మోడీకి షర్మిళ రేడియో గిఫ్ట్... తెరపైకి ఏపీ ప్రజల ఛార్జ్ షీట్!
ఈ సందర్భంగా మోడీకి ఒక బహుమతి పంపిన షర్మిళ... ఆయనపై ఏపీ ప్రజల ఛార్జ్ షీట్ ను ప్రకటించారు!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ డోస్ పెంచుకుతున్నారు. ఇందులో భాగంగా ఏపీలో టీడీపీ - జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడిన బీజేపీని కార్నర్ చేస్తున్నారు! ఏపీ రాష్ట్రానికి మోడీ & కో చేసిన అన్యాయం ఇదేనంటూ వివరాలు చెబుతూ విమర్శిస్తున్నారు. ఈ సందర్భంగా మోడీకి ఒక బహుమతి పంపిన షర్మిళ... ఆయనపై ఏపీ ప్రజల ఛార్జ్ షీట్ ను ప్రకటించారు!
అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ వైఎస్ షర్మిళ డోసు పెంచుతున్నారు. మోడీపై తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు. ఈ క్రమంలో.. గడిచిన పదేళ్ల కాలంలో దేశ ప్రధానిగా అన్నివర్గాలనూ మోసం చేస్తూ.. మతం పేరుతో ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని.. ఈ పాలనలో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, అన్ని విధాలా సర్వనాశనం అయ్యిందని షర్మిళ ఫైరయ్యారు!
ఈ క్రమంలో మొదటి ఐదేళ్లలో టీడీపీతో కలిసి ఉన్న బీజేపీ.. విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక్క వాగ్ధానాన్ని కూడా తీర్చలేదని.. ఈ రోజు మళ్ళీ.. ఏ టీడీపీతో తిట్టించుకున్నారో, ఏ టీడీపీని అయితే తిట్టారో వారితోనే కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని అన్నారు. ఇదే సమయంలో తెరచాటున జగన్ తోనూ దోస్తీ చేస్తూనే ఉన్నారని అన్నారు.
ఈ సందర్భంగా మరింత డోసు పెంచిన షర్మిళ... ఇంత సిగ్గుమాలిన రాజకీయం చేస్తూ, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ, అటు రాష్ట్రానికి ఎటువంటి మంచీ చేయని మోడీ.. ఏ మొహం పెట్టుకుని మాటిమాటికీ ప్రచారానికి ఈ గడ్డపై కాలు మోపుతున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి మోడీ చేసింది అన్యాయం కాదు.. అవన్నీ నేరాలు, పాపాలు అని షర్మిళ ధ్వజమెత్తారు.
ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీకి షర్మిళ ఓ రేడియోను గిఫ్ట్ గా పంపారు. దీనిలో ఏపీ ప్రజల మన్ కీ బాత్ వినాలని కోరారు. ఆయనకు రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదని విమర్శిస్తూ.. తిరుమల సాక్షిగా మాటిచ్చి మోసం చేసినందుకు ఏపీ ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మోడీపై ఏపీ ప్రజల ఛార్జ్ షీట్ ను షర్మిళ విడుదల చేశారు. అందులో పది పాయింట్లను ప్రస్థావించారు! అవి ఈ విధంగా ఉన్నాయి!
ప్రత్యేక హోదా:
రాష్ట్ర విభజన అనంతరం ఇప్పటివరకూ జరిగిన రెండు ఎన్నికలతో పాటు ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఎంట్రీతో హోదా అంశం అత్యంత కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన షర్మిళ... నాడు పార్లమెంట్ సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని, ఆ తర్వాత ఆ మాట మరిచి రాష్టాన్ని వెన్నుపోటు పొడిచారని ఫైర్ అయ్యారు.
పోలవరం:
ఇక ఏపీలో మరో అత్యంత కీలకమైన అంశం పోలవరం ప్రాజెక్ట్ అనేది తెలిసిన విషయమే. గతంలో దీన్ని జాతీయ ప్రాజెక్ట్ అని, తర్వాత రాష్ట్రమే చేపడుతుందని బీజేపీ - టీడీపీలు కలిసి ఆడిన క్రీడలో పోలవరం బలైపోయిన పరిష్థితి! ఈ నేపథ్యంలో... జగన్ రివర్స్ టెండరింగ్ ను అడ్డుకోకుండా పోలవరం వినాశనానికి నాంది పలికారు అని ఫైర్ అయిన షర్మిళ... ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించే కుట్రలు కూడా చేస్తున్నారని ఆరోపించారు!
అమరావతి:
ఏపీకి రాజధానిగా కూటమి అధికారంలో ఉన్న 2014 - 19 సమయంలో అమరావతిని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఏపీలో కూటమిగా ఎంట్రీ ఇచ్చిన బీజేపీకి ఈ విషయాన్ని గుర్తూ చేశారు షర్మిళ. ఇందులో భాగంగా... మీ చేతుల మీదుగా భూమిపూజ జరుపుకున్న అమరావతి రాజధాని పదేళ్ల తర్వాత కూడా పూర్తి కాలేదని ప్రధాని మొడీకి తెలిపారు.
విశాఖ ఉక్కు:
"విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు" నినాదంతో ఎందరో ప్రాణత్యాగాల మధ్య సాధించుకున్న ఈ పరిశ్రమను బీజేపీ ప్రైవేటైజేషన్ చేయాలని నిర్ణయంచుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై చిలకలూరిపేట సభలో కానీ, అనకాపల్లి సభలోకానీ కూటమి నేతలు మోడీతో ఒక్క మాట చెప్పించలేకపోయారు.. మోడీ కూడా చెప్పలేదు!
దీంతో... పోరాటాలు, ప్రాణార్పణ ద్వారా సాకారమైన విశాఖ ఉక్కును, అక్కడి సెంటిమెంట్ కు విరుద్ధంగా అమ్మేద్దామని చూస్తూ.. మరోపక్క విశాఖ మీద దొంగప్రేమ ఒలకబోస్తున్నారంటూ మోడీపై షర్మిల నిప్పులు చెరిగారు.
కడప స్టీల్ ప్లాంట్ - విశాఖ రైల్వే జోన్:
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన విభజన హామీల్లో కీలకమైన కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ విషయంలోనూ కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై మోడీని కలిసి ఉన్న చంద్రబాబు కానీ, జగన్ కానీ నిలదీయాల్సిన స్థాయిలో నిలదీయలేదనే విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాలను కూడా షర్మిళ ప్రస్థావించారు.
ఇందులో భాగంగా... కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ వంటి విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనేక హామీలను తుంగలో తొక్కి, రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశారని షర్మిళ మోడీని నిలదీశారు!
కేజ్రీవాల్ ని అరెస్ట్... దత్తపుత్రుడిపై చర్యలేవి?:
వీటితో పాటు... ఢిల్లీలో కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు కానీ.. ఏపీలో మీ దత్తపుత్రుడు మద్యం సిండికెట్లు నడుపుతూ, కల్తీ మద్యంతో మనుషుల ప్రాణాలు తీస్తున్నా మీరు ఉలక లేదు పలక లేదు అంటూ మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు షర్మిళ!
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు అంతం..!:
ఇదే క్రమంలో... దేశంలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు అంతం చేయడానికి పూనుకున్నారని.. రాష్ట్రంలో దళితులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్న.. మీ కమిషన్లకు ఫిర్యాదులు చేస్తున్నా.. మీరు రాష్ట్ర సర్కారును ప్రశ్నించలేదు, చర్యలకు ఉపక్రమించలేదని అన్నారు ఏపీ పీసీసీ చీఫ్.
మోడీ సర్కారు మౌనం యావత్ దేశానికే అవమానం!:
వీటితో పాటు రాష్ట్రంలో ఇసుక, మద్యం, ఖనిజాలు, అక్రమ కాంట్రాక్టులు, దొంగ దారిలో రాష్ట్రం చేస్తున్న అప్పులు.. ఇలా రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతున్నప్పటికీ కేంద్రం నుంచి ఎటువంటి చర్యలు లేవని నిలదీసిన షర్మిళ... కర్నూలులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబీఐ వచ్చి చేతకాక శాంతిభద్రతల సమస్యలు అంటూ వెనుతిరిగి పోయిందని.. ఈ విషయంలో మీ సర్కారు మౌనం యావత్ దేశానికే అవమానం అని షర్మిళ సంచలన వ్యాఖ్యలు చేశారు.
యువతను ఘోరంగా మోసం చేశారు!:
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా పదో అంశంగా ఉద్యోగాల ప్రస్థావన తెచ్చిన షర్మిళ... దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చి, ఇచ్చిన మాట తప్పి, దేశంలోని యువతను ఘోరంగా మోసం చేశారని షర్మిళ.. ప్రధాని మోడీపై నిప్పులు కక్కారు. ఈ సందర్భంగా ఏపీ గడ్డమీద అడుగుపెట్టిన ప్రతీసారి ఇక్కడ ప్రజలను క్షమాపణ కోరాలని ఛార్జ్ షీట్ ను విడుదల చేశారు.