ఏపీలో భూ ప్రకంపనలు... ఇళ్ల నుంచి జనం పరుగులు!
ఈ క్రమంలో శనివారం ఏపీలోని ప్రకాశం జిల్లాలో భూమి కంపించింది.
ఈ నెల 4న తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా కేంద్రంగా వచ్చిన భూ కంపం.. హైదరాబాద్, తెలంగాణలోని పలు ప్రాంతాలతోపాటు ఏపీలోని పలు జిల్లాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైందని పరిశోధకులు తెలిపారు. ఈ క్రమంలో శనివారం ఏపీలోని ప్రకాశం జిల్లాలో భూమి కంపించింది.
అవును... ఇటీవల తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా వచ్చిన భూకంపం ప్రభావం ఏపీలోని పలు ప్రాంతాల్లోనూ చూపించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... తాజాగా ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ సమయంలో ముండ్లమూరు స్కూల్ నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు.
ఈ సందర్భంగా.. ప్రకాశం జిల్లాలోని ముండమూరు, శంకారాపురం, పోలవరం, పుసుపుగల్లు, మారెళ్ల, వేంపాడు, తూర్పు కంభంపాడులో భూమి కంపించినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చారు. ఈ సమయంలో.. కొన్ని సెకన్ల పాటు స్వల్పంగా భూమి కంపించినట్లు చెబుతున్నారు.
ఇదే సమయంలో... తాళ్లూరు మండలంలోని తాళ్లూరు, గంగవరం, రమభద్రాపురం మొదలైన గ్రామాల్లో రెండు నుంచి మూడు సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించిందని అంటున్నారు. అయితే... ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది!
కాగా.. ములుగు జిల్లాలోని మేడారానికి ఉత్తర దిశలో భూమి లోపల సుమారు 40 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని చెబుతుండగా.. ఈ నెల 4న ప్రకంపనలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంపం ప్రభావంతో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, హన్మకొండ, భద్రాచలం తో పాటు ఏపీలోని పలు ప్రాంతల్లో భూమి కంపించిన సంగతి తెలిసిందే.