రాహుల్‌ది ఏకులం.. ఏమతం?: బండి సంచలన కామెంట్లు
రేవంత్ మోడీని టార్గెట్ చేస్తే.. బీజేపీ నాయకులు రాహుల్‌ను టార్గెట్ చేసుకుని నిప్పులు చెరెగుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించిన చేసిన 'కులం' వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మోడీ కన్వర్టెడ్ బీసీ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పుట్టుకతో మోడీ బీసీ కులానికి చెందిన వ్యక్తి కాదన్నది రేవంత్ రెడ్డిఅభిప్రాయం. దీనినే ఆయన చెప్పుకొ చ్చారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు కొంత లేటైనా లేటెస్టుగా రియాక్ట్ అవుతున్నారు. రేవంత్ మోడీని టార్గెట్ చేస్తే.. బీజేపీ నాయకులు రాహుల్‌ను టార్గెట్ చేసుకుని నిప్పులు చెరెగుతున్నారు.
తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌పై నిప్పులు చెరిగారు. రాహుల్ ది ఏకులం? ఏ జాతి? ఏదేశం? అని నిలదీశారు. రాహుల్ తాత ఫిరోజ్ ఖాన్.. గాంధీనా? అని ప్రశ్నించారు. రాహుల్ ఎస్సీనా? ఎస్టీనా? బీసీనా? అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీకి కులం లేదు.. మతం లేదు.. జాతి లేదు.. దేశం కూడా లేదని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల నుంచి తప్పించుకునే ఎత్తుగడలోనే రేవంత్ మోడీపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
రాహుల్ గాంధీది ఏ కులం? అంటే.. రేవంత్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇక, కేంద్ర మం త్రి కిషన్ రెడ్డి కూడా రేవంత్‌పై నిప్పులు చెరిగారు. మున్నూరు కాపులు బీసీలు కాదా? అని ప్రశ్నించారు. రేవంత్ భాష చూసి సమాజం సిగ్గు పడుతోందని సీనియర్ నాయకుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి.. ఇలాంటి విమర్శలు చేస్తారా? అని ప్రశ్నించారు. మొత్తంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ సెగలు పుట్టిస్తున్నాయి.