వైసీపీ వర్సెస్ జనసేన : మార్చిలో పొలిటికల్ హీట్ ?

ఏపీలో మార్చిలో పొలిటికల్ హీట్ తప్పదా అన్న చర్చ సాగుతోంది. మార్చి నెల అంటేనే వేసవి కాలానికి ఆరంభం.

Update: 2025-02-15 18:30 GMT

ఏపీలో మార్చిలో పొలిటికల్ హీట్ తప్పదా అన్న చర్చ సాగుతోంది. మార్చి నెల అంటేనే వేసవి కాలానికి ఆరంభం. ఎండలు ఒక వైపు మండుతూ ఉంటాయి. అదే సమయంలో రాజకీయం కూడా వేడెక్కితే ఇక విశేషాలకు లోటు ఉండదనే అంటున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే మార్చి నెలలో వైసీపీ జనసేన రెండు పార్టీలూ పుట్టాయి.

వైసీపీని జగన్ 2011 మార్చి 12న ప్రారంభించారు. 2025 నాటికి ఆ పార్టీ పద్నాలుగేళ్ళను పూర్తి చేసుకుని 15వ ఏట అడుగు పెడుతోంది. ఇదిలా ఉంటే వైసీపీని ఏర్పాటు చేసినపుడు ఒక భావోద్వేగపూరిత వాతావరణం ఉండేది. వైఎస్సార్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది అన్న భావనతో పాటు కొత్త నాయకుడిగా జగన్ ఏపీకి అవసరం అన్న భావనతో ఏర్పాటు అయింది వైసీపీ.

వైసీపీ ఏర్పాటు జరుగుతూనే అదే ఏడాది మే నెలలో జరిగిన కడప ఎంపీ సీటు అలాగే పులివెందుల అసెంబ్లీ సీటుని బంపర్ మెజారిటీతో గెలుచుకుంది. ఇక 2014లో కూడా బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. 2019లో 151 సీట్లతో అధికారం దక్కించుకుంది. కానీ 2024లో మాత్రం వైసీపీ కేవలం 11 సీట్లను సాధించింది. దారుణమైన ఓటమిని మూటకట్టుంది.

ఈ నేపధ్యంలో వైసీపీ నుంచి పునాది నుంచే నాయకులు అంతా పార్టీని వీడిపోతున్నారు. ఈ క్రమంలో పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. వైసీపీ ఓటమి నుంచి ఇంకా కోలుకోలేదు. పార్టీలో ఉత్తేజం ఉత్సాహం అయితే రావడం లేదు

దాంతో మార్చి 12న పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఈసారి నిర్వహించాలని వైసీపీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ఏపీ అంతా ఈ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించడం ద్వారా పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకుని రావాలని చూస్తున్నారు. అదే విధంగా వైసీపీని ముందు ముందు ఎలా నడిపించాలన్న దాని మీద కూడా జగన్ పార్టీకి దిశా నిర్దేశం చేస్తారు అని అంటున్నారు.

రాజకీయంగా సంచనల నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు. మార్చి 12 నాటికి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తి అవుతుంది. దాంతో ఏప్రిల్ నుంచి జనంలోకి జగన్ వెళ్ళడానికి డేట్ ని కూడా ప్రకటిస్తారని అంటున్నారు ఉగాది పండుగ తరువాత నుంచి జనంలోకి జగన్ వెళ్తారని ఇప్పటికే పార్టీ వర్గాలు చెబుతునారు. దాంతో పాటుగా మరిన్ని కీలక నిర్ణయాలను పార్టీ తీసుకుంటుంది అని చెబుతున్నారు.

ఇక జనసేన చూస్తే ఆ పార్టీ 2014 మార్చి 14న ఏర్పాటు అయింది. అంటే 2025 నాటికి 11 ఏళ్ళు పూర్తి చేసుకుని 12వ ఏటకు ఆ పార్టీ అడుగుపెడుతుంది అన్న మాట. దాంతో పాటు జనసేన కష్టాలు కడగండ్లు అన్నీ దాటుకుని ప్రస్తుతం అధికారంలోకి వచ్చింది. ఈసారి జనసేనకు ఒక ప్రత్యేకత ఉంది. అధికారంలో ఉంటూ పార్టీ ప్లీనరీని నిర్వహించుకోవడం.

దాని కోసం పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 12 నుంచి 14 వరకూ మూడు రోజుల పాటు సాగే ఈ ప్లీనరీ జనసేన రాజకీయ గమనాన్ని భవిష్యత్తు ప్రణాళికను నిర్ణయిస్తుంది అని అంటున్నారు. పవన్ నుంచి సంచలన ప్రకటనలు ఆశించవచ్చు అని చెబుతున్నారు. అంతే కాదు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా జిల్లా యాత్రలను చేపడతారని అంటున్నారు. దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ని కూడా ఈ ప్లీనరీలో ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక వైసీపీ ఆవిర్భావ దినోత్సవాలలో కూటమి ప్రభుత్వం మీద ఘాటైన విమర్శలు ఉండవచ్చు అని అంటున్నారు. అలాగే జనసేన ప్లీనరీలో వైసీపీ మీద ధీటైన ప్రతి విమర్శలు చేసే చాన్స్ ఉందని అంటున్నారు. మొత్తానికి మార్చిలో ఏపీలో మండించే రాజకీయం చోటు చేసుకుంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News