బస్సులో టీనేజర్ పై గ్యాంగ్ రే*ప్.. నిందితుల్లో డ్రైవర్.. కండక్టర్!
కోల్ కతా వైద్యవిద్యార్థిని దారుణ హత్యాచార ప్రకంపనలు దేశంలో ఎంతలా సాగుతున్నాయన్న విషయం తెలిసిందే.
కోల్ కతా వైద్యవిద్యార్థిని దారుణ హత్యాచార ప్రకంపనలు దేశంలో ఎంతలా సాగుతున్నాయన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరూ పెద్ద ఎత్తున గళం విప్పుతున్నారు. నిందితులకు కఠిన శిక్షలు విధించాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. దీనిపై సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకోవటం.. సీబీఐ రంగంలోకి దిగటం లాంటి ఘటనలుచోటు చేసుకున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లోని ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ లో ఆగి ఉన్న ఒక బస్సులో టీనేజర్ పై గ్యాంగ్ రే*ప్ చోటు చేసుకోవటం షాకింగ్ గా మారింది.
ఈ నెల పన్నెండున ఈ దారుణ ఘటన జరిగితే.. కాస్త ఆలస్యంగా వివరాలు బయటకు వచ్చాయి. రంగంలోకి దిగిన పోలీసులు జరిగిన ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా సీసీ కెమెరా ఫుటేజ్ ను స్వాధీనం చేసుకొని విశ్లేషిస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుల్లో ఉత్తరప్రదేశ్.. ఉత్తరాఖండ్ కు చెందిన వారు ఉండటం.. వీరిలోనే ప్రభుత్వ బస్సు డ్రైవర్..కండక్టర్ కూడా ఉండటం షాకింగ్ గా మారింది.
ఈ నెల 12న అర్థరాత్రి వేళలో ఇంటర్ స్టేట్ బస్ టర్మిన్ లోని 12వ ప్లాట్ ఫాం మీద ఉన్న ఒక బాలిక ఒంటరిగా ఉంది. ఈ సమాచారం అందుకున్న జిల్లా శిశు సంక్షేమ కమిటీ రంగంలోకి దిగి.. ఆమెను స్టేట్ హోంకు తరలించారు. అక్కడ కౌన్సెలింగ్ ఇవ్వగా.. తనపై జరిగిన దారుణాన్ని వెల్లడించింది. దీంతో.. స్పందించిన శిశు సంక్షేమ కమిటీ సభ్యురాలు ప్రతిభా జోషి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.
తాను పంజాబ్ రాష్ట్రానికి చెందిన దానినని.. తానో అనాథగా బాధితురాలు చెప్పింది. ఆ తర్వాత తనది ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ గా చెప్పినట్లుగా పేర్కొన్నారు. సదరు బాలిక మొరాదాబాద్ నుంచి ఢిల్లీకి.. అక్కడి నుంచి డెహ్రాడూన్ కు వచ్చినట్లుగా వెల్లడైంది. బస్సు గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత ప్రయాణికులంతా దిగిపోయిన తర్వాత.. సదరు బాలికపై బస్సు డ్రైవర్.. కండక్టర్ అఘాయిత్యానికి పాల్పడగా.. అనంతరం పక్కనే నిలిపి ఉంచి బస్సుల డ్రైవర్లు.. బస్టాండ్ క్యాషియర్ కూడా దారుణానికి పాల్పడినట్లుగా గుర్తించారు. ఈ ఉదంతం కలకలాన్ని రేపుతోంది.