40 పెర్సంట్ తో 11 సీట్లు...23 సీట్లు...లెక్క ఏంటి అంటే ...?
ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీకి 40 శాతం ఓటు షేర్ వచ్చినా 11 సీట్లే దక్కాయి.
రాజకీయ లెక్కలు భలే తమాషాగా ఉంటాయి. ఈ రోజున దేశంలో బీజేపీ మూడు సార్లు పాలిస్తోంది కానీ ఎపుడూ ఆ పార్టీకి 40 శాతం ఓటు షేర్ దక్కలేదు అంతే కాదు 37 శాతం కూడా దాటలేదు. మరి ఎలా జరిగింది అంటే ఓట్లు రావడం వేరు సీట్లు దక్కడం వేరు. అక్కడే మ్యాజిక్ చాలా ఉంది.
ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీకి 40 శాతం ఓటు షేర్ వచ్చినా 11 సీట్లే దక్కాయి. ఈ మతలబు ఏంటని వైసీపీ నేతలు అర్ధం కాక తోచిన తీరున విశ్లేషిస్తున్నారు. కాస్తా వెనక్కి వెళ్తే 2019లో చంద్రబాబు టీడీపీకి కూడా 40 శాతం ఓటు షేర్ వచ్చింది. సీట్లు చూస్తే 23 వచ్చాయి. ఇపుడు వైసీపీని అందులో సగం రావడం ఏంటి అంటే ఇదే రాజకీయ గణితం అని చెప్పాల్సి ఉంటుంది.
ఓట్ల శాతానికి వచ్చే సీట్లకు ఏలాంటి సంబంధం ఉండదు. ఎందుకంటే ఒక సీటులో లక్ష మెజారిటీ రావచ్చు. మరో సీటులో సింగిల్ డిజిట్ నంబర్ రావచ్చు. అపుడు తక్కువ ఓట్లు వచ్చినా ఆ సీటు కౌంట్ అవుతుంది కానీ ఓట్లు కాదు అన్నది ఇక్కడ చూడాల్సి ఉంది.
ఈ మధ్యనే వైసీపీకి చెందిన మాజీ మంత్రి ఆర్కే రోజా మాకు 40 శాతం ఓటు షేర్ వచ్చింది కానీ 11 సీట్లే వచ్చాయి ఇదేంటి అని వాపోయారు. మరి రోజా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రిగా రెండేళ్ళ పాటు పనిచేశారు. ఆమె రెండు సార్లూ తక్కువ ఓట్లతేనే గెలిచారు. అయినా ఆ సీటు వైసీపీ పరం అయింది. మరి ఈ లాజిక్ ఆమెకు ఎందుకు అర్థం కాలేదు అని అంటున్నారు.
అలాగే తెలంగాణాలో 40 శాతం ఓటు షేర్ సాధించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ని గెలిపించి తాను సీఎం అయ్యారు అదేలా అని ఆమె అంటున్నారు. అయితే తెలంగాణాలో జరిగింది వేరు. అక్కడ ట్రయాంగిల్ ఫైట్ జరిగింది. అధికారం కోసం కాంగ్రెస్ బీఆర్ ఎస్ బీజేపీ పోటీ పడి ఓట్లను ఎవరి స్థాయిలో వారు షేర్ చేసుకున్నాయి. ఈ ట్రయాంగిల్ లో కాంగ్రెస్ సాధించిన నలభై శాతం ఓటు షేర్ అత్యధికం అన్నది తెలుసుకోవాలని అంటున్నారు.
అదే ఏపీలో చూస్తే టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ముఖా ముఖీ పోరు సాగింది. ఓట్ల చీలిన అన్నది ఇక్కడ లేదు. అలాగే ఓట్లు అయితే కూటమి లేకపోతే వైసీపీ పంచుకున్నాయి. దాంతో 56 శాతం ఓట్ల షేర్ తో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక కాంగ్రెస్ కి 2.68 శాతం ఓట్ షేర్ దక్కింది అంతే.
అదే విధంగా కర్ణాటకలో చూస్తే బీజేపీకి పెద్ద ఎత్తున ఓట్ల శాతం వచ్చినా సీట్లు కాంగ్రెస్ కే ఎక్కువ వచ్చాయి. దానికి కారణం ముందే చెప్పినట్లుగా ఓవరాల్ స్టేట్ ఓటు షేర్ వేరు, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలలో వచ్చే ఓటు షేర్ వేరు. ఈ విధంగా చూడాల్సి ఉంటుంది.
అయితే వైసీపీ నేతలు మాత్రం ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకునే విషయంతో ఎందుకో ఒక వైపే చూస్తూ మాట్లాడుతున్నారు. ఏ స్టేట్ కి ఆ స్టేట్ లో ఫలితాలు ఓట్ల షేర్ అధికారాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి అన్నది తెలుసుకోవాల్సి ఉంది. సమగ్రమైన విశ్లేషణ చేస్తే అందరూ మెచ్చుకుంటారు కానీ మేమెందుకు ఓడిపోయామో మాకే తెలియదు అని మాట్లాడుతూంటే జనాలు నవ్వుకుంటారు పైగా మాకు బోలెడు ఓట్లు వచ్చాయి అని చెప్పుకుంటూ ఎందుకు సీట్లు రాలేదు అంటే రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వారు అంతా నవ్వుతారు.
ఓటమిని నిజాయతీగా తీసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చిత్తశుద్ధి ఇక్కడ అతి ముఖ్యం. అంతే తప్ప మా ఓటమికి ఈవీఎంలు కారణం అనో లేక మరోటో అని అనుమానంతో మాట్లాడితే వైసీపీ 2019లో గెలిచిన భారీ విక్టరీని కూడా జనాలు అనుమానిస్తారు. అపుడు అసలుకే ఎసరు వస్తుందని వైసీపీ వారు గ్రహిస్తే మంచిది అని అంటున్నారు.