బాలినేని రూటులోనే మరో కీలక నేత కూడా!

ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో వైసీపీ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.

Update: 2024-09-19 09:45 GMT

ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో వైసీపీ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలువురు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. మరోవైపు టీడీపీలోకి వెళ్లడానికి ఇష్టపడనివారు, తమ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులతో తీవ్ర రాజకీయ వైరుధ్యాలు ఉన్నవారు జనసేన పార్టీని ఎంచుకుంటున్నారు.

ఈ క్రమంలో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. మంగళగిరిలో ఆయన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ను కలవనున్నారు.

బాలినేని శ్రీనివాసరెడ్డి బాటలోనే మరో వైసీపీ కీలక నేత సామినేని ఉదయభాను కూడా పయనిస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి మూడుసార్లు ఉదయభాను ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999, 2004ల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఉదయభాను ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో హ్యాట్రిక్‌ కు బ్రేక్‌ పడింది. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. 2014లో వైసీపీలోకి వచ్చి పోటీ చేసినా మరోసారి పరాజయమే ఎదురైంది. 2019లో వైసీపీ తరఫున ఉదయభాను జగ్గయ్యపేట నుంచి గెలుపొందారు. మంత్రి పదవికి రేసులో ఆయన పేరు కూడా బలంగా వినిపించినా చివరకు పదవి దక్కలేదు. ప్రభుత్వ విప్‌ పదవితో సర్దుకుపోయారు.

ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ ఉదయభాను జగ్గయ్యపేట నుంచి వైసీపీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు. ఆయనపై టీడీపీ అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్‌ (తాతయ్య) గెలుపొందారు.

ఈ నేపథ్యంలో ఉదయభాను పార్టీ మారాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఆయన సెప్టెంబర్‌ 25 లేదా 27 తేదీల్లో జనసేన పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలకమైన కాపు సామాజికవర్గానికి చెందినవారు.. ఉదయభాను. మొన్నటి ఎన్నికల్లో కాపు సామాజికవర్గమంతా జనసేనతో నడవడంతో ఆ పార్టీలో ఉంటే తనకు రాజకీయ భవిష్యత్‌ ఉంటుందని ఆయన తలపోస్తున్నారని చెబుతున్నారు.

ముఖ్యంగా తన కుమారుడి రాజకీయ భవిష్యత్‌ కు జనసేన పార్టీయే సరైందని ఉదయభాను నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేనలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని అంటున్నారు. ఇప్పటికే జగ్గయ్యపేట నియోజకవర్గంలో భారీ ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. అలాగే జనసేన జెండా దిమ్మెలను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఉదయభాను జనసేనలో చేరిక వైసీపీకి గట్టిదెబ్బేనని అంటున్నారు.

మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరాలని నిర్ణయించుకోవడంతో ఇటీవల ఆయనపై ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌.. పవన్‌ కళ్యాణ్‌ ను కలిసినట్టు తెలుస్తోంది. బాలినేని జనసేనలోకి వస్తే ఒంగోలులో తనకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆయన పవన్‌ దృష్టికి తెచ్చినట్టు సమాచారం. అయితే ఈ విషయంలో ఆందోళన వద్దని.. ఆ విషయాన్ని తాను చూసుకుంటానని పవన్‌.. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ కు హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు.

Tags:    

Similar News