13 సొంత విమానాలతో ఖతార్ దేశాధినేత ఆస్తుల విలువ?
ఒక దేశాధ్యక్షుడు భారతదేశంలో అడుగుపెట్టడం అంటే అక్కడ ప్రోటోకాల్, ప్రభుత్వ లాంఛనాలతో గౌరవం వగైరా అందరి దృష్టిని ఆకర్షిస్తాయి.
ఖతార్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు. ప్రధాని మోదీ ఢిల్లీ ఐజీఐ విమానాశ్రయంలో ఆయనకు కౌగిలింతతో స్వాగతం పలికారు. హమద్ అల్ థానీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశమై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపారు. ఒక దేశాధ్యక్షుడు భారతదేశంలో అడుగుపెట్టడం అంటే అక్కడ ప్రోటోకాల్, ప్రభుత్వ లాంఛనాలతో గౌరవం వగైరా అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. అంతేకాదు ఆ దేశాధ్యక్షుడి ప్రత్యేకతలు, సంపదల రేంజ్ గురించి సహజంగానే ప్రజల్లో ఆసక్తి నెలకొంటుంది.
షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ నికర ఆస్తి ఎంత? అంటే... ఖతార్‌లోని గ్రాండ్ దోహా రాయల్ ప్యాలెస్‌లో అతడు నివసిస్తున్నాడు. దీని విలువ సుమారు 1 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఈ ప్యాలెస్‌లో 100 కంటే ఎక్కువ గదులు, బాల్‌రూమ్‌లు, దాదాపు 500 కార్ల పార్కింగ్ సౌకర్యం ఉన్నాయి. రాజభవనంలోని కొన్ని భాగాలలో క్లిష్టమైన బంగారు చెక్కడాలతో తీర్చిదిద్దారు. షేక్ తమమ్ కి మూడు బిలియన్ల విలువైన యాచ్ కూడా సొంతంగా ఉంది. ఇది కాకుండా అతడి వద్ద 13 విమానాలు ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్న చక్రవర్తులలో తొమ్మిదవ స్థానంలో అతడి పేరు నిలిచింది. అల్ థానీ కుటుంబ నికర ఆస్తి విలువ సుమారు 335 బిలియన్ ల అమెరికన్ డాలర్లుగా అంచనా.
ఫ్యామిలీ వివరాలు:
తమీమ్ బిన్ అల్ థానీ 3 జూన్ 1980న ఖతార్ రాజధాని దోహాలో జన్మించాడు. అతడు ఖతార్‌లో ప్రాథమిక విద్యను పూర్తిచేసి, ఉన్నత విద్య కోసం బ్రిటన్ వెళ్ళాడు. ఖతార్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ వివరాల ప్రకారం.. ఇంగ్లండ్ లో విద్యను పూర్తి చేసిన తర్వాత అల్ థానీ ఖతార్ సైన్యంలో పనిచేశాడు. అతడు తన ప్రారంభ విద్యను లండన్‌లోని ప్రతిష్టాత్మక హారో స్కూల్‌లో పూర్తి చేసాడు. ఆ తర్వాత రాయల్ మిలిటరీ అకాడమీ ఆఫ్ ఇంగ్లాండ్‌లో చేరాడు. అక్కడ 1998లో పట్టభద్రుడయ్యాడు.
ఖతార్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఆర్మీలో రెండవ లెఫ్టినెంట్‌గా పని చేసాడు. షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ 25 జూన్ 2013న ఖతార్ రాష్ట్ర ఎమిర్‌గా తన బాధ్యతలను చేపట్టాడు. హమద్ అల్ థానీ కుటుంబం ఖతార్ ని 200 ఏళ్లుగా పాలిస్తోంది. షేక్ తమీమ్ మూడుసార్లు వివాహం చేసుకున్నాడు. 13 మంది పిల్లలను కన్నాడు. విలాసాలను ఆస్వాధించడంలో రాయల్ షేక్ లను మించి ఇంకెవరూ ప్రపంచంలోనే పుట్టరని చెబుతారు. ఖతార్ దేశాధినేతను ఎమీర్ అని గౌరవంగా పిలుస్తారు.