ఏఐ ఇండెక్స్ లో మనం ఎక్కడ? తోపు దేశం ఏది?
ఇప్పుడు ఎక్కడ విన్నా.. ఏఐ అనే మాట మాత్రం కచ్ఛితంగా వినిపిస్తుంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ప్రపంచ ఉనికే మారిపోతోంది.
ఇప్పుడు ఎక్కడ విన్నా.. ఏఐ అనే మాట మాత్రం కచ్ఛితంగా వినిపిస్తుంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ప్రపంచ ఉనికే మారిపోతోంది. ఈ రంగం విస్తరిస్తున్నకొద్దీ ఈ రంగానికి చెందిన వారు విదేశాలకు వెళ్లిపోవటం ఎక్కువ అవుతోంది. ఈ మేధోవలస భారత్ కు సవాలుగా మారుతుందని చెబుతున్నారు. యువతలో ఏఐ నైపుణ్యాల్ని డెవలప్ చేయటంలో పురోగతి బాగానే ఉన్నా.. ఆ తరహా నిపుణులు దేశంలో స్థిరపడేలా చేయటంలో మాత్రం ఫెయిల్ అవుతున్న పరిస్థితి. ఇదే విషయాన్ని పలు రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి.
భారత ఏఐ నిపుణుల్లో ఎక్కువ మంది అమెరికాకు వెళుతున్నారు. భారీ వేతనాలతో పాటు.. అత్యాధునిక పరిశోధనలకు మంచి వాతావరణం ఉండటమే దీనికి కారణంగా చెప్పొచ్చు. ఏఐ టాలెంట్ కాన్సన్ ట్రేషన్ లో ప్రపంచంలో భారత ర్యాంక్ 13గా ఉన్నట్లు స్టాన్ ఫోర్డ్ వర్సిటీ ఏఐ ఇండెక్స్ రిపోర్టు 2024ను విడుదల చేసింది. ఇందులో టాప్ ఐదు దేశాల్లో ఇజ్రాయెల్ మొదటి స్థానంలో నిలవగా.. సింగపూర్ రెండో స్థానంలో.. దక్షిణ కొరియా మూడో స్థానంలో.. లక్సెంబర్గ్ నాలుగో స్థానంలో నిలవగా.. ఫిన్ లాండ్ ఐదో స్థానంలో నిలిచింది. విషాదకరమైన అంశం ఏమంటే.. ఆదే రిపోర్టు మరో అంశాన్ని ప్రస్తావించింది.
ప్రపంచంలో ఏఐ మేధోవలసలో మాత్రం భారతదేశం మొదటి స్థానంలో నిలిచినట్లుగా పేర్కొంది. ఏఐ నైపుణ్యాలున్న ప్రతి 10 వేల మంది లింక్డ్ ఇన్ ఖాతాదారుల్లో 0.76 శాతం మేధోవలస ఉన్నట్లుగా పేర్కొంది. అంటే.. ప్రతి పదివేల మంది భారతీయ ఏఐ నిపుణుల్లో దాదాపు ఒక శాతం విదేశాలకు వలస పోతున్నారు. అంతేకాదు.. ఏఐ పేటెంట్స్ విషయంలోనూ భారత్ వెనుకబడి ఉన్నట్లు రిపోర్టు వెల్లడించింది.
2022లో ప్రపంచ స్థాయి ఏఐ పేటెంట్స్ లో మనదేశం 0.23 శాతానికే పరిమితం కాగా.. ఈ విషయంలో చైనా ఆధిపత్యం కొనసాగుతోంది. గ్లోబల్ ఏఐ పేటెంట్స్ లో 61.13 శాతంతో చైనా మొదటి స్థానంలో ఉండగా.. 20.9 శాతంతో అమెరికా రెండో స్థానంలో ఉంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో అత్యుత్తమ ఏఐ నిపుణుల్లో భారత సంతతి వారే అధికంగా ఉన్నారు. వారిలో కొందరినైనా భారత్ కు తిరిగి తీసుకొచ్చి.. అవసరమైన పరిశోధన.. పర్యావరణ వ్యవస్థను.. సౌకర్యాల్ని కల్పిస్తే అంతో ఇంతో మార్పు రావటంతో పాటు.. సానుకూల ఫలితాలు సాధించే వీలుంది.మరి.. ఆ దిశగా ప్రభుత్వాలు ఏ మేరకు ఫోకస్ చేస్తాయన్నది ప్రశ్న.