ప్రచారంలో రేవంత్ రెడ్డికి చేదు అనుభవం
ఈ నేపథ్యంలోనే దౌల్తాబాద్ లో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన అనుచరులు సీఎం అని నినాదాలు చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ కు జవసత్వాలు వచ్చాయని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి సీఎం కావడం ఖాయమని ఆయన అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దౌల్తాబాద్ లో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన అనుచరులు సీఎం అని నినాదాలు చేశారు. అయితే, ఆ నినాదాలపై మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సీఎం అని అరిస్తే సరిపోదని, అది మీతోని అయ్యేది కాదని అన్నారు. ముందు రేవంత్ రెడ్డిని భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని, ఆ తర్వాత సీఎం అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రెండేళ్లలో కొడంగల్ కు కృష్ణా జలాలు తెస్తానన్న కేసీఆర్ ఎందుకు తేలేకపోయారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పెరిగిన ధరల ప్రకారం రైతులకు రైతు భరోసా 15000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక, కౌలు రైతులకు కూడా ఎకరాకు 15000 ఇస్తామని, భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తామని రేవంత్ ప్రకటించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు, ప్రచారం సందర్భంగా రేవంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. బీఆర్ఎస్ నేత, వైస్ ఎంపీపీ మహిపాల్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్త ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ కార్తకర్తలు రేవంత్ ను అడ్డుకున్నారు. మహిపాల్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన భార్య నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కల్పించుకున్న మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఒకవేళ మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలు తిట్టి ఉంటే అందరి ముందు క్షమించాలని మహిపాల్ రెడ్డి ని కోరుతున్నట్టుగా గుర్నాథ్ రెడ్డి అన్నారు. ఆయన క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.