5 రోజులు 8 గంటలు... మహిళా సీఎ మరణంపై శశిథరూర్ ఇంట్రస్టింగ్ పోస్ట్!

పూణెలోని సంస్థ కార్యాలయంలో విధుల్లో ఉండగా.. ఒక్కసారిగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను తోటి ఉద్యోగులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారా

Update: 2024-09-21 13:30 GMT

యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో పనిచేస్తున్న కొచీకి చెందిన అన్నా సెబాస్టియన్ అనే 26 ఏళ్ల చార్టెడ్ అకౌంటెంట్ ఈ జూలై 20న మరణించిన సంగతి తెలిసిందే. పూణెలోని సంస్థ కార్యాలయంలో విధుల్లో ఉండగా.. ఒక్కసారిగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను తోటి ఉద్యోగులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారా. అయితే... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అన్నా సెబాస్టియన్ మృతిచెందారు.

ఈ సమయంలో అన్నా సెబాస్టియన్ మరణానికి పని ఒత్తిడే కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల అన్నా సెబాస్టియన్ తల్లి యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా హెడ్ కు లేఖ రాశారు. దీంతో... ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. దీనిపై విచారణ జరుపుతామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు.

అవును... యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాలో అన్నా సెబాస్టియన్ అనే సీఏ పని ఒత్తిడి కారణంగా మృతి చెందిందనే విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ స్పందించారు. ఇందులో భాగంగా ఈవై ఇండియాలో రోజుకు 14 గంటల పాటు తీవ్రమైన ఒత్తిడి మధ్య నాలుగు నెలల పాటు పని చేసిన అన్నా సెబాస్టియన్ చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు.

ఈ సమయంలో... ఈ విషయం తెలిసి ఆమె తండ్రితో మాట్లాడి పరామర్శించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఓ సూచన నాకు ఆమోదయోగ్యమే అనిపించిందని చెప్పిన శశిథరూర్... ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో రోజుకు ఎనిమిది గంటలు, వారానికి ఐదు రోజులకు మించి ఉద్యోగులతో పని చేయించకూడదని.. అన్ని పని ప్రదేశాల్లో ఫిక్స్డ్ క్యాలెండర్ ఉండాలని.. పని ప్రదేశాలో మానవ హక్కులను అడ్డుకోకూడదని సూచించారని తెలిపారు.

ఇదే సమయంలో పని ప్రదేశాల్లో అమానవీయ చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు, జరిమానాలు విధించేలా చట్టం తీసుకురావాలని సూచించారని తెలిపారు! ఈ నేపథ్యంలో... వచ్చే పార్లమెంటులో ఈ అంశాన్ని తాను లేవనెత్తుతానని శశిథరూర్ ఎక్స్ వేదికగా తెలిపారు.

కాగా.. యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాలో పనిచేస్తున్న అన్నా సెబాస్టియన్ అనే ఛార్టర్డ్ అకౌంటెంట్ మృతిచెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఆమె మరణంతో పని గంటల అంశంపై మరోసారి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే స్పందించిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. వారానికి 40 గంటలకు మించి పని ఉండకూడదని.. దీనిపై పార్లమెంటులో చట్టం తెచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు.

Tags:    

Similar News