టీడీపీ పేరాబత్తులకు టెన్షన్.. టెన్షన్.. రీజనేంటి ..!
మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీగా బరిలో ఉన్న పేరాబత్తుల రాజశేఖర్ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది.
రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో కూటమి పార్టీల సమన్వయం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకింత గడబిడకు గురవుతున్నారు. వైసీపీ వంటి ప్రధాన పార్టీ పోటీలో లేకపోయినా.. గుంటూరు-కృష్ణాజిల్లాల పరిధిలో నాయకుల సమన్వయం కొరవడడంతో ఇక్కడ పోటీలో ఉన్న ఆలపాటి రాజా ఒక్కరే గ్రాడ్యుయేట్లకు ఫోన్లు చేసి.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీగా బరిలో ఉన్న పేరాబత్తుల రాజశేఖర్ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది.
ఈ స్థానంలో ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచిన మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయుడుతోపాటు.. స్వతంత్ర అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో పేరాబత్తుల పరిస్థితి డోలాయమానంలో పడినట్టు అయింది. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు అన్ని పక్షాల మద్దతు ఆయనకే ఉంది. అయితే.. జీవీ రంగంలోకి దిగి.. ఇతర పార్టీలనేతలతో మంతనాలు జరుపుతున్నారు. తన కుమారుడి గెలుపు కోసం జీవీ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు హంగూ ఆర్భాటం లేకుండా జీవీ కుమారుడు జీవీ సుందర్ చేస్తున్న ప్రచారం జోరుగా సాగుతోంది.
దీంతో పేరాబత్తుల పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక, జీవీ సుందర్ విషయానికి వస్తే.. సొంత మ్యానిఫెస్టో విడుదల చేయడం, విద్యాసంస్థల వద్ద సమావేశాలు నిర్వహించడం, గ్రాడ్యుయేట్లుతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా తటస్థులకు కూడా ఆయన చేరువ అవుతున్నారు. దీంతో పేరాబత్తుల అప్రమత్తమయ్యారు. పలు విద్యాసంస్థల యాజమాన్యాలతో స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. ఇప్పటికే జీవీ తన ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో పేరాబత్తుల ప్రయత్నాలు ఆసక్తిగా మారాయి.
ఇక, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 43 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో ఓట్ల చీలిక కూడా భారీగానే ఉంటుందని రాజశేఖర్ అంచనా వేస్తున్నారు. వామపక్షాల నుంచి డీవీ రాఘవులు, స్వతంత్ర అభ్యర్ధిగా జీవీ సుందర్, బండారు రామ్మోహన్‌రావు బరిలో ఉన్నారు. దీంతో పేరాబత్తుల రాజశేఖర్ కూటమిలోని అందర్నీ కలుపుకొని ప్రచారంలో జోరు పెంచారు. మరోవైపు.. సీఎం చంద్రబాబు కూడా పేరాబత్తుల ప్రచారంపై ఆరా తీస్తున్నారు. ఆయనకు సహకరించాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో పేరాబత్తుల విజయం అంత ఈజీకాదన్న సంకేతాలు వస్తున్నాయి.