రేవంత్ కామ్ గా ఉంటూ ఇంత ప్లానింగ్ చేశారా?

గడిచిన వారం రోజులుగా చూసినప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజుబుల్ గా లేరన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

Update: 2024-06-24 07:30 GMT

గడిచిన వారం రోజులుగా చూసినప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజుబుల్ గా లేరన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఓవైపు ఏపీలో కొత్త సర్కారు కొలువు తీరి.. యమా ఫాస్టుగా వెళుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు కనిపించట్లేదన్న విమర్శ పెరుగుతోంది. ఒకట్రెండు ప్రోగ్రాంలలో పాల్గొనటమే తప్పించి.. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన పనుల్లో వేగం కనిపించట్లేదన్న మాట వినిపిస్తోంది. అయితే.. అందరు అనుకుంటున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనంగా.. ఎలాంటి పని చేయకుండా లేరన్న విషయం ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే అర్థం కాక మానదు.

సీఎం రేవంత్ మౌనానికి అర్థం.. గులాబీ తోటలో కొత్త అలజడికి కారణమన్నమాట వినిపిస్తోంది. ఎన్నికలు ముగిసి.. ఫలితాలు వెల్లడై.. మరికొద్ది కాలం వరకు ఎలాంటి ఎన్నికలు లేని వేళ.. ప్రత్యర్థుల్ని మరింత బలహీనపర్చటం మీదన ముఖ్యమంత్రి రేవంత్ ఫోకస్ పెట్టిన విషయం అర్థమవుతుంది. తమ ప్రభుత్వానికి ఉన్న బలాన్ని మరింత పెంచుకోవటం.. అదే సమయంలో గులాబీ పార్టీని మరింత బలహీనం చేయటంతో పాటు.. సమీప భవిష్యత్తులో ఆ పార్టీ కోలుకోని రీతిలో దెబ్బ తీయాలన్నట్లుగా రేవంత్ ప్రయత్నాలు ఉన్నాయని చెప్పాలి.

మొన్నటికి మొన్న పోచారం ఫ్యామిలీకి హస్తం గూటికి తెచ్చేసిన ఆయన.. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకొచ్చేశారు. దీంతో.. అసెంబ్లీలో కాంగ్రెస్ బలాన్ని అంతకంతకూ పెంచేసుకుంటూ పోతున్న ఆయన తీరు చూస్తే.. ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ ను మరింత వేగవంతం చేశారన్న విషయం అర్థమవుతుంది. మొన్న పార్టీలోకి చేర్చుకున్న పోచారం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైతే.. తాజాగా పార్టీలోకి చేరిన సంజయ్ ఎమ్మెల్సీ కవితకు అత్యంత నమ్మకస్తుడిగా చెబుతారు.

ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమె అరెస్టు అయ్యారో అప్పటి నుంచి పార్టీ కార్యాకలాపాలకు దూరంగా ఉండటం మొదలు పెట్టారు. అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా కలవని గులాబీ బాస్ కేసీఆర్.. పార్టీ ఓటమి పాలైన తర్వాత పత్తా లేకుండా పోవటం.. ఎవరిని పెద్దగా కలవకపోవటం.. పార్టీని బలోపేతం చేయటం.. పార్టీ నేతల్లో ఉత్సాహాన్ని నింపటం లాంటివేమీ చేయకపోవటంతో వారిలో పలువురు గుర్రుగా ఉన్నారు. ఇలాంటి వేళ.. అలాంటి నేతల్ని పార్టీలోకి చేర్చుకోవటం ద్వారా కాంగ్రెస్ మరింత బలోపేతం అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ తీరు చూస్తే.. పాలన మీద కంటే పార్టీ మీదనే ఆయన ఫోకస్ ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News