"యుఫోరియా"కు పవన్ హాజరు... చంద్రబాబుతో చిరునవ్వుల సందడి!

తలసేమియా బాధితుల కోసం భువనేశ్వరి చేపట్టిన ఈ కార్యక్రమంపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.

Update: 2025-02-15 15:46 GMT

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో "యుఫోరియా" మ్యూజికల్ నైట్ ఈవెంట్ ను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తలసేమియా వ్యాధి గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారు. తలసేమియా బాధితుల కోసం భువనేశ్వరి చేపట్టిన ఈ కార్యక్రమంపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.


ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ, నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక.. ఈ కార్యక్రమంలో పవన్ కనిపించడంతో.. ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది.


అవును... తలసేమియా బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో "యుఫోరియా" పేరుతో తమన్ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ ను ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్వాగతించారు. అనంతరం పవన్ కల్యాణ్ ప్రసంగించారు.


ఈ సందర్భంగా మాట్లాడిన పవన్... తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నారా భువనేశ్వరికి ధన్యవాదాలు అని తెలిపారు. తనకు ఆహ్వాన పత్రిక పంపినా వచ్చేవాడినని.. అయినప్పటీకీ ఫోన్ చేశారని.. ఆమెపై నాకు అపారమైన గౌరవం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో పలుమార్లు మేడం భువనేశ్వరి గారు అంటూ పవన్ కల్యాణ్ సంభోదించారు.


ఇదే సమయంలో... చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ లకు ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు పవన్ కల్యాణ్. ఈ నేపథ్యంలోనే.. ఇక్కడకు విచ్చేసినవారంతా డబ్బులు పెట్టి టిక్కెట్ కొనుక్కునివస్తే తాను మాత్రం ఫ్రీగా చూడటం తనకు నచ్చలేదని చెబుతూ.. తనవంతుగా రూ.50 లక్షల సాయం తలసామియా బాధితుల కోసం అందజేస్తున్నట్లు పవన్ ప్రకటించారు.

ఆ ప్రచారానికి తెర!:

ఆ సంగతి అలా ఉంటే... ఈ కార్యక్రమానికి పవన్ హాజరవ్వడంపై నిన్న మొన్నటి వరకూ జరిగిన ప్రచారానికి తెరపడిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా... ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ కి పవన్ కల్యాన్ హాజరుకాని సంగతి తెలిసిందే. అయితే.. అప్పుడు ఆయన వైరల్ ఫీవర్ తో పాటు స్పాండిలైటిస్ తో బాధపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

అయితే.. ఆ మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మంత్రుల పనితీరుపై ర్యాంకులు ప్రకటించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు పదో ర్యాంక్ దక్కింది! దీంతో.. పవన్ కల్యాణ్ అలిగారని.. మరోసారి లోకేష్ కు పవన్ కు మధ్య గ్యాప్ క్రియేట్ అయ్యిందనే చర్చ తెరపైకి వచ్చిందనే ప్రచారం కాస్త బలంగానే జరిగింది!

దీనికితోడు.. ఇటీవల చంద్రబాబు అధ్యక్షతన.. మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులతో జరిగిన కీలకమైన సమీక్షా సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరుకాలేదు. దీంతో.. ఆ ప్రచారం పీక్స్ కి చేరింది! అయితే.. తాజాగా "యుఫోరియా" కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరవ్వడం.. చంద్రబాబుతో చిరునవ్వులు చిందిస్తూ ముచ్చటించడంతో.. ఇక ఆ ప్రచారానికి తెరపడినట్లే అనే చర్చ తాజాగా మొదలైంది.

Tags:    

Similar News