాడుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సీకే రాజ్ కుమార్ 1980లో వెల్వెట్ బ్రాండ్ ను మార్కెట్ కు పరిచయం చేశారు. సుజాత బయోటెక్ సంస్థ పేరుతో దీన్ని మార్కెట్ లోపంపిణీ చేసేవారు. వెల్వెట్ షాంపోతో పాటు.. నివారణ్ 90 (దగ్గు సిరప్).. మెమరీ పెంచే మెమరీ ప్లస్ టాబ్లెట్లు ఈ సంస్థ ఉత్పత్తులే. అప్పట్లో వెల్వెట్ షాంపో పెను సంచలనం. అప్పటివరకు కుంకుడుకాయల్ని తలంటు కోసం వాడే స్థానే.. వెల్వెట్ షాంపో అది కూడా రూపాయి అంతకంటే తక్కువ ధరకే శాచెట్ అందుబాటులోకి తేవటంతో.. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఈ షాంపోను కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపేవారు.

దీంతో.. వెల్వెట్ షాంపో బ్రాండ్ లీడర్ గా ఎదిగింది. ఆ తర్వాత బహుజాతి సంస్థలు కూడా ఈ సూత్రాన్ని పాటించటంతో.. మార్కెట్ లో పోటీ ఎక్కువైంది. తర్వాతి కాలంలో రాజ్ కుమార్ కాలం చేయటం.. ఆయన సతీమణి సుజాత రాజ్ కుమార్ కంపెనీకి ప్రమోటర్లుగా ఉన్నప్పటికి.. పూర్వ వైభవం దిశగా మాత్రం అడుగులు వేయలేకపోయారు ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్రాండ్ ను దిగ్గజ సంస్థ రిలయన్స్ సొంతం చేసుకుంది.ఈ సంస్థను కొనుగోలు చేయటం ద్వారా ఎప్ఎంసీజీ విభాగంలో మరో పాత కంపెనీ చేరినట్లైంది.

ఇటీవల కాలంలో పాత బ్రాండ్లను రిలయన్స్ వరుస పెట్టి కొనుగోలు చేస్తోంది. ఇందులో భాగంగా కాంపా.. రావల్ గావ్ షుగర్ సంస్థలను రిలయన్స్ సొంతం చేసుకోవటం తెలిసిందే. ఒకప్పుడు వెల్వెట్ షాంపోలకు మంచి ఆదరణ ఉండేదన్న విషయాన్ని గుర్తు చేసిన రిలయన్స్ కన్జూమర్ సీవోవో కేతన్ మోడీ.. తాజాగా తమిళనాడులో ఈ బ్రాండ్లకు చెందిన ఉత్పత్తుల్ని విడుదల చేస్తామని చెప్పారు. ఆ తర్వాతి దశలో వీటిని దేశంలోని ఇతర ప్రాంతాలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. సబ్బులు.. బాడీ వాష్ లను వెల్వెట్ బ్రాండ్ మీద తీసుకురానున్నట్లుగా కేతన్ చెబుతున్నారు. అయితే.. ఈ డీల్ విలువ ఎంతన్న విషయం బయటకురాలేదు. ఏమైనా.. ఒకప్పుడు పెను సంచలనంగా ఉన్న బ్రాండ్లు కాలగర్భంలో కళ తప్పిన వేళ.. వాటికి పూర్వ వైభవాన్ని తెచ్చే దిశగా రిలయన్స్ చేస్తున్న ప్రయత్నాలు ఏమేర సక్సెస్ అవుతాయో చూడాలి.

Tags:    

Similar News