బీఆరెస్స్ కు ఊహించని షాక్... ఎవరు నడిపించారో?
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపా దాస్ మున్షీల సమక్షంలో వారంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకొన్నారు.
తెలంగాణలో బీఆరెస్స్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. నిన్న మొన్నటి వరకూ ఎమ్మెల్యేలు కారు దిగి హస్తాన్ని అందుకుంటుంటే... తాజాగా ఎమ్మెల్సీలు షాకిచ్చారు. ఇందులో భాగంగా గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ లో చేరారు. దీంతో... ఈ విషయం బీఆరెస్స్ కు బిగ్ షాకే కాదు.. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
అవును... బీఆరెస్స్ కు భారీ షాక్ తలిగింది. ఏ మాత్రం గాసిప్స్ లేకుండా, ఊహాగాణాలకు అవకాశం లేకుండా.. ఎవరూ ఊహించని విధంగా అన్నట్లుగా ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు షాకిచ్చారు. ఒకేసారి ఆరుగురూ కారు దిగి హస్తాన్ని అందుకున్నారు. దీంతో... ఏమాత్రం లీకులు లేకుండా ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కాంగ్రెస్ లో చేరిపోయారు.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపా దాస్ మున్షీల సమక్షంలో వారంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకొన్నారు. బీఆరెస్స్ ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, ఎంఎస్ ప్రభాకర్, దండె విఠల్, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ లు పార్టీ మారినవారిలో ఉన్నారు.
గురువారం సాయంత్రం హైదరబాద్ లోని ఓ హోటల్ లో సమావేశమైన వీరంతా రాత్రి 11:30 - 12 గంటల సమయంలో జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ నివాసానికి చేరుకున్నారు. రేవంత్ ఢిల్లీ పర్యటన ముగించుకుని నివాసానికి చేరుకోగానే వారు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో... రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి, సీనియర్ నేత సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
కాగా... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆరెస్స్ కు వరుస షాక్ లు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ఆరుగురు బీఆరెస్స్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీలు కారు దిగిపోయారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్య లు పార్టీ మారిన ఎమ్మెల్యేలుగా ఉన్నారు.