లేఆఫ్ కు షాకింగ్ స్పందన.. సీఈవో పాస్ పోర్టు చోరీ చేసిన ఉద్యోగి

ఉద్యోగాలు తీసేస్తున్నారన్న కోపంతో మాజీ ఉద్యోగి ఒకరు చేసిన షాకింగ్ పని వెలుగు చూసింది.

Update: 2024-08-17 04:55 GMT

ఉద్యోగాలు తీసేస్తున్నారన్న కోపంతో మాజీ ఉద్యోగి ఒకరు చేసిన షాకింగ్ పని వెలుగు చూసింది. తన పాస్ పోర్టును చోరీ చేశారంటూ వాపోతున్నారు బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సీఈవో. లేఆఫ్ ప్రకటించారన్న కోపాన్ని మనసులో పెట్టుకున్న సీనియర్ ఉద్యోగి ఒకరు.. కంపెనీ సీఈవో పాస్ పోర్టును దొంగలించటం ద్వారా వ్యాపార కలాపాలకు అడ్డంకిగా మారినట్లుగా పేర్కొన్నారు. ఆసక్తికరంగా మారిన ఈ ఉదంతానికి బెంగళూరు వేదికగా మారింది.

సార్థి ఏఐ సంస్థకు చెందిన సీఈవో విశ్వనాథ్ ఝూ. గత ఏడాది మాస్ లేఆఫ్ లతో ఈ సంస్థ వార్తల్లో నిలిచింది. కంపెనీని స్థాపించింది ఆయనే.. కంపెనీ సీఈవోగానూ ఆయనే వ్యవహరిస్తున్నారు. సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లేందుకు ఉద్యోగుల్ని తొలగించినట్లుగా ఆయన చేసిన ప్రకటన అప్పట్లో వైరల్ గా మారింది. అయితే.. తాను తీసుకున్న నిర్ణయం వెనుక ఇన్వెస్టర్ల ఒత్తిడి ఉందని పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. తాజాగా ఆయనకు సంబంధించిన ఒక షాకింగ్ అంశం వెలుగు చూసింది. అమెరికా వీసాతో ఉన్న తన పాస్ పోర్టు ను లేఆఫ్ లో తీసేసిన ఒక మాజీ ఉద్యోగి దొంగలించారన్నారు. ఈ కారణంగా తాను కంపెనీకి అవసరమైన నిధుల్ని తీసుకొచ్చేందుకు వీలుగా షెడ్యూల్ చేసుకున్న విదేశీ ప్రయాణాలు చేయలేకపోయినట్లుగా పేర్కొన్నారు. ఇప్పటికి కొత్త పాస్ పోర్టు వచ్చినప్పటికీ.. కొత్త యూఎస్ వీసా కోసం చాలాకాలం వెయిట్ చేయాల్సి రావటం సంస్థ మీద చాలా ప్రభావాన్ని చూపుతున్నట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ సంస్థ మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సిబ్బందికి జీతాలు ఇవ్వట్లేదన్న ఆరోపణల్ని కొట్టి పారేస్తున్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని.. అందరికి జీతాలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. మాజీ ఉద్యోగుల వాదన మాత్రం మరోలా ఉంది. కొందరు ఉద్యోగులకు ఏడాది నుంచి జీతాలు ఇవ్వట్లేదని.. లీగల్ నోటీసులు పంపినా స్పందించటం లేదని చెబుతున్నారు. అయితే.. తమ కంపెనీ భవిష్యత్తు ఆశాజనకంగా ఉందని.. కొత్త ఇన్వెస్టర్ల కోసం చూస్తున్నట్లుగా ఝూ చెబుతున్నారు. ఇంత రచ్చ జరిగిన తర్వాత కూడా సదరు సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా ముందుకు వస్తారా? అన్నది ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News