రోజా లాంటివారు.. ఇక మార‌రా...?

వైసీపీలో నాయ‌కుల పేర్లు చెప్ప‌మంటే ఠ‌క్కున చెప్పే పేరు.. రోజా, కొడాలి నాని, పేర్నినాని, జోగి ర‌మేష్‌.. అంబ‌టి రాంబాబు వంటి కొంద‌రి పేర్లు గుర్తుకు వ‌స్తాయి.

Update: 2024-09-02 22:30 GMT

వైసీపీలో నాయ‌కుల పేర్లు చెప్ప‌మంటే ఠ‌క్కున చెప్పే పేరు.. రోజా, కొడాలి నాని, పేర్నినాని, జోగి ర‌మేష్‌.. అంబ‌టి రాంబాబు వంటి కొంద‌రి పేర్లు గుర్తుకు వ‌స్తాయి. అయితే.. వీరంతా ప‌రాజ‌యం పాల‌య్యారు. కొంద‌రు త‌మ వార‌సుల‌ను తీసుకువ‌చ్చి.. ఓట‌మి కార్డును చేజిక్కించుకున్నారు. అయితే.. ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌.. పార్టీ నానాటికీ డైల్యూల్ అవుతున్న నేప‌థ్యంలో కూడా.. ఎక్క‌డా నాయ‌కులు జాగ్ర‌త్త ప‌డుతున్న‌ట్టుగా కానీ, నాయ‌కులు ఎక్క‌డా రియ‌లైజ్ అవుతున్న‌ట్టుగా కానీ.. క‌నిపించ‌లేదు.

ఉదాహ‌ర‌ణ‌కు ఇప్పుడు పార్టీ సంక్లిష్ట ప‌రిస్థితిలో ఉంది. సీనియ‌ర్ నాయ‌కులు జంప‌య్యారు. మ‌రికొంద‌రు ఎప్పుడు వెళ్తారో తెలియ‌ని సంక‌ట స్థితిలో ప‌రిస్థితి ఉంది. ఇలాంటి స‌మ‌యంలో నాయ‌కులు ఆచితూచి క‌దా మాట్లాడాలి. పార్టీలో ఏమైనా త‌ప్పులు జ‌రిగి ఉంటే .. స‌మీక్షించుకుంటాం. భ‌విష్య‌త్తులో జాగ్ర‌త్త‌లు తీసుకుంటాం. ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తాం.. అని క‌దా..ఇప్పుడు చెప్పాల్సింది. అంతేకాదు.. పోతున్న నాయ‌కుల‌ను కాపాడుకుంటామ‌ని కూడా అనాలి.

కానీ, ఈ విష‌యంలో రోజా వంటి నాయ‌కులు ఏమాత్రం సంకోచం లేకుండా.. వైసీపీని మ‌రింత విమ‌ర్శ‌ల పాలు చేస్తున్నారు. వైసీపీ ఎంపీల ఫిరాయింపులపై స్పందిస్తూ గతంలోనూ ఇలాగే పార్టీలు మారిన వారి పరిస్ధితి ఏమైందో గుర్తుంచుకోవాలన‌డం.. ఇప్పుడు వైసీపీ నేత‌ల వ్య‌వ‌హారాన్నివిమ‌ర్శ‌ల‌కు దారి తీసేలా చేస్తోంది. పార్టీ నియమించిన వారు ఫిరాయిస్తున్నప్పుడు వారే తప్పో కరెక్టో ఆలోచించుకోవాలని, వీరితో జగనన్నకో, వైసీపీకో ఎలాంటి నష్టం ఉండదన్న రోజా వ్యాఖ్య‌లు.. రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్మ‌యం క‌లిగిస్తున్నాయి.

పార్టీకి ద్రోహం చేసి వెళ్లినవారిని ఎవరూ గౌరవించరు, క్షమించరని కూడా అన్నారు. కానీ, చిత్రం ఏంటంటే.. ఈ రోజా.. ఈ కొడాలి.. ఈ పేర్ని.. పొరుగు పార్టీల నుంచి వ‌చ్చి వైసీపీలో చేరిన‌వారే. జంపింగులు కామనైన రాజ‌కీయాల్లో త‌ప్పులు తెలుసుకుని ముందుకు సాగ‌డం ... పార్టీల ప్ర‌ధాన క‌ర్త‌వ్యం. కానీ, దీనిని వ‌దిలేసి.. ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం.. ఏమేర‌కు స‌మంజ‌స‌మనేది చూడాలి. ఏదేమైనా.. వైసీపీలో రోజా వంటి నాయ‌కులు.. ఎప్పుడూ.. వివాదాల‌కు కేంద్రంగానే ఉంటున్నారు ఉన్నారు.

Tags:    

Similar News