స్మితా సభర్వాల్ కు మరక అంటనుందా?

క్లీన్ చిట్ అధికారిణిగా పేరున్న ఆమెకు.. సమర్థత విషయంలోనూ చాలా మంది అధికారుల కంటే ముందు ఉంటారని చెబుతారు.;

Update: 2025-03-20 05:06 GMT

దేశంలోనే అత్యుత్తమ సర్వీసుల్లో ఒకటిగా చెప్పే ఐఏఎస్ (ఇండియన్ ఆడ్మినిస్ట్రేషన్ సర్వీస్) లుగా కొన్ని వందల మంది ఉంటారు. కానీ.. వీరిలో కొందరు మాత్రమే మిగిలిన వారికి భిన్నంగా ఉంటారు. అలాంటి కోవలోకే వస్తారు సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్. క్లీన్ చిట్ అధికారిణిగా పేరున్న ఆమెకు.. సమర్థత విషయంలోనూ చాలా మంది అధికారుల కంటే ముందు ఉంటారని చెబుతారు. ఈ కారణంగానే ఆమెకు కేసీఆర్ ప్రభుత్వంలో పెద్ద పీట వేశారని చెబుతారు.

పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఆమె హవా ఒక రేంజ్ లో నడిచినట్లుగా చెబుతారు. కేసీఆర్ మన్ననలు అందుకున్న కొద్ది మంది అధికారుల్లో ఆమె ఒకరు. రేవంత్ సర్కారులో ఆమెకు అప్రాధాన్య శాఖను కేటాయించినట్లుగా ప్రచారం జరిగినా.. ఆ శాఖలోనూ మెరుపులు మెరిపించటమే కాదు.. యావత్ దేశం తెలంగాణ వైపు తిరిగి చూసేలా చేసిన సత్తా ఆమె సొంతం. అవును.. మేలో జరిగే ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ ను కేంద్రంగా మార్చటంలో ఆమె కీలకపాత్ర పోషించారని చెబుతారు.

ఆమె పడిన కష్టానికి.. చేసిన ప్రయత్నాలకు ప్రతిగా మిస్ వరల్డ్ కాంపిటీషన్లకు తెలంగాణ వేదికగా మారింది. ఆమె ప్రయత్నాల్ని గుర్తించిన రేవంత్ సర్కారు ఆమెను ప్రోత్సహిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి వేళ.. ఆమెకు జయశంకర్ వర్సిటీ నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసిందన్న వాదనలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సర్వీసులో ఎప్పుడూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లుగా ఆరోపణలు లేని ఆమె ట్రాక్ రికార్డుకు భిన్నంగా తాజా ఆరోపణలు అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ఇంతకూ ఆమె మీద చేస్తున్న ఆరోపణల్ని చూస్తే.. ఇన్నోవా వాహనం అద్దె కింద తీసుకున్న నిధులు తిరిగి వర్సిటీకి ఇవ్వాలన్న నోటీసులు ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు. గత ప్రభుత్వంలో సీఎంవోలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న స్మితా సభర్వాల్ లేఖ మేరకు 2016 అక్టోబరునుంచి 2024 మార్చి వరకు నెలకు రూ.63 వేల చొప్పున అద్దె రూపంలో వర్సిటీ నుంచి తీసుకున్నారన్నది ఆరోపణ.

నిబంధనలకు విరుద్ధంగా వాహనం అద్దె పేరుతో 90 నెలలకు రూ.61 లక్షలు తీసుకున్న వైనాన్ని ఆడిట్ అభ్యంతరం వ్యక్తం చేసిందని.. దీనికి అనుగుణంగా నోటీసులు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. స్మితా సభర్వాల్ అద్దెకు తీసుకున్న వాహనం నాన్ టాక్స్ కాదని.. ఎల్లో ప్లేట్ వాహనం కూడా కాదని.. ప్రైవేటు వ్యక్తిగత వాహనంగా చెబుతున్నారు. పవన్ కుమార్ పేరు మీద ఉన్నట్లుగా ఆడిట్ విచారణలో వెల్లడైనట్లుగా చెబుతున్నారు.

సీఎంవో స్మితా సభర్వాల్ ఆఫీసు నుంచి ప్రతి నెలా వాహనం అద్దె రశీదులు రావటంతో వర్సిటీ యాజమాన్యం డబ్బులు చెల్లించినట్లుగా తేలినట్లుగా చెబుతున్నారు. ఈ ఆరోపణలపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జానయ్య స్పందిస్తూ నిజమేనని.. కాకుంటే ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి.. వారి సూచనలకు తగినట్లుగా నోటీసులు జారీ చేయనున్నట్లు చెబుతున్నారు.

అయితే.. ఇక్కడో అంశాన్ని ప్రస్తావించాలి. వ్యవసాయ వర్సిటీ నుంచి ఆమె అద్దె వాహనం వినియోగించటానికి కారణం.. ఆమె వ్యవసాయ శాఖ కార్యదర్శిగా వ్యవహరించారని.. ఇదంతా టెక్నికల్ ఇష్యూనే తప్పించి మరొకటి కాదంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చి.. ఇంత రచ్చ వెనుక ఆమెను ఎవరో కావాలనే టార్గెట్ చేసినట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై స్మితా సభర్వాల్ స్పందించాల్సి ఉంది.

Tags:    

Similar News