ఆ కుంభకోణం.. మోసపోయిన 1000 మంది పోలీసులు!

మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలను హెచ్చరించే పోలీసులే భారీ సంఖ్యలో మోసపోయిన ఘటన హిమాచల్‌ ప్రదేశ్‌ లో సంచలనం సృష్టించింది.

Update: 2023-10-20 06:06 GMT

ఆధునిక సాంకేతికత పెరిగిపోయాక మనిషి జీవితం చాలా సులువుగా మారిపోయింది. చాలా పనులను టెక్నాలజీ సాయంతోనే ఇంటి నుంచే చక్కబెట్టుకుంటున్నారు. ఇదే సమయంలో టెక్నాలజీని ఉపయోగించుకుని మోసం చేసేవారు ఎక్కువ అయ్యారు. నకిలీ వెబ్‌ సైట్లు, యాప్స్, ఈమెయిల్స్‌ తదితరాల ద్వారా నేరగాళ్లు భారీ మోసాలకు తెరలేపుతున్నారు. వీటి వల్ల మోసపోయేవారిలో కేవలం సాధారణ ప్రజలే కాకుండా పోలీసులు కూడా ఉంటున్నారు.

మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలను హెచ్చరించే పోలీసులే భారీ సంఖ్యలో మోసపోయిన ఘటన హిమాచల్‌ ప్రదేశ్‌ లో సంచలనం సృష్టించింది. ఇలా ఒక నకిలీ వెబ్‌ సైట్‌ బారినపడి ఏకంగా 1,000 మంది పోలీసులు నష్టపోయారు. ఈ మేరకు హిమాచల్‌ ప్రదేశ్‌ లోని మండి జిల్లాలో కొందరు మోసగాళ్లు రూపొందించిన స్థానిక నకిలీ క్రిప్టో కరెన్సీ బారిన పడి ఏకంగా వెయ్యి మంది పోలీసులు మోసపోయారు. ఈ క్రమంలో ఈ నకిలీ క్రిప్టో కరెన్సీకి ప్రచారం చేసి భారీ ఎత్తున వెనకేసుకోవచ్చని భావించిన పోలీసులు తమ ఉద్యోగాలను సైతం వదిలిపెట్టడం గమనార్హం.

ఈ నకిలీ క్రిప్టో కరెన్సీ కుంభకోణం పూర్తి వివరాల్లోకి వెళ్తే... కొందరు మోసగాళ్లు 2018లో హిమాచల్‌ ప్రదేశ్‌ లోని మండి, హమీర్‌ పూర్, కాంగ్రా జిల్లాల్లో ‘కొర్వియో కాయిన్‌’ లేదా (కేఆర్‌వో) ‘డీజీటీ కాయిన్‌’ పేరుతో రెండు క్రిప్టో కరెన్సీలను ప్రారంభించారు. వీటి ధరలను తారుమారు చేసేందుకు నకిలీ వెబ్‌సైట్‌ ను సృష్టించారు.

అతి తక్కువ కాలంలో అధిక రాబడులు వస్తాయని పెద్ద ఎత్తున పెట్టుబడిదారులను సమీకరించారు. ఇందులో పెట్టుబడులు పెట్టినవారు తమకు తెలిసినవారి ద్వారా మరిన్ని పెట్టుబడులు పెట్టించారు. ఇలా పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారుల నెట్‌ వర్క్‌ ను అభివృద్ధి చేశారు. ఇందులో పోలీసులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా భారీగా ఉండటం గమనార్హం.

ప్రభుత్వ ఉపాధ్యాయులు, పోలీసులు కూడా చేరడంతో ఈ పథకంపై సామాన్యులకూ కూడా నమ్మకం పెరిగింది. దీంతో వారు సైతం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఈ క్రమంలో ప్రజలను, పోలీసులను, ఉద్యోగులను నమ్మించడానికి మొదట్లో భారీ రాబడులు అందించారు. దీంతో కొందరు పోలీసులు తమ ఉద్యోగులకు రాజీనామా చేసి ఈ క్రిప్టో కరెన్సీ వ్యవహారాల్లో తలమునకలయ్యారు.

ఈ నకిలీ క్రిప్టో కరెన్సీలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. కోట్లాది రూపాయలను పెట్టుబడులుగా పెట్టి మోసపోయారు. ఈ క్రమంలో కొందరు తెలివిగల పోలీసులు మాత్రం తాము పెట్టుబడులు పెట్టకుండా ప్రజలతో పెట్టుబడులు పెట్టించారు. ఈ క్రమంలో వారే ప్రమోటర్లుగా అవతారం ఎత్తారు. ప్రజలతో పెట్టుబడులు పెట్టించి భారీగా కొందరు పోలీసులు వెనకేసుకొన్నారు.

చివరకు ఈ మోసం బయటపడటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ కుంభకోణంపై హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణకు ఆదేశించింది. ఈ నకిలీ క్రిప్టో కరెన్సీ బారినపడి ఏకంగా లక్ష మంది మోసపోయారని సిట్‌ తేల్చింది. అలాగే రెండున్నర లక్షల గుర్తింపు కార్డులను గుర్తించినట్లు తెలిపింది. కొందరికి ఒకటికి మించి పలు కార్డులున్నట్లు స్పష్టమైంది. ఈ వ్యవహారంలో భాగస్వాములైన అందరినీ చట్టప్రకారం శిక్షిస్తామని హిమాచల్‌ ప్రదేశ్‌ డీజీపీ సంజయ్‌ కుందు ప్రకటించారు.

Tags:    

Similar News