అన్న అంబానీ ఆకాశంలో.. తమ్ముడు అంబానీ పాతాళంలో..సెబీ బ్యాన్

ఇంతేకాక.. నిధుల మళ్లింపు ఆరోపణలతో ‘రిలయన్స్‌ హోం ఫైనాన్స్‌’లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు, మరో 24 సంస్థలకూ నిషేధాన్ని వర్తింపజేసింది. అనిల్ పై రూ.25 కోట్ల జరిమానా వేసింది.

Update: 2024-08-23 09:20 GMT

జీవితం అంటే ఇంతేనేమో..? సరిగ్గా 20 ఏళ్ల కిందట ఇద్దరు అన్నదమ్ములదీ ఒకటే సామ్రాజ్యం.. తండ్రి చనిపోయిన రెండేళ్లు బాగానే ఉన్నారు. కానీ, తర్వాత తేడాలొచ్చాయి.. ఎంతకూ తెగని తగవులాట.. విడిపోవద్దురా అని అమ్మ ఎంత చెప్పినా ఏదీ ఆగలేదు. ఇప్పుడు చూస్తే.. అన్న అంతులేని సంపదతో ఆకాశంలో ఉన్నాడు. తమ్ముడు రోజురోజుకు పడిపోతూ వస్తున్నాడు. ఏ వ్యాపారి కూడా ఎదుర్కొనకూడని పరిస్థితుల్లో చిక్కుకున్నాడు. ఇదంతా దిగ్గజ వ్యాపారవేత్త దివంగత ధీరూబాయ్ అంబానీ ఇద్దరు కుమారుల గురించి.

ముకేశ్ ముందంజలో.. అనిల్ ఎక్కడ?

ధీరూబాయ్ ఇద్దరు కుమారుల్లో పెద్దవాడు ముకేశ్ అంబానీ తన రిలయన్స్ ఇండస్ట్రీస్ సామ్రాజాన్ని అంతకంతకూ విస్తరిస్తూ పోయారు. చిన్న కుమారుడు అనిల్ అంబానీ మాత్రం వెనుకబడిపోయారు. అనిల్‌ అంబానీపై శుక్రవారం సెబీ.. సెక్యూరిటీస్‌ మార్కెట్ల నుంచి ఐదేళ్ల నిషేధం విధించింది. ఇంతేకాక.. నిధుల మళ్లింపు ఆరోపణలతో ‘రిలయన్స్‌ హోం ఫైనాన్స్‌’లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు, మరో 24 సంస్థలకూ నిషేధాన్ని వర్తింపజేసింది. అనిల్ పై రూ.25 కోట్ల జరిమానా వేసింది. సెక్యూరిటీ మార్కెట్లతో సంబంధం ఉండే ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనకూడదని ఆంక్షలు విధించింది. ఏ నమోదిత కంపెనీ, సెబీలో రిజిస్టర్‌ అయిన మధ్యవర్తిత్వ సంస్థల్లో డైరెక్టర్‌ సహా ఎలాంటి కీలక పదవుల్లో ఉండొద్దని ఆదేశించింది. రిలయన్స్‌ హోమ్ ఫైనాన్స్‌ ను సైతం సెక్యూరిటీ మార్కెట్ల నుంచి ఆర్నెళ్ల పాటు నిషేధించింది. రూ.6 లక్షల జరిమానా వేసింది.

అనిల్‌ అనుబంధ సంస్థలకు ఆర్‌ హెచ్‌ ఎఫ్‌ ఎల్‌ నిధులను రుణం కింద మళ్లించారనేది సెబీ ఆరోపణ. అనిల్‌ ప్రభావంతో కీలక సీఈవోలు నోరు మెదపలేదని.. అందరూ కలిసి కుట్ర పన్నారని పేర్కొంది. ఆర్‌ ఎఫ్‌ హెచ్‌ ఎల్‌ డైరెక్టర్ల బోర్డును బేఖాతరు చేశారని ఆరోపించింది. అనిల్ కు చెందిన

ఇతర సంస్థలు నిధుల గ్రహీతలుగా లేదా మళ్లింపునకు మీడియేటర్ గా వ్యవహరించాయని తెలిపింది. అయితే, చాలా సంస్థలు రుణాలు తిరిగి చెల్లించలేదని తెలిపింది. ఇది ఆర్‌ ఎఫ్‌ హెచ్‌ ఎల్‌ దివాళాకు కారణమైందని.. పరిష్కార ప్రణాళికకు వెళ్లాల్సి వచ్చిందని పేర్కొంది. పబ్లిక్‌ షేర్‌ హోల్డర్ల పరిస్థితిని ఇది దారుణంగా మార్చిందని సెబీ నివేదికలో పేర్కొంది.

షేరు రూ.59 నుంచి 75 పైసలకు..

అనిల్ సంస్థ కారణంగా పబ్లిక్ షేర్ హోల్డర్లు ఎంతగా నష్టపోయారో కూడా సెబీ పేర్కొంది. 2018లో కంపెనీ షేరు ధర రూ.59.60 కాగా.. 2020 నాటికి మోసం బయటపడం, నిధులు అడుగంటడంతో 75 పైసలకు పడిపోయిందని.. 9 లక్షలమంది వాటాదారులు నష్టపోయారని తెలిపింది. అనిల్‌ అంబానీతో పాటు మరికొందరు కీలక అధికారులపైనా సెబీ భారీ జరిమానా వేసింది. మరికొన్ని సంస్థలు రూ.25 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. సెబీ నిషేధం విధించడం ఇది రెండోసారి. అక్రమంగా రుణాలు పొందడం లేదా రుణాలు జారీ అయ్యేందుకు సహకరించారని 2022లోనూ వీరందరిపై కొరడా ఝళిపించింది.

Tags:    

Similar News